English | Telugu
మహాకవి శ్రీశ్రీకి వంటకాల్లో 'ఉన్నది ఒద్దు లేనిది ముద్దు!
Updated : Jul 9, 2021
మురళీ మోహన్, జయచిత్ర జంటగా వి. మధుసూదనరావు రూపొందించిన 'పొరుగింటి పుల్లకూర' (1976) సినిమాలో మహాకవి శ్రీశ్రీ, "ఉన్నదానితో పోరాటం.. లేని దానికై ఆరాటం.. ఉన్నది ఒద్దు లేనిది ముద్దు.. ఏది ఆశకు హద్దు" అంటూ ఓ పాట రాశారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా, రామకృష్ణ పాడిన ఈ పాట ఆ రోజుల్లో బాగా పాపులర్ అయ్యింది. ఈ పాట శ్రీశ్రీకే బాగా వర్తిస్తుందని ఆయన భార్య సరోజా శ్రీశ్రీ ఒకప్పుడు చెప్పారు.
శ్రీశ్రీ పద్ధతులు చాలా విచిత్రంగా ఉండేవి. ఏ రోజైనా పని లేకుంటా ఆ రోజు ఉదయం 10 గంటలైనా మంచం మీదనుంచి లేచేవారు కాదు. పది అయ్యింది లేవండి అని ఇంట్లోవాళ్లు లేపితే, "ఉండు నాయనా ఇంకా తెల్లారలేదు" అనేవారు. పనివుంటే మాత్రం 5 గంటలకల్లా లేచి కూర్చొనేవారు. 10.30 నుంచి 11 గంటల మధ్య టిఫిన్ చేసేవారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి భోజనానికి లేవండని పిలుస్తుంటే 3 గంటలకు లేచి అప్పుడు స్నానానికి వెళ్లేవారు. స్నానం చేశాక ఓ టవల్‌తో తుడుచుకొనేవారో, అదే టవల్ నడుంకు చుట్టుకొని టేబుల్ దగ్గర భోజనానికి కూర్చేనేవారు.
ఆయన టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ సిద్ధంగా ఉండాలి. లేకపోతే, మళ్లీ మంచం ఎక్కేసేవారు. ఇంక ఆరోజు ఎంత పిలిచినా భోజనం చెయ్యరన్న మాట. అందుకని సరోజగారు స్నానానికి అన్నీ సిద్ధంచేసి, టేబుల్ దగ్గర కాచుకొని ఉండేవారు. భోజనం దగ్గర కూడా అన్నీ పద్ధతి ప్రకారమే ఉండాలి. ముందు ఉప్పు వడ్డించాలి. ఆవకాయ, పెరుగు తప్పనిసరి. ఏం వండారో ముందుగా చెప్పాలి. దొండకాయో, బెండకాయో చేశారని చెప్తే "బంగాళాదుంప లేదూ" అనేవారు. "చెయ్యనిదాని గురించి అడుగుతారేవండీ" అంటే, మూడ్ బాగుంటే వడ్డించమనేవారు. లేదంటే.. అడిగింది చేసిపెట్టాల్సిందే. అందుకని స్నానానికి లేపే ముందుగానే సరోజగారు ఆ రోజు ఏ వంటకాలు చేశారో చెప్పేవారు. వేరే ఏదైనా కావాలంటే చెప్పమని అడిగేవారు. ఇలా ఉండేది శ్రీశ్రీ వ్యవహారం.