English | Telugu
సినీనటి కాకముందు, అయ్యాక 'మరో చరిత్ర' సరిత జీవితం ఎలా మారిపోయిందో చూడండి!
Updated : Jul 9, 2021
నటి సరిత అసలు పేరు అభిలాష. లెజెండరీ డైరెక్టర్ కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన 'మరో చరిత్ర' సినిమాలో కమల్ హాసన్ సరసన నాయికగా నటించడం ద్వారా వెండితెరకు ఆమె పరిచయమయ్యారు. అభిలాషను సరితగా సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించారు బాలచందర్. తొలి చిత్రంలోనే అప్పటి క్రేజీ హీరో కమల్‌తో నటించడం ఓ డ్రీమ్ లాంటిదైతే, నటించిన తొలి సినిమాయే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ కావడమే కాకుండా, తెలుగు సినిమాల్లో ఓ క్లాసిక్‌గా నిలవడం మరో కల నిజం కావడం లాంటిదే. అయితే సినిమాల్లోకి రాకముందుతో పోలిస్తే, సినిమాల్లోకి వచ్చాక ఓ అమ్మాయి జీవితం ఎలా మారిపోతుంది, ఎంతలా మారిపోతుందో సరిత జీవితమే నిదర్శనం. ఆ మార్పును ఆమె స్వయంగా రాసుకున్నారు. అదేలా ఉంటుందంటే...
"నాటి అభిలాషకీ, నేటి సరితకీ చాలా తేడా ఉంది. అభిలాషగా ఉన్నప్పుడు ఇన్‌కంటాక్స్‌కు స్పెల్లింగ్ కూడా తెలియదు. సరిత అయినప్పటి నుండి ఆర్టిస్టుకూ, మేకప్పుకూ ఎలా అవినాభావ సంబంధం ఉందో, అలాగే ఇన్‌కంటాక్స్‌తో కూడా సంబంధం ఉంది. సరిత ఒక ఇన్‌కంటాక్స్ అసెస్సీ. ఆ గొడవలేవీ అభిలాషకు లేవు, తెలియవు కూడా. సరిత అభిలాషగా ఉన్నప్పుడు చాలా లావు. స్కూల్లో అందరూ షార్టీబన్ బటర్ జామ్ అని పిలిచేవారు. ఇష్టం వచ్చినట్లు తినేది అభిలాష. పథ్యం తింటున్నట్లు చాలా జాగ్రత్తగా తూచి తూచి తింటుంది సరిత. రాత్రి తొమ్మది గంటలకల్లా పడుకునేది అభిలాష. డే అండ్ నైట్ పనిచేస్తుంది సరిత.
మద్రాసులో ఉంటేఏ షూటింగ్, డబ్బింగ్ అంటూ మార్చి మార్చి పనిచేయడం వల్ల పడుకోడానికి రాత్రి రెండు గంటలవుతుంది. కొన్నిసార్లు ఉదయం ఐదు గంటల వరకూ కూడా వర్క్ చేసింది సరిత. అభిలాషకు సాయంత్రం ఆరు నుండి పది గంటల వరకు చదువుసంధ్యలు. తర్వాతేం చేస్తుంది.. హాయిగా పడుకోవడం తప్ప! నాటికీ నేటికీ ఆనందం ఒక్కటే. నా బాధేమిటంటే, ముందుకన్నా నాకిప్పుడు చాలా తక్కువమంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్ డేస్‌లో బోలెడు ఫ్రెండ్స్ ఉండేవారు. నిజమైన స్నేహితురాళ్లు వారు. ఇప్పుడలా కాదు. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదోనని భయం. భయంతోనేఏ మాట్లాడవలసి వస్తుంది. ఫ్రీగా మాట్లాడ్డం కుదరడం లేదు. మనసును అర్జంటుగా పాలిష్ చేసుకొని, కృత్రిమంగా మాట్లాడవలసి వస్తోంది.
అభిలాషకు ఆ బాధ లేదు. స్కూల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఎవరన్నా అబ్బాయి స్మార్టుగా వెళ్లేడంటే ఏయ్! అటు చూడండే స్మార్టుగా హీరోలా వెళ్తున్నాడు! అని మాట్లాడుకునే వాళ్లం. స్కూల్లో స్త్రీ పురుష భేదాల్లేకుండా అందరం కలిసే చదువుకునేవాళ్లం. కలిసి ఆడుకునేవాళ్లం. ఇప్పుడలా కాదు. ఒక గీత గీసి ఆడవాళ్లు, మగవాళ్లంటూ విడివిడిగా మాట్లాడాల్సి వస్తోంది. అంతేకాదు, ఆడవాళ్ల మధ్య మాట్లాడినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది.
అభిలాషకు పాస్‌పోర్టు లేదు. సరితకు పాస్‌పోర్టు ఉంది. హైట్, వెయిట్, పుట్టుమచ్చల వివరాలతో, నాకూ భారతీయ పౌరసత్వం ఉందనడానికి ఆధారంగా పాస్‌పోర్టు ఉంది.
అభిలాషకు కాడ్‌బరీస్ అంటే ప్రాణం. మొదటిసారిగా నేను సినిమాల్లో నటించినప్పుడు నాకు కాడ్‌బరీస్ ఇచ్చి నాచే నటింపజేశారు బాలచందర్‌గారు. కానీ సరిత స్వీట్స్ తినడం మానేసింది. అభిలాష కాస్త డెలికేట్ అమ్మాయి. ఎప్పుడూ షూస్ తొడుక్కుని ఉంటుంది. సుఖానికి అలవాటు పడింది. ఇప్పుడు ఎండాలేదు, వానాలేదు. సినిమా కోసం మండుటెండలో చెప్పుల్లేకుండా నడవాల్సి వస్తోంది. కాళ్లు సర్రునకాలి బొబ్బలు లేస్తాయి. అయినా ఇదేం పెద్ద కష్టంకాదు. ఇందులో కష్టంకన్నా ప్లెజరే ఎక్కువ! అభిలాష చాలా ఇన్నోసెంట్. సరితకు లోకజ్ఞానం కాస్త లభించింది. ఇంతకుముందైతే స్కూల్ స్నేహితులు, సినిమాలు.. అంతే!. అంతకుమించి ఇంకేం తెలియదు.
పాత జీవితం కోసం తిరిగి పాకులాడుతున్నానని అర్థం కాదు. ఇది నేను ఇష్టపడి, ఎన్నుకున్న మార్గం. భగవంతుడ్ని వేడుకోగా లభించిన మార్గం. అభిలాష నుండి సరితగా నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇది ఒక ప్రమోషన్ వంటిది."