English | Telugu
రామానాయుడు, విజయనిర్మల భార్యాభర్తలుగా నటించారని మీకు తెలుసా?
Updated : Jun 8, 2021
అవును. ఆ సినిమా పేరు 'పాపకోసం'. 1968లో వచ్చిన ఆ సినిమాని రామానాయుడు స్వయంగా నిర్మించారు. దొంగల్లోనూ మానవత్వం ఉంటుందని చెప్పే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ద్వారా సురేశ్ ప్రొడక్షన్స్‌లో అదివరకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన జి.వి.ఆర్. శేషగిరిరావు డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. జమీందారు మోహనరావు ఇంట్లో అర్ధరాత్రి పూట ప్రవేశించి, జమీందారు సహా ఆ ఇంట్లో కనిపించిన వాళ్లందర్నీ కాల్చేసి, ఆ జమీందారు నాలుగేళ్ల పాపను తమతో పాటు తీసుకువెళ్లిన ముగ్గురు దొంగల కథ ఈ సినిమా. మూడు భిన్నమతాలకు చెందిన జోసెఫ్, కిష్టయ్య, హుస్సేన్ అనే ఆ ముగ్గురు దొంగలుగా సత్యనారాయణ, త్యాగరాజు, రామదాసు నటించగా, పాపగా బేబి రాణి నటించింది.
ఈ పాపే సినిమా చివరలో పెద్దదై పెళ్లి చేసుకుంటుంది. ఆ పాత్రను విజయనిర్మల పోషించగా, ఆమె పెళ్లాడే వ్యక్తిగా రామానాయుడు నటించారు. ఆ ఇద్దరివీ అతిథి పాత్రలే. ఈ చిత్రానికి సంబంధించిన ఇంకో నిజమైన విశేషమేమంటే, విజయనిర్మల తండ్రి పాత్రను ఆ తర్వాత కాలంలో ఆమె భర్త అయిన సూపర్‌స్టార్ కృష్ణ చేయడం. కాకపోతే విజయనిర్మల చిన్నప్పటి పాత్రకే ఆయన సన్నివేశాలు పరిమితమయ్యాయి. జమీందారు మోహనరావు పాత్రను చేసింది ఆయనే. ఒక పాటలో, తర్వాత దొంగల చేతిలో హత్యకు గురయ్యే సన్నివేశంలో మాత్రమే ఆయన కనిపిస్తారు.
వీళ్లతో పాటు జగ్గయ్య, రాజబాబు, వెన్నిరాడై నిర్మల, రేలంగి, గీతాంజలి సైతం అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో పెండ్యాల సంగీతం సమకూర్చగా, ఆత్రేయ రాసిన "కొండలపైన కోనలలోన.. గోగులుపూచే జాబిలి" పాట బాగా పాపులర్ అయ్యింది. హైదరాబాద్‌లోని కమల్ టాకీస్‌లో 'పాపకోసం' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించి, వచ్చిన రూ. 30 వేలను పోలీసు కుటుంబాల సంక్షేమనిధికి రామానాయుడు విరాళంగా ఇచ్చారు.