English | Telugu
బాలకృష్ణ సినిమాకు అడ్డుపడిన ఎన్.టి.ఆర్.. తనే ఆ సినిమా చేసి హిట్ కొట్టిన నటరత్న!
Updated : Sep 28, 2024
పాతతరం దర్శకుల్లో పురాణాల పుల్లయ్యగా డైరెక్టర్ సి.పుల్లయ్యకు మంచి పేరు ఉంది. ఎందుకంటే లవకుశ, సతీసావిత్రి ఆయన కెరీర్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సినిమాలు. అలాంటి పౌరాణికాలు తీసిన ఆయన దేవాంతకుడు అనే సెటైరికల్ మూవీ చేశారు. తెలుగులో తొలి సోషియో ఫాంటసీ సినిమా ఇదే. మనిషి యమలోకం వెళ్ళడం అనేది సినిమా కాన్సెప్ట్. ఇందులో పొలిటికల్‌గా ఎన్నో సెటైర్స్ ఉంటాయి. వాటిని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. దేవాంతకుడు సూపర్‌హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆ తరహాలోనే మరో సినిమా చెయ్యాలనుకున్నారు పుల్లయ్య. యమగోల అనే టైటిల్‌తో సినిమా చేయబోతున్నట్టు పత్రికల్లో ప్రకటించారు కూడా. ఆదుర్తి సుబ్బారావు సోదరుడు ఆదుర్తి నరసింహమూర్తితో కలిసి కథా చర్చలు కూడా జరిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పై వెళ్ళలేదు. పుల్లయ్య మరణించిన తర్వాత ఆయన కుమారుడు సి.ఎస్.రావు యమగోల కథపై కొంత వర్క్ చేశారు. ఆ సమయంలో నిర్మాత డి.ఎన్.రాజుకి సి.ఎస్.రావు ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. తన దగ్గర ఉన్న యమగోల ఫైల్‌ని ఆయనకు ఇచ్చారు సి.ఎస్.రావు. ఈ సినిమాకి రచయితగా డి.వి.నరసరాజును ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ కథ ఎవ్వరికీ నచ్చలేదు. దాన్ని పక్కన పెట్టి ఓ కన్నడ సినిమాను కృష్ణ హీరోగా రీమేక్ చేశారు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు యమగోల హక్కులను నిర్మాత డి.రామానాయుడు కొనుగోలు చేశారు. టైటిల్ మాత్రమే ఆకర్షణీయంగా ఉంది తప్ప కథలో విషయం లేదని తెలుసుకొని దాన్ని పక్కన పడేశారు రామానాయుడు. దాదాపు 17 ఏళ్ళ తర్వాత యమగోల మళ్ళీ తెరపైకి వచ్చింది. సినిమాటోగ్రాఫర్‌గా మంచి పేరున్న ఎస్.వెంకటరత్నం తన తొలి సినిమాగా శోభన్‌బాబుతో ఈతరం మనిషి నిర్మించారు. అది ఫ్లాప్ అయింది. ఎలాగైనా హిట్ కొట్టాలి అనే పట్టుదలతో రచయిత డి.వి.నరసరాజుని సంప్రదించారు. తను ఆల్రెడీ వర్క్ చేసిన యమగోల గురించి చెప్పారాయన. ఈ కథలో హీరోకి యమలోకం వెళ్ళినట్టు కల వస్తుంది. ఆ పాయింట్‌ని తీసుకొని, దానికి ముందు వెనుక కథ అల్లితే బాగుంటుందని చెప్పారు నరసరాజు. అది వెంకటరత్నంకి నచ్చింది. రామానాయుడు దగ్గర ఉన్న యమగోల కథలో విషయం లేదుగానీ టైటిల్ బాగుంది. కాబట్టి దాని హక్కులు కూడా కొనమని చెప్పారు నరసరాజు. ఆ హక్కులు కొన్నారు వెంకటరత్నం.
యమగోల చిత్రంలో బాలకృష్ణ హీరోగా, ఎన్టీఆర్ యమధర్మరాజుగా చేస్తే బాగుంటుందని నరసరాజు చెప్పడంతో ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌కి చెప్పారు వెంకటరత్నం. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు కథ చెప్పారు నరసరాజు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చి పడే ఇబ్బందులు విని ఎన్టీఆర్ బాగా ఎంజాయ్ చేశారు. కథ మొత్తం విన్న తర్వాత ఈ క్యారెక్టర్ బాలకృష్ణ చెయ్యలేడు. తను మాత్రమే చెయాల్సినంత విషయం కథలో ఉంది. కాబట్టి తనతోనే చెయ్యమన్నారు ఎన్టీఆర్. యమధర్మరాజుగా సత్యనారాయణ అయితే బాగుంటాడని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ అలా చెప్పిన వెంటనే సినిమా పనులు మొదలుపెట్టేశారు వెంకటరత్నం. హీరోయిన్‌గా జయప్రద, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య, రుద్రయ్యగా రావుగోపాలరావును ఎంపిక చేశారు. 1977 జూన్ 4న సినిమా కోసం వేసిన యమలోకం సెట్‌లో యమగోల షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్‌ను 27 రోజుల్లో పూర్తి చేశారు దర్శకుడు తాతినేని రామారావు. చక్రవర్తి ఈ సినిమాకి అందించిన పాటలు చాలా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ‘చిలక కొట్టుడు కొడితే..’, ‘ఓలమ్మీ తిక్కరేగిందా..’ ‘గుడివాడ వెళ్ళాను..’, ‘ఆడవె అందాల సుర భామిని..’ పాటలు రాష్ట్రాన్ని ఊపేశాయి. 1977 అక్టోబర్ 21న ‘యమగోల’ విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమా రెండున్నర కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అప్పటికి ఇదే పెద్ద రికార్డ్. 1977 సంవత్సరాన్ని ‘ఎన్.టి.ఆర్. ఇయర్’గా పేర్కొంటారు. ఎందుకంటే సంక్రాంతి, సమ్మర్, దసరా.. ఈ మూడు సీజన్లు సినిమాలకు ప్రత్యేకమైనవి. ఈ మూడు సీజన్స్‌లో ఎన్టీఆర్ నటించిన మూడు సినిమాలు విడుదలై బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అవి.. దానవీరశూర కర్ణ, అడవిరాముడు, యమగోల. బాలకృష్ణకు ‘యమగోల’ సినిమా చేసే అవకాశం మిస్ అయినా ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆ సినిమాలోని పాటకు స్టెప్స్ వేసే ఛాన్స్ మాత్రం దక్కింది.