English | Telugu
తొలి పాట పాడేందుకు కోదండపాణిని ముప్పు తిప్పలు పెట్టిన ఎస్.పి.బాలు!
Updated : Sep 25, 2024
గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇంకా మన మధ్యే ఉన్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా తన పాటలతో, తన గాత్రంతో ఇంకా జీవించే ఉన్నారు. సంగీత ప్రియులందరూ అదే భావనతో ఉంటారు. ఎందుకంటే తన పాటలతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలు ఎప్పటికీ చిరంజీవే అనేది ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన విషయం. ఆయన మన నుంచి దూరమై నేటికి నాలుగు సంవత్సరాలు. దేశంలోని పలు భాషల్లో వేల సంఖ్యలో పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన బాలు ఎంతో మంది హీరోల ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు.
చిత్ర పరిశ్రమలో ఏ నేపథ్యగాయకుడికీ లేని ప్రత్యేకత బాలుకి ఉంది. ఆయన ఎలాంటి పాటలైనా పాడగలరు. కామెడీ, లవ్, విషాదం, పౌరాణికం, భక్తిపాటలు, ఫాస్ట్ బీట్ సాంగ్స్, మాస్ సాంగ్స్.. ఇలా ఏ పాట పాడినా దానికి జీవం పోసే శక్తి ఆయనకు ఉంది. మంచి ఇంజనీర్ అవ్వాలన్న జీవిత లక్ష్యంతో ఉన్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అనుకోకుండానే సింగర్ అయ్యారు. కోట్ల మంది ఆరాధ్య గాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. నేపథ్యగాయకుడిగానే కాదు, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకుడిగా ఘనకీర్తిని సాధించారు. సింగర్‌గా ఆయన కెరీర్‌లో ఎన్నో విశేషాలు ఉంటాయి. అయితే సెప్టెంబర్ 25న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా ఆ గానగంధర్వుడికి నేపథ్యగాయకుడిగా తొలి అవకాశం రావడం వెనుక జరిగిన సంఘటనల గురించి తెలుసుకుందాం.
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరులో జన్మించారు. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. బాలుకి ఇద్దరు సోదరులు, నలుగురు చెల్లెళ్లు. వారిలో ఎస్.పి.శైలజ, ఎస్.పి.వసంత కూడా సింగర్స్‌గా రాణించారు. ఎస్.పి.బాలు... సావిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పల్లవి, ఎస్.పి. చరణ్ సంతానం. ఇద్దరూ వెండి తెరపై గాయకులుగా అడుగు పెట్టారు. తండ్రి స్థాయిలో పాటలు పాడకపోయినా తమదైన శైలిలో పాటలు పాడుతున్నారు. ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించి ఒక విశేషం ఉంది. అదేమిటంటే.. చరణ్, పల్లవి ఇద్దరి సంతానం కవల పిల్లలు కావడం విచిత్రం.
సినిమా రంగంలో గాయకుడిగా రాణించాలని బాలు ఏనాడూ అనుకోలేదు. కొడుకు గొప్ప ఇంజనీరు కావాలన్నది బాలు తండ్రి కోరిక. దీంతో చెన్నయ్‌లో ఇంజనీరింగ్‌కి ప్రత్యామ్నాయంగా ఉన్న ఎఎంఐఇ కోర్సులో చేరారు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సరదాగా పాటలు పాడేవారు. ఆ సమయంలో ఒక పాటల పోటీ జరిగింది. తనకు తెలియకుండానే బాలు మిత్రుడు ఆ పోటీకి పేరు ఇచ్చాడు. తప్పనిసరై స్టేజ్ ఎక్కాల్సి వచ్చింది. అక్కడ జడ్జిలుగా ఘంటసాల, పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి ఉన్నారు. వారిని చూడగానే బాలుకి కంగారు మొదలైంది. అయినా ధైర్యం తెచ్చుకొని ‘రాగము.. అనురాగము.. జీవన రాగములౌగా.. జీవనరాగములౌగా..’ అంటూ తనే రాసుకొని తనే కంపోజ్ చేసుకున్న పాటను ఆ వేదికపై పాడారు. ఆ కార్యక్రమానికి వచ్చిన ఎస్.పి.కోదండపాణి సింగర్‌గా అవకాశం ఇస్తానని బాలుకి మాట ఇచ్చారు. ఆ తర్వాత దర్శకుడు ఎస్.భావనారాయణ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో బాలుకి అవకాశం ఇవ్వాలని ప్రయత్నించారు కోదండపాణి. కానీ, కుదరలేదు. అయినా అధైర్యపడవద్దని, తను ఇంకా రెండు సినిమాలు చేస్తున్నానని చెప్పారాయన. ఒక డేట్ చెప్పి ఆరోజు కలవమని చెప్పారు. కానీ, ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరం ఆయన్ని బాలు కలవలేదు. ఆయనకు అడ్రస్ కూడా ఇవ్వలేదు. కానీ, కోదండపాణి పట్టు వదలకుండా బాలు చదువుతున్న కాలేజీ కనుక్కొని క్లాస్ రూమ్‌లో ఉన్న అతన్ని బయటకు పిలిపించి పద్మనాభం దగ్గరకు తీసుకెళ్ళారు. ఆ సమయంలో ఆయన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో తొలిసారి అవకాశం ఇచ్చారు ఎస్.పి.కోదండపాణి. అయితే విడుదలైన తొలి సినిమా మాత్రం ‘కాలచక్రం’. తొలి పాట గురించి తెలుసుకున్న నిర్మాత ఎం.ఎస్.రెడ్డి ‘కాలచక్రం’ అనే డబ్బింగ్ సినిమాలో అన్ని పాటలూ పాడే అవకాశం ఇచ్చారు. బాలు కెరీర్‌లో విడుదలైన తొలి సినిమా కూడా అదే.
ఆ తర్వాత నెలకి ఒకటి, రెండు పాటలు రావడం మొదలైంది. క్రమంగా పాటల సంఖ్య పెరిగింది. ఆ సమయంలో కాలేజీకి వెళ్ళడానికి కూడా బాలు ఇబ్బంది పడేవారు. ఇంజనీర్ కావాలన్న తన తండ్రి కోరిక, తన కోరిక నెరవేరేలా లేదని భావించి ఈ విషయంలో తండ్రి సలహా అడిగారు బాలు. చదువును కొనసాగించు లేదా సింగర్‌గా ప్రయత్నించు. అంతేగానీ, రెండు పడవల మీద మాత్రం ప్రయాణం చెయ్యొద్దు అని చెప్పారు. సింగర్‌గా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాల నుకున్నారు బాలు. ఇందులో రాణించలేకపోతే తర్వాత అయినా ఇంజనీరింగ్ కంటిన్యూ చెయ్యొచ్చు అనుకున్నారు. కానీ, ఆ అవసరం రాలేదు. సింగర్‌గా బిజీ అయిపోయి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా సింగర్‌గా తొలి అవకాశం రావడం వెనుక ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జీవితంలో జరిగిన విశేషాలివి. ఆ తర్వాత బాలు సింగర్‌గా ఎన్ని విజయాలు సాధించారు, ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతటి మహాగాయకుడు ఎస్.పి.బాలు వర్థంతి సెప్టెంబర్ 25. ఈ సందర్భంగా ఆ గానగంధర్వుడికి ఘననివాళి అర్పిస్తోంది తెలుగువన్.