Read more!

English | Telugu

చైల్డ్ ఆర్టిస్ట్‌గానే సూప‌ర్బ్‌ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఫ‌స్ట్ టాలీవుడ్ స్టార్‌ మ‌హేశ్‌!

 

1975 ఆగ‌స్ట్ 9న ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ‌, ఇందిరాదేవి దంప‌తుల‌కు చెన్నైలో జ‌న్మించాడు మ‌హేశ్‌. ఆ టైమ్‌లో కృష్ణ 'గాజుల కిష్ట‌య్య' సినిమా చేస్తున్నారు. పిల్ల‌ల‌కు సెల‌వులు వ‌స్తే వాళ్ల‌ను షూటింగ్ లొకేష‌న్ల‌కూ, సెట్ల ద‌గ్గ‌ర‌కూ తీసుకెళ్లేవారు కృష్ణ‌. దాంతో స‌హ‌జంగానే మ‌హేశ్‌కు సినిమారంగంపై ఆస‌క్తి ఏర్ప‌డింది. అన్న ర‌మేశ్‌బాబు ప్ర‌ధాన‌పాత్ర పోషించ‌గా, దర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన 'నీడ' చిత్రంలో మ‌హేశ్ ఓ చిన్న పాత్ర పోషించ‌డం ద్వారా తెరంగేట్రం చేశాడు. అప్పుడు మ‌హేశ్ వ‌య‌సు నాలుగేళ్లు! 1979 నుంచి 1990 వ‌ర‌కు మ‌హేశ్ 9 చిత్రాల్లో బాల‌న‌టుడి పాత్ర‌లు పోషించాడు.

ఆ త‌ర్వాత తండ్రి కృష్ణ‌తో క‌లిసి తొలిసారిగా 'పోరాటం' సినిమాలో న‌టించాడు మ‌హేశ్‌. కోడి రామ‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో కృష్ణ‌కు త‌మ్ముడి పాత్ర‌ను పోషించాడు. అప్పుడు మ‌హేశ్ వ‌య‌సు ఎనిమిదేళ్లు. అందులో మ‌హేశ్ న‌ట‌న‌ను చూసిన అప్ప‌టి ప్ర‌ముఖ నిర్మాత డూండీ "ఈ అబ్బాయి సినీరంగంలో అద్భుతంగా పైకి వ‌స్తాడు. ఇత‌నికి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంది." అని చెప్పారు. ఆయ‌న అభిప్రాయం, జోస్యం ఆ త‌ర్వాత నిజ‌మైంద‌ని మ‌నందరికీ తెలుసు.

1987లో కృష్ణ డైరెక్ట్ చేసిన 'శంఖారావం' చిత్రంలో మ‌హేశ్‌లోని న‌టుడు బ్ర‌హ్మాండంగా వెలుగులోకి వ‌చ్చాడు. అందులో మ‌హేశ్ న‌ట‌న‌, డాన్సులు అభిమానుల్ని అల‌రించాయి. 1988లో ర‌మేశ్‌బాబు హీరోగా ఎ. కోదండ‌రామిరెడ్డి డైరెక్ట్ చేసిన సూప‌ర్‌హిట్ ఫిల్మ్ 'బ‌జారు రౌడీ' మూవీలో మ‌హేశ్ న‌ట‌న‌ను మెచ్చుకోని వారు లేరు. నిజానికి ర‌మేశ్ కంటే మ‌హేశ్ చాలా బాగున్నాడ‌నీ, చాలా ఈజ్‌తో యాక్ట్ చేశాడ‌నీ విమ‌ర్శ‌కులు రాసేశారు.

1988లోనే కృష్ణ డైరెక్ష‌న్‌లో 'ముగ్గురు కొడుకులు' సినిమా వ‌చ్చింది. అందులో కృష్ణ‌, ర‌మేశ్‌, మ‌హేశ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. ఈ సినిమా కూడా మ‌హేశ్‌కు చ‌క్క‌ని పేరు తెచ్చింది. 1989లో విడుద‌లైన 'గూఢ‌చారి 117' ఫిల్మ్ బాల‌న‌టుడిగా మ‌హేశ్‌కు చాలా వెరైటీ ఫిల్మ్‌. ఇందులో కృష్ణ జేమ్స్‌బాండ్‌గా న‌టించారు. అదే ఏడాది కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌యారైన 'కొడుకు దిద్దిన కాపురం'లో మ‌హేశ్‌ ఫ‌స్ట్ టైమ్ ద్విపాత్రాభిన‌యం చేశాడు. కృష్ణ‌-విజ‌య‌శాంతి దంప‌తుల‌కు క‌వ‌ల‌పిల్ల‌లుగా మ‌హేశ్ ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న అత‌నికి సొంతంగా ఫ్యాన్ బేస్‌ను పెంచింద‌నేది నిజం. తెర‌మీద అత‌ను క‌నిపిస్తే చాలు, ప్రేక్ష‌కులు ఈల‌లు వేస్తూ కేరింత‌లు కొట్ట‌డం మొద‌లుపెట్టారు.

1990లో వ‌చ్చిన 'బాల‌చంద్రుడు', 'అన్నా త‌మ్ముడు' చిత్రాల‌తో బాల‌న‌టునిగా మ‌హేశ్ కెరీర్ పూర్త‌యింది. ఆ త‌ర్వాత అత‌ను చ‌దువుమీద పూర్తి దృష్టి పెట్టాడు. ఎనిమిదేళ్ల త‌ర్వాత తిరిగి కెమెరా ముందుకు వ‌చ్చి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతూ 'రాజ‌కుమారుడు' (1999) చేశాడు. భ‌విష్య‌త్ సూప‌ర్‌స్టార్‌న‌ని ఆ సినిమాతోటే చాటిచెప్పాడు.