English | Telugu
ఎంజీఆర్‌కు జానకి మూడో భార్య అనీ, ఆమెకు ఆయన రెండో భర్త అనీ మీకు తెలుసా?
Updated : Jun 14, 2021
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎంజీ రామచంద్రన్ కన్నుమూశాక మూడు వారాల పాటు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పదవిని నిర్వహించారు ఆయన భార్య జానకీ రామచంద్రన్. 1987 చివరలో ఎంజీఆర్ మృతిచెందగా, జానకి 1996లో మరణించారు. మనలో చాలామందికి తెలీని విషయం ఎంజీఆర్‌కు జానకి మూడో భార్య అనీ, అలాగే జానకికి ఎంజీఆర్ రెండో భర్త అనీ. జానకి అసలు పేరు వైక్కం నారాయణియమ్మ జానకి. 1923లో కేరళలోని ఓ తమిళ నాయర్ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సినీ గేయరచయిత కావడం వల్ల చిన్నతనం నుంచే జానకికి సినిమాలంటే మోజు ఉండేది.
సినిమాల్లో నటించాలనే కోరికతోటే మద్రాసుకు వచ్చారామె. నవాబ్ రాజమాణిక్యం నాటక సంస్థ నిర్మించిన 'ఇవ్వసాగరం' అనే సినిమాలో నటించే అవకాశం లభించింది. అప్పుడామె వయసు పదమూడేళ్లు. అయితే దురదృష్టవశాత్తూ ఆ ఫిలిమ్ రీల్స్ అగ్నిప్రమాదంలో ఆహుతయ్యాయి. ఆ ఘటన జానకిని చాలా బాధపెట్టింది. అయితే 'కృష్ణన్ తూడు' సినిమాలో అవకాశం రావడంతో ఆ బాధ తాత్కాలికమే అయ్యింది. సినీ రంగం మీద ఉన్న ఆపేక్ష కారణంగా ఆమెకు ఆ రంగంలోని వ్యక్తినే వివాహం చేసుకోవాలనే కోరిక ఉండేది. అదీ నెరవేరింది. ప్రగతి స్టూడియోలో మేకప్‌మేన్‌గా ఉంటూ సహాయపాత్రలు ధరించిన గణపతి భట్‌ను ఆమె పెళ్లాడారు. వారికి ఓ కుమారుడు పుట్టాడు. వివాహానంతరం కూడా జానకి సినిమాల్లో నటిస్తూనే వచ్చారు.
'కృష్ణన్ తూడ్' తర్వాత కొన్ని చిత్రాల్లో జానకి నటించినా అవన్నీ డాన్సర్ రోల్సే. ఆ టైమ్‌లో డైరెక్టర్ కె. సుబ్రమణ్యన్ ఆమెకు 'అనంత శయనమ్' మూవీలో హీరోయిన్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాతో ఆమె ప్రతిభ తమిళ సినీ ప్రేక్షకులకు తెలిసింది. ఆ తర్వాత 'దేవకన్య', 'రాజా భర్తృహరి', 'మాన సంరక్షణమ్' సినిమాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. అప్పుడే ఆమె కె. సుబ్రమణ్యన్ ఆధ్వర్యంలోని 'నృత్యోదయ' నాట్య బృందంలో సభ్యురాలిగా దక్షిణాది అంతటా నృత్య నాటికలు ప్రదర్శించారు. ఆ నాటకంలో ఆమె పురుష పాత్రలు ధరించేవారు.
సినీ రంగం మీద ఉన్న ఇష్టంకొద్దీ ఆమె ఆ నాట్య బృందం నుంచి బయటకు వచ్చి, సినిమాల మీద దృష్టి పెట్టారు. 'త్యాగి', 'చంద్రలేఖ', 'ఆయిరమ్ తలైవాంగి అపూర్వ చింతామణి' సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అన్నాదురై రచన చేసిన 'వేలైకారి', ఎంజీఆర్ సరసన నటించిన 'మోహిని', 'మరుదనాట్టు ఇళవరసిస', త్యాగరాజ భాగవతార్‌తో నటించిన 'రాజముక్తి' సినిమాలు సినీ రంగంలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఎంజీఆర్ అప్పటికే మొదటి భార్య చనిపోవడంతో సదానందవతిని రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేది. 'మోహిని', 'మరుదనాట్టు ఇళవరసి' సినిమాలలో నటించే కాలంలో ఎంజీఆర్, జానకి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఎంజీఆర్‌కు మృతురాలైన తన మొదటిభార్య తంగమణి అంటే విపరీతమైన ప్రేమ. జానకిలో మొదటిసారి చూసినప్పుడే ఆమెలో ఆయనకు తంగమణి పోలికలు కనిపించాయనీ, వారిద్దరూ కలిసి నటించినప్పుడు సహజంగానే అది ప్రేమగా మారిందనీ వారి సన్నిహితులు అంటుండేవారు.
జబ్బుపడిన రెండో భార్య సదానందవతి మరణం తర్వాత జానకిని వివాహం చేసుకున్నారు ఎంజీఆర్. అప్పటికే ఆమె తన మొదటి భర్త గణపతి భట్ నుంచి విడిపోయారు. ఆమె ఎంజీఆర్‌ను వివాహం చేసుకున్న కొంత కాలానికి ఆయన చనిపోయారు. ఎంజీఆర్‌తో పెళ్లైన తర్వాత, అప్పటికి పదిహేను సినిమాల్లో నటించిన జానకి చిత్రరంగానికి గుడ్‌బై చెప్పి గృహిణిగా స్థిరపడ్డారు. 1984లో ఎంజీఆర్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, ఆయనతో పాటు ఆమెరికా వెళ్లినప్పుడు, ఆ తర్వాత ఎంజీఆర్ బహిరంగ సభలకు ఆయనకు తోడుగా హాజరైనప్పుడు మాత్రమే ఆమె వార్తల్లోకి వచ్చారు.
ఎంజీఆర్ లాగే ఆమె కూడా సినీ రంగంలో శ్రమించి, తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నారు. ఆయనతో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి, నిజ జీవిత భాగస్వామి అయ్యి, ఆయన మరణానంతరం తమిళనాడు నాలుగో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ రాష్ట్ర చరిత్రంలో అతి తక్కువ కాలం అంటే కేవలం 24 రోజులు మాత్రమే ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తిగా నిలిచారు. ఆమె ప్రభుత్వం కూలిపోవడంలో ప్రధాన పాత్ర వహించింది ఎంజీఆర్‌కు అత్యంత సన్నిహితురాలైన జయలలిత కావడం గమనార్హం.