English | Telugu
ఈ పాటలో నటిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైన అర్జున్-సౌందర్య!
Updated : Jun 13, 2021
చిరంజీవిని పూర్తి పౌరాణిక పాత్రలో ఆవిష్కరించిన తొలి చిత్రం 'శ్రీ మంజునాథ' (2001). కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏక కాలంలో తెలుగు, కన్నడ భాషల్లో నిర్మాణమైన ఈ మూవీలో శివునిగా (శ్రీ మంజునాథునిగా) చిరంజీవి, పార్వతిగా మీనా నటించగా, భార్యాభర్తలుగా ప్రధాన పాత్రల్లో అర్జున్, సౌందర్య నటించారు. ఈ సినిమా ఆడియో సేల్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. కన్నడ సంగీత దర్శకుడు హంసలేఖ ఈ చిత్రంలోని పాటలకు సంగీత బాణీలు సమకూర్చారు. వేదవ్యాస, జె.కె. భారవి, భువనచంద్ర, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, చంద్రబోస్, సామవేదం షణ్ముఖశర్మ, విశ్వనాథ శాస్త్రి సాహిత్యం అందించారు.
విశ్వనాథ శాస్త్రి రచించగా ఎస్పీ బాలు, నందిత ఆలపించిన "ఆనందా పరమానందా" పాట చిత్రీకరణ అనుభవాలను ఆ సినిమా యూనిట్ అంత త్వరగా మరచిపోలేదు. వేద పండితులకు అర్జున్, సౌందర్య దంపతులు భోజనం వడ్డిస్తుండగా వారి కొడుకు చనిపోతాడు. ఆ విషయం ఆ కుటుంబసభ్యులకు మాత్రమే తెలుసు. భోజనం చేస్తున్న పండితులకు తెలిస్తే విస్తళ్ల ముందు నుంచి అందరూ లేచి వెళ్లిపోతారని అర్జున్, సౌందర్య, వారి కుటుంబసభ్యులు అంతులేని బాధను దిగమింగుకుంటూ పదార్థాలు వడ్డిస్తుంటారు. అలాంటి సమయంలో పండితులు "నీ గానామృతంతో మమ్మల్ని ఆనందపరవశుల్ని చేయి నాయనా" అని అర్జున్‌ను అడుగుతారు.
కళ్లు తుడుచుకొని, ముఖంలో ఆనందాన్ని ప్రదర్శిస్తూ "ఆనందా పరమానందా" అంటూ పాడతాడు అర్జున్. సౌందర్య కూడా అందుకుంటుంది. కొండంత వేదనను మనసులో అణచుకుంటూ పాట పాడుతూ పండితుల్ని పరవశుల్ని చేసే ఆ హెవీ సీన్ చేస్తున్నప్పుడు అందరి మూడ్ పాడైపోయింది. ముఖ్యంగా అర్జున్, సౌందర్య తమలో కలుగుతున్న ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఆ పాట పూర్తిచేసి, ఇద్దరూ మరో మూవీ షూటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. ఈలోగా సాంగ్ షూటింగ్ పూర్తయ్యేలా లేదు. దాంతో ఆ రోజుకు వాళ్లిద్దర్నీ వెళ్లిమని చెప్పారు నిర్మాత నారా జయశ్రీదేవి.
సరేనని, వేరే సినిమా షూటింగ్‌కు వెళ్లిన అర్జున్, సౌందర్య.. అక్కడ కూడా ఈ పాటే గుర్తుకువస్తుంటే సరిగా నటించలేకపోయారు. ఆ నిర్మాతకు చెప్పి, వాళ్ల షూటింగ్ పోస్ట్‌పోన్ చేయించి, తిరిగివచ్చి "ఆనందా పరమానందా" పాటను పూర్తిచేశారు. అందుకే ఇప్పటికీ ఆ పాట విన్నప్పుడల్లా.. అర్జున్ సహా ఆ పాటలో పాల్గొన్న యూనిట్ అంతా ఎమోషనల్‌గా ఫీలవుతుంటారు.