English | Telugu
చిరంజీవిని ఆయన భార్య సురేఖ మొదటిసారి ఎక్కడ చూశారంటే...
Updated : Jul 8, 2021
చిరంజీవితో పాటు సత్యనారాయణ అనే అతను నరసాపురం కాలేజీలో చదువుకున్నాడు. ఆయన అల్లు రామలింగయ్యకు దగ్గరి బంధువు. ఆయన ఓసారి మద్రాస్‌కు చిరంజీవి దగ్గరకు వచ్చాడు. చుట్టపు చూపుగా అల్లు రామలింగయ్య భార్య కనకరత్నంను కలుసుకున్నాడు. అప్పుడు పక్కనే ఉన్న చిరంజీవిని చూసి, ఈ అబ్బాయి ఫలానా సినిమాలో నటించిన అబ్బాయి కదా?.. అని సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంలోనే చిరంజీవి కులగోత్రాలు, కుటుంబ సాంప్రదాయాల గురించి కూడా ఆమె వాకబు చేశారు.
ఆమెకు మన సురేఖకు ఈ అబ్బాయిని చేసుకుంటే అనే ఆలోచన వచ్చింది. మొదట తన ఆలోచనను తన కొడుకు అరవింద్‌కు చెప్పారు. అరవింద్‌కు నిర్మాతగా మారిన మేకప్‌మ్యాన్ జయకృష్ణ అత్యంత సన్నిహిత మిత్రుడు. ఆయన చిరంజీవికీ ఆప్తమిత్రుడు. జయకృష్ణ రంగంలోకి దిగి, రెండు కుటుంబాల పెద్దలతోనూ సంప్రదించి సంధానకర్తగా వ్యవహరించారు. తాంబూలాలను నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సమక్షంలో ఇచ్చిపుచ్చుకున్నారు.
ఇక పెళ్లికూతురు సురేఖ విషయానికి వస్తే.. అప్పటికే ఆమె చిరంజీవి అభిమాని. చిరంజీవిని ఆమె మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా 'తాయారమ్మ-బంగారయ్య' సినిమా 100 రోజుల వేడుకలో చూశారు. ఈ విషయాన్ని తనతో మొదటిరాత్రో, మూడో రాత్రో చెప్పినట్లు గుర్తు అని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించారు. "మా వివాహం 1980 ఫిబ్రవరి 20 ఉదయం 10:50 గంటలకు మద్రాసులోని రాజేశ్వరి కల్యాణమంటపంలో జరిగింది." అని ఆయన చెప్పారు.