English | Telugu
పెళ్లి చేసుకుంటానని తల్లిని వెంటబెట్టుకొని శ్రీదేవి ఇంటికి వచ్చిన అభిమాని!
Updated : Aug 8, 2021
సెల్‌ఫోన్లు రాకముందు వరకూ సినిమా హీరోయిన్లకు ప్రేమలేఖలు రాయడం అభిమానులకు సరదా. తాము రాసిన ఉత్తరాలకు జవాబు ఆ హీరోయిన్ నుంచి జవాబు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవారికి కొదవ వుండేది కాదు. అయితే ఆ అభిమానులెంత కష్టపడి, భావ కవిత్వాన్ని, ప్రేమ పైత్యాన్ని ఒలికించినా, తారలు ఏమాత్రం పట్టించుకోరు. ఆ ఉత్తరాల్ని చదివి సరదాగా నవ్వుకొని, డస్ట్‌బిన్‌లో పడేసేవారు.
కొంతమంది సీరియస్ అభిమానులుంటారు. వాళ్లు ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకుంటారు. అలాంటి అభిమాని ఒకడు అతిలోక సుందరి శ్రీదేవి జీవితంలో తారసపడ్డాడు. అతను శ్రీదేవి సినిమాల్ని ఒక్కోటి పదేసి సార్లు చూసి, ప్రేమలేఖలు రాసేవాడు. అతనిది నార్త్ ఆర్కాట్ పక్కనున్న ఓ గ్రామం. అతను మాటిమాటికీ శ్రీదేవి వాళ్ల నాన్నను అడ్రస్ చేస్తూ ఉత్తరాలు రాసేవాడు.
"నా దగ్గర రెండు లక్షలు ఉన్నాయి. నేనేదైనా వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను. అందుకు మీరు సహకరించాలని కోరుతున్నాను. మరియు మీ అమ్మాయి శ్రీదేవిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి. నేను మీ అమ్మాయిని కష్టపెట్టకుండా బహు జాగ్రత్తగా చూసుకుంటాను.." అంటూ ఇలాంటి రకరకాల విషయాలతో ఏమిటేమిటో రాసేవాడు.
శ్రీదేవి వాళ్ల నాన్నగారు ఆ ఉత్తరాల్ని చదివి, చింపి అవతల పారేసేవారు. ఓసారి ఉత్తరంలో తను ఫలానా తేదీన మద్రాసుకు తన తల్లితో కలిసి వాళ్లింటికి వస్తున్నట్టు రాశాడు. అలవాటు ప్రకారం శ్రీదేవి నాన్నగారు ఆ ఉత్తరాన్ని చింపేశారు. అందులోని విషయాన్ని ఆయన సీరియస్‌గా తీసుకోలేదు.
ఓ రోజు ప్యాంటూ, షర్ట్ టక్ చేసుకొని, టై కట్టుకొని, కూలింగ్ గ్లాస్, భుజానికి ఎయిర్ బ్యాగ్ వేసుకొని ఒకతను, ఓ పెద్దావిడతో శ్రీదేవి వాళ్లింటికి వచ్చాడు. వాళ్లెవరో తెలీక శ్రీదేవి నాన్నగారు తెల్లబోయారు. ఆయన క్వశ్చన్ మార్క్ ముఖం చూసి, ఆ వ్యక్తి నవ్వుతూ, "నేనెవరో తెలియడం లేదూ.. నేనండీ! మీకు ఉత్తరం రాశాను గదా. చదవలేదా?" అన్నాడు. శ్రీదేవి వాళ్ల నాన్నగారికి పరిస్థితి అర్థమైంది. అతన్ని కూర్చోపెట్టి, అతని వివరాలు అడిగారు.
వాళ్లు అలా మాట్లాడుకుంటూ వుండగా, శ్రీదేవి వాళ్లమ్మ రాజేశ్వరిగారు వాళ్ల దగ్గరకు వెళ్లి, ఆ అభిమాని వాళ్లమ్మతో, "ఏవమ్మా! నీ కొడుక్కి బుద్ధి లేకపోతే నీకు బుద్ధిలేదూ? పెళ్లికొడుకుల కోసం మేమేదో అల్లాడిపోతున్నట్టు పరిగెత్తుకొని వచ్చేశారు. బొట్టుపెట్టి పిలిచినట్టు పెట్టె బేడాతో వచ్చారు.. పొండి.. పొండి." అంటూ వాళ్లమీద విరుచుకుపడ్డారు. దెబ్బకు అదిరిపోయారు తల్లీకొడుకులు.
ఇంత గొడవలోనూ ఆ వ్యక్తి మాత్రం తన కూలింగ్ గ్లాస్ తియ్యలేదు. శ్రీదేవి వాళ్ల నాన్నగారికి సందేహంవచ్చి, చటుక్కుమని అతని గ్లాసెస్‌ను లాగేశారు. చూస్తే.. ఆ పెళ్లికొడుక్కి ఒక కన్నులేదు. "ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మరెప్పుడూ చేయకండి. మేం కాబట్టి నోటితో చెప్పాం. అందరూ అలా చెయ్యరు జాగ్రత్త." అని వాళ్లను పంపించేశారాయన.
ఆ వ్యక్తి తమ ఇంటికి ఉత్తరాలు రాయడం, ఇంటికి రావడం లాంటి విషయాలు శ్రీదేవికి తెలియవు. ఇది జరిగిన తర్వాత వాళ్ల నాన్నగారు చెప్పడంతో నవ్వాపుకోలేకపోయింది శ్రీదేవి. చాలా కాలం ఆ సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వుకొనేది. ఈ విషయాలను ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు శ్రీదేవి.