English | Telugu
మూడేళ్లు.. ఒకే ఫ్యామిలీలోని ముగ్గురు వరుసగా జాతీయ అవార్డులు సాధించారు!
Updated : Jun 12, 2021
దక్షిణాదిన ఉత్తమ నటుల ఫ్యామిలీ ఏదంటే హాసన్ ఫ్యామిలీనే చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ముగ్గురు జాతీయ ఉత్తమ నటీనటులున్నారు. అన్నదమ్ములైన చారు హాసన్, కమల్ హాసన్ ఉత్తమ నటులు కాగా, చారు హాసన్ కుమార్తె సుహాసిని సైతం జాతీయ ఉత్తమ నటే. వీళ్లందరిలో ముందుగా జాతీయ అవార్డు సాధించింది కమల్. బాలూ మహేంద్ర డైరెక్ట్ చేసిన 'మూండ్రమ్ పిరై' (తెలుగులో 'వసంత కోకిల')లో నటనకు గాను 1982లో ఆయనకు ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు.. నాయకన్, ఇండియన్ సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు.
కమల్ తర్వాత ఆ కుటుంబంలో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు సుహాసిని. లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం 'సింధు భైరవి' (1985)లో సింధుగా చేసిన పాత్ర ఆమెకు ఆ అవార్డును సాధించి పెట్టింది. కుమార్తె అవార్డును సాధించిన మరుసటి ఏడాదే చారు హాసన్ సైతం బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. గిరీశ్ కాసరవల్లి రూపొందించిన కన్నడ మూవీ 'తబరన కథే' (1986)లో ప్రదర్శించిన నటనతో ఆ అవార్డును ఆయన పొందారు. ఆ తర్వాత సంవత్సరం.. అంటే 1987లో తన రెండో నేషనల్ అవార్డును అందుకున్నారు కమల్. మణిరత్నం రూపొందించిన గ్రేట్ ఫిల్మ్ 'నాయకన్'లో చేసిన టైటిల్ రోల్ ఆయనకు అవార్డును అందించింది.
ఇలా వరుసగా మూడేళ్లు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నటనలో జాతీయ అవార్డులు అందుకోవడం అత్యంత అరుదైన విశేషంగా చెప్పుకోవాలి. కొన్నాళ్ల క్రితం చారు హాసన్‌తో ఒకరు, "మీరు ఉత్తమనటులు, మీ కుమార్తె కూడా ఉత్తమనటి. అదృష్టవంతులు" అన్నారు. దానికి చారు హాసన్ సమాధానం.. "నా దృష్టిలో సంపూర్ణ నటుడు కమల్ ఒక్కడే." అదీ విషయం. కమల్, సుహాసిని ఇద్దరూ తెలుగులోనూ గొప్ప గొప్ప పాత్రలు చేశారు. 'స్వాతిముత్యం', 'సాగర సంగమం' లాంటి చిత్రాల్లో కమల్ నటనను, 'సిరివెన్నెల', 'స్వాతి' లాంటి సినిమాల్లో సుహాసిని నటనను మరవగలమా!