English | Telugu

షూటింగ్‌ స్పాట్‌లో చెప్పుతో ఓ రిపోర్టర్‌ రెండు చెంపలూ వాయించిన వాణిశ్రీ!

పాతతరం హీరోయిన్లలో సావిత్రికి ఒక ఉన్నతమైన, ప్రత్యేకమైన స్థానం ఉండేది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవారామె. ఎన్నో అద్భుతమైన, అపురూపమైన పాత్రలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆ తర్వాతి తరంలో మహానటి సావిత్రి స్థానాన్ని భర్తీ చేసిన హీరోయిన్‌ వాణిశ్రీ. ఆమెకు, సావిత్రికి రూపంలో, అభినయంలో పోలికలు కూడా ఉన్నాయని అప్పట్లో చెప్పుకునేవారు. అయితే సావిత్రితో పోలిస్తే వాణిశ్రీ స్వభావం కాస్త దుందుడుకుగా ఉండేది. ఎవరితోనైనా ముక్కుసూటిగా మాట్లాడడం ఆమె అలవాటు. తప్పు జరిగితే క్షమించే గుణం ఆమె దగ్గర లేదు. తప్పు చేసినవారు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అన్నది ఆమె అభిప్రాయం. అలా ఓ పత్రికా విలేకరి తన విషయంలో తప్పు చేయడాన్ని సహించలేకపోయిన వాణిశ్రీ తన చెప్పుతో అతని రెండు చెంపలు వాయించారు. ఆ విలేకరి చేసిన తప్పేంటి, అతన్ని వాణిశ్రీ ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అనే విషయం గురించి తెలుసుకుందాం. 

1962లో ‘భీష్మ’ చిత్రంతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన వాణిశ్రీ ఆ తర్వాత ఐదేళ్ళపాటు చెలికత్తె పాత్రలు, హాస్య పాత్రలు చేస్తూ వచ్చారు. అలా దాదాపు 25 సినిమాలు చేసిన తర్వాతగానీ ఆమెకు హీరోయిన్‌గా నటించే అవకాశం రాలేదు. 1967లో వచ్చిన ‘మరపురాని కథ’ చిత్రంలో వాణిశ్రీ తొలిసారి హీరోయిన్‌గా నటించారు. ఆమెకు తొలి హీరో సూపర్‌స్టార్‌ కృష్ణ. అలా హీరోయిన్‌గా మొదలైన ప్రస్థానం 15 ఏళ్ళపాటు నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగింది. అప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు వాణిశ్రీ. ఆరోజుల్లో ఆమెకు నవలా నాయిక అనే పేరు ఉండేది. ఎన్నో నవలా చిత్రాల్లో ఆమె నటించారు. వాణిశ్రీ చీరకట్టు, హెయిర్‌ స్టైల్‌, బ్లౌజ్‌ డిజైన్స్‌.. ఇవన్నీ అప్పట్లో చాలా ఫేమస్‌ అయ్యాయి. డ్రెస్సింగ్‌ విషయంలో వాణిశ్రీనే ఫాలో అయ్యేవారు అప్పటి యువతులు. 

ఊపిరి సలపని సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వాణిశ్రీకి ఒక సమస్య వచ్చింది. ప్రస్తుతం మీడియాలో సినీ ప్రముఖులకు సంబంధించిన ఎన్నో గాసిప్స్‌ వస్తుంటాయి. ఇప్పుడు మాధ్యమాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి విస్తరణ కూడా అలాగే ఉంది. కానీ, పాతరోజుల్లో ఇవేవీ లేవు. కాబట్టి పత్రికల్లోనే సినిమా వార్తలు వచ్చేవి. ఎల్లో జర్నలిజంకి సంబంధించి కాగడా, హిందు నేషన్‌, సినీఫ్లాగ్‌ పేరుతో పత్రికలు వచ్చేవి. వాటిలో మొత్తం గాసిప్సే ఉండేవి. ఇవి మద్రాస్‌ కేంద్రంగా పబ్లిష్‌ అయ్యేవి. ఇవికాక నెల్లూరు నుంచి బొగ్గుశ్రీ పేరుతో ఓ గాసిప్‌ మ్యాగజైన్‌ వచ్చేది. వాణిశ్రీ నలుపు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమెను ఉద్దేశించే ఆ పత్రికకు బొగ్గుశ్రీ అనే పేరు పెట్టారని ఆరోజుల్లో చెప్పుకునేవారు. సినిమా వారిపై అనవసరమైన రాతలు రాయడం, వారిని అప్రతిష్ట పాలు చేయడమే ఆ పత్రిక పని. 

వాణిశ్రీ గురించి కూడా చాలా సార్లు రకరకాల కథనాలు రాసిందా పత్రిక. వాటిని చదివి వాణిశ్రీ నవ్వుకునేవారు తప్ప సీరియస్‌గా తీసుకునేవారు కాదు. కానీ, కొన్నిరోజుల తర్వాత వాణిశ్రీ అక్క, అమ్మల గురించి కూడా ఆ పత్రికలో చెడుగా రాశారు. ఇది జరిగిన కొన్నిరోజులకు బొగ్గుశ్రీ పత్రిక రిపోర్టర్‌.. వాణిశ్రీ ఇంటికి ఫోన్‌ చేసి.. తమ గురించి చెడుగా రాయకుండా ఉన్నందుకు కొందరు రూ.10వేలు ఇస్తున్నారని, మీరు పెద్ద హీరోయిన్‌ కనుక రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేట్‌ చేస్తే పత్రిక ప్రింటింగ్‌కి వెళ్లిపోతుందని బెదిరించాడు. ఆమెకు వొళ్ళు మండిపోయింది. అయినా తమాయించుకొని అతను చెప్పినదంతా కూల్‌గా విన్నారు. మరుసటి రోజు షూటింగ్‌ స్పాట్‌కి రమ్మని చెప్పారు. ఆరోజు షూటింగ్‌కి వెళ్ళగానే బొగ్గుశ్రీ రిపోర్టర్‌ వస్తే తన దగ్గరకి తీసుకు రమ్మని ప్రొడక్షన్‌ మేనేజర్‌కి చెప్పారు వాణిశ్రీ. చెప్పినట్టుగానే ఆ రిపోర్టర్‌ రాగానే ఆమె దగ్గరికి తీసుకొచ్చారు. ‘మా గురించి అలా రాయడం తప్పు కదా.. మా కుటుంబ సభ్యుల గురించి కూడా రాయడం ఇంకా పెద్ద తప్పు కదా. నీకు అక్కా చెల్లెలు లేరా’ అని నెమ్మదిగానే అడిగారు వాణిశ్రీ. దానికి ఆ రిపోర్టర్‌ రెచ్చిపోయి ‘అలాగే రాస్తాను. ఇంకా రాస్తాను. ఏం చేస్తారు?’ అన్నాడు. ఇక కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోయిన వాణిశ్రీ తన కాలి చెప్పు తీసుకొని అతని రెండు చెంపలూ వాయించింది. ఈ ఘటన చూసి సెట్‌లో ఉన్నవారంతా షాక్‌ అయిపోయారు. ఈ విషయంలో ఆమె ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. దీని తర్వాత బొగ్గుశ్రీ పత్రికలో వాణిశ్రీ గురించి ఎలాంటి గాసిప్స్‌ రాలేదు.