English | Telugu
నాలుగో క్లాస్‌లోనే లెజండరీ యాక్టర్ల ముందు పాడి అదరగొట్టిన 'వందేమాతరం' శ్రీనివాస్!
Updated : Jun 9, 2021
'వందేమాతరం' శ్రీనివాస్ అంటే నేటి యంగ్ జనరేషన్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. ఆయనా.. ఔట్‌డేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని చప్పరించేయవచ్చు. మూడు సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, మూడు సార్లు బెస్ట్ సింగర్‌గా నంది అవార్డులు అందుకున్న వందేమాతరం శ్రీనివాస్ అంటే.. ఒకప్పుడు సింగింగ్ సునామీ! తన పాటతో సంగీతప్రియుల రక్తాన్ని సలసలా మరిగించిన విప్లవ తరంగం! తన గొంతుతో వేలాది గొంతులకు ప్రేరణనిచ్చిన ఒక మహోద్వేగం!
కాలేజీ కుర్రవాడా.. (స్వరాజ్యం), అత్తా పోదాము రావే సర్కారు దవాఖానకి (నేటి భారతం), వందేమాతర గీతం వరస మారుతున్నది (వందేమాతరం), బండెల్లిపోతోందే సెల్లెలా.. (ఇదా ప్రపంచం), అయ్యా నే సదివి బాగుపడతా (రేపటి పౌరులు) , లబోదిబో లబ్జనకర (ప్రజాస్వామ్యం), రాములమ్మో ఓ రాములమ్మా (ఒసేయ్ రాములమ్మా), మల్లెతీగకు పందిరివోలె (ఒరేయ్ రిక్షా), ఎర్రజెండెర్రజెండర్రజెండన్నీయలో (చీమలదండు) లాంటి పాటలతో వందేమాతరం శ్రీనివాస్ సృష్టించిన అలజడి సామాన్యమైంది కాదు.
ఆ రోజుల్లో శ్రీనివాస్ పాడాడంటే శ్రోతలు మైమరచి పోవాల్సిందే. ప్రేక్షకుల్లో థియేటర్లలో కుర్చీలు ఉద్వేగంతో ఊగిపోవాల్సిందే!. ఒంగోలులో సి.యస్.ఆర్. శర్మ కాలేజీలో బీఏ చదివి, నెల్లూరులో బీఎల్ పట్టా పుచ్చుకున్న శ్రీనివాస్ ప్రజా నాట్యమండలి ఆస్థాన గాయకుడు. చిన్నతనంలోనే ప్రజానాట్య మండలి గాయకుడు కావడానికీ, నెల్లూరులో బీఎల్ చదవడానికీ, మద్రాసుకు సినిమాల్లో పాడేందుకు వెళ్లడానికీ ఒక కథ ఉంది. ఆ కథ వెనుక పట్టువదలని విక్రమార్కుడి మొండితనం ఉంది.
అది.. 1975 నవంబర్. ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి శిక్షణా శిబిరం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచీ దాదాపు 200 మంది ఔత్సాహిక కళాకారులు పాటలు నేర్చుకోవడానికి ఆ శిబిరానికి వచ్చారు. ఖమ్మం సమీపంలోని రామకృష్ణాపురం అనే ఊళ్లో పుట్టిపెరిగిన శ్రీనివాస్ అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆ శిబిరం గురించి విన్నాడు. అక్కడ పాడాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవు, తమ ఊరి నుంచి ఖమ్మంకు వెళ్లాడు. తానూ పాడతానని అన్నాడు. కానీ అక్కడి కార్యకర్తలు నిక్కరు తొడుక్కున్న ఈ బుడతడు పాడతాడా అన్నట్లు చూసి, అతడిని పట్టించుకోలేదు. కానీ పట్టుదలగా మూడు రోజులు అక్కడే ఉన్నాడు శ్రీనివాస్.
మూడో రోజు ఉదయం అనుకోకుండా అతనికి అక్కడ పాడే అవకాశం దొరికింది. ప్రోగ్రామ్‌లో కొంత ఖాళీ ఏర్పడింది. దాన్ని భర్తీ చెయ్యడానికి "ఎవరైనా పాడేవాళ్లుంటే రండి" అని నిర్వాహకులు ఆహ్వానించారు. మళ్లీ ఈలోపు ఎవరైనా వస్తే ఆ చాన్స్ పోతుందేమో అనే కంగారుతో పరుగెత్తుకుంటూ వెళ్లి మైక్ పట్టుకున్నాడు శ్రీనివాస్. హై పిచ్‌లో ఆ పిల్లాడు పాడుతుంటే అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యచకితులయ్యారు. ప్రేక్షకుల్లో నాగభూషణం, జమున, అల్లు రామలింగయ్య, రాజబాబు లాంటి మహామహులున్నారు. అప్పుడు శ్రీనివాస్ పాడిన పాట ఏమిటో తెలుసా? 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో శ్రీశ్రీ రాసిన "తెలుగువీర లేవరా.." పాట. దాన్నెలా పాడాలో అతనికెవరూ నేర్పించలేదు. ఆ సినిమాని 15 సార్లు చూసి, ఆ పాట నేర్చుకున్నాడు.
ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వర్లుకు శ్రీనివాస్ వాయిస్ తెగ నచ్చేసింది. "నాతో వస్తావా?" అనడిగారు. "నాకు పాట నేర్పిస్తానంటే తప్పకుండా వస్తానండీ" అన్నాడు శ్రీనివాస్. దివంగతులు టి. కృష్ణ, మాదాల రంగారావు లాంటి వాళ్లకే గురువైన నల్లూరి అప్పట్నుంచీ శ్రీనివాస్‌కూ గురువయ్యారు. శ్రీనివాస్ చదువు సంధ్యల బాధ్యతలు చూసుకుంటూనే, అతడిని గాయకుడిగా తీర్చిదిద్దారు. అందుకే, "నాకు జన్మనిచ్చింది నా తల్లితండ్రులైనా, చదువు చెప్పించిందీ, సంస్కారం నేర్పిందీ నల్లూరి వెంకటేశ్వర్లుగారే." అని వినమ్రంగా చెబుతారు శ్రీనివాస్.
మాదాల రంగారావు నటించి, నిర్మించిన 'స్వరాజ్యం' చిత్రంతో సినీ గాయకుడిగా అవతారం ఎత్తాడు శ్రీనివాస్. తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తనదైన ప్రత్యేక టిపికల్ వాయిస్‌తో గాయకలోకంలో ఒక ప్రభంజనమే సృష్టించాడు. 'వందేమాతరం' సినిమాకు పాడిన పాటలతో వచ్చిన పేరుతో ఆయన పేరు 'వందేమాతరం' శ్రీనివాస్‌గా మారిపోయింది.