English | Telugu
మురళీమోహన్, జయచిత్రకు పెళ్లిచేసిన పాపులర్ డైలీ!
Updated : Jul 8, 2021
మురళీమోహన్, జయచిత్ర జంటగా చాలా సినిమాల్లో నటించారు. ఆ టైమ్‌లో ఎక్కడ చూసినా వాళ్లిద్దరే కనిపిస్తూ ఉండేవాళ్లు. ఒకరోజు మద్రాస్‌లోని వాహినీ స్టూడియోలో షూటింగ్‌కని వెళ్లారు మురళీమోహన్. ఆయనను చూసి, అక్కడున్న తమిళంవాళ్లు "ఇవర్‌దా (ఇతనే) మురళీమోహన్" అంటున్నారు. వాళ్లలా ఎందుకంటున్నారో మురళీమోహన్‌కు అర్థం కాలేదు. మేకప్ వేసుకొని సెట్‌లోకి వెళ్లాక సహ నటీనటులు "ఏంటయ్యా నిజం చెప్పు.. నువ్వు జయచిత్రను పెళ్లి చేసుకుంటున్నావా?" అనడిగారు. "నేను జయచిత్రను పెళ్లి చేసుకోవడమేంటి? నాకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు." అని చెప్పారు మురళీమోహన్.
ఆ తర్వాత ఆయనను చిత్ర రంగానికి పరిచయం చేసిన నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు వచ్చి, "బాబూ నీతో ఓసారి మాట్లాడాలి. బయటకు రా" అన్నారు. డౌట్‌గానే మేకప్ రూమ్‌లోకి ఆయనను తీసుకొని వెళ్లారు మురళీమోహన్. పూర్ణచంద్రరావు రూమ్ గడియ వేశారు. "ఇవాళ పేపర్‌లో వచ్చింది చూశావా.. నువ్వు జయచిత్రను పెళ్లి చేసుకోబోతున్నావని. నిజమేనా? నువ్వు తప్పు చెయ్యవని నాకు తెలుసు. ఒకవేళ చేస్తున్నావేమో.. నిన్ను హెచ్చరిద్దామని వచ్చాను." అన్నారు.
"అలాంటి పొరపాటు ఎప్పుడూ నేను చెయ్యనండీ. ఎవరికీ తలదించుకొనే అవకాశం రానివ్వనండీ. అసలా ఉద్దేశం నాకెప్పుడూ లేదండీ." అని చెప్పారు మురళీమోహన్. సంతృప్తిచెంది వెళ్లిపోయారు పూర్ణచంద్రరావు. కానీ ఇలా పేపర్‌లో వచ్చిందనే విషయం తట్టుకోవడం మురళీమోహన్‌కు కష్టమైపోయింది. తనకు బాగా సన్నిహితుడైన డైరెక్టర్ విజయబాపినీడుతో తన బాధను చెప్పుకున్నారు మురళీమోహన్. "తమిళంలో ఎల్లో జర్నలిజం అని ఉంటుంది. ఆ హీరో, ఈ హీరోయిన్ కలిసి తిరుగుతున్నారు, త్వరలో వాళ్లు పెళ్లిచేసుకోబోతున్నారు అని రాస్తుంటారు. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు." అని ఆయనన్నారు.
ఇంతకీ ఆ వార్తను రాసింది.. తమిళంలో బాగా పాపులర్ అయిన దినతంతి అనే డైలీ పేపర్. ఫ్రంట్ పేజీలోనే ప్రముఖంగా ఆ వార్తను వేశారు. నిరాధారంగా ఆ వార్తను ప్రచురించినందుకు ఆ పేపర్‌కు లీగల్ నోటీసు పంపించారు మురళీమోహన్. దాంతో తమ రిపోర్టర్ తప్పుడు సమాచారంతో ఆ వార్తను రాసినందుకు క్షమాపణలు చెప్పింది ఆ పత్రిక.
ఇది జరిగిన నెలరోజుల తర్వాత ఒకరోజు షూటింగ్‌కు వెళ్లాలని మద్రాస్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు మురళీమోహన్. ఆయన, జయచిత్ర, దాసరి నారాయణరావు ఒకే ఫ్లయిట్‌లో హైదరాబాద్‌కు వచ్చారు. ఆ వెంటనే "మేం అప్పుడు రాసింది కరెక్ట్. దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో మురళీమోహన్, జయచిత్ర హైదరాబాద్‌లో పెళ్లిచేసుకోబోతున్నారు." అని మళ్లీ అదే పేపర్‌లో వచ్చింది. అప్పుడు అక్కినేనికి కథ చెప్తామని దాసరి వస్తే, వడ్డే రమేశ్ వాళ్ల సినిమా షూటింగ్ కోసమని మురళీమోహన్ వచ్చారు. జయచిత్ర వేరే సినిమా షూటింగ్ కోసం వచ్చారు. దాంతో అలాంటి వార్తలను లైట్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు మురళీమోహన్. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు.