English | Telugu
రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయిన ఈ నందమూరి నటుడ్ని గుర్తుపడతారా?
Updated : Jun 7, 2021
నందమూరి వంశానికి రోడ్ యాక్సిడెంట్లు ఓ శాపంలా మారాయనిపిస్తుంది. అనేక సందర్భాల్లో ఆ వంశానికి చెందినవారు యాక్సిడెంట్లకు గురయ్యారు. కొద్దిమంది గాయాలతో ప్రాణాలు దక్కించుకుంటే, కొంతమంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. 2018లో నందమూరి హరికృష్ణ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోతే, ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ ఆయన కంటే ముందే 2014లో అదే తరహా రోడ్ యాక్సిడెంట్‌లో మృత్యువాత పడ్డారు.
నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు రామకృష్ణ యాక్సిడెంట్‌లో చనిపోగా, అదే పేరు పెట్టుకున్న మరో కుమారుడు చావు చివరి అంచుదాకా వెళ్లి బతికి బయటపడ్డారు. ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి సైతం ప్రమాదంలోనే మృతి చెందారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్లకు గురైనా గాయాలతో బయటపడ్డారు.
వీళ్లే కాదు ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కుటుంబం సైతం రోడ్ యాక్సిడెంట్ల బాధితులు కావడం గమనార్హం. స్వయంగా త్రివిక్రమరావు యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలతో బయటపడితే, అదే యాక్సిడెంట్‌లో ఆయన చిన్నకుమారుడు హరీన్ చక్రవర్తి మృతి చెందారు. అలాగే పెద్ద కుమారుడు కల్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వీ చక్రవర్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
కల్యాణ్ చక్రవర్తి తరహాలోనే హరీన్ చక్రవర్తి కూడా నటన మీద ఆసక్తితో అన్న హీరోగా నటించిన 'మామాకోడళ్ల సవాల్' (1986) మూవీలో ఓ విభిన్న పాత్రలో నటించాడు. నిజానికి ఎన్టీఆర్ 'మనుషుల్లో దేవుడు' (1974) సినిమాలో కల్యాణ్ చక్రవర్తితో పాటు హరీన్ కూడా బాలనటుడిగా పరిచయమైనవాడే.
పెద్దయ్యాక రేలంగి నరసింహారావు డైరెక్ట్ చేసిన 'పెళ్లికొడుకులొస్తున్నారు' చిత్రంతో హీరో అయ్యాడు. అందులో యమధర్మరాజు గెటప్ కూడా వేశాడు. జ్వరంతోటే ఆ గెటప్‌పై నాలుగు రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆ మూవీలో ఆయన సరసన నాయికగా సీత నటించారు. ఆ సినిమాతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు కూడా హరీన్ హీరోగా ప్రారంభమయ్యాయి. కానీ యాక్సిడెంట్‌తో అకాల మరణం పాలయ్యాడు.