English | Telugu
బాలకృష్ణ లవర్ బాయ్‌గా అలరించిన 'సీతారామ కల్యాణం' విశేషాలెన్నో!
Updated : Jun 9, 2021
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోని చక్కని చిత్రాల్లో 'సీతారామ కల్యాణం' ఒకటి. ఆయన నటించిన అతికొద్ది ప్రేమకథాచిత్రాల్లో ఇదొకటి. జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా విశేషాలను చెప్పుకుందాం. జంధ్యాల దర్శకత్వంలో ఇది ఆయన నటించిన రెండో చిత్రం. ఇదివరకు వారి కలయికలో 'బాబాయ్ అబ్బాయ్' లాంటి హాస్య చిత్రం వచ్చింది. 'సీతారామ కల్యాణం' సినిమాలో బాలకృష్ణ, రజని జోడీ చాలా ముచ్చటగా ఉందనే పేరు వచ్చింది. లవర్ బాయ్‌గా బాలయ్య అలరించారు. నిజానికి హీరోయిన్‌గా మొదట అనుకున్న పేరు భానుప్రియ. కానీ చివరి నిమిషంలో ఆ పాత్ర రజనికి దక్కింది.
వార్తా పత్రికల్లో వచ్చిన ఓ వార్త ఆధారంగా ఈ సినిమా కథను అల్లారు. సీతారాముల విగ్రహాలకి సంబంధించి రెండు గ్రామాల మధ్య గొడవలు వస్తే, కలెక్టర్ మీడియేటర్‌గా వ్యవహరించి ఆ రెండు గ్రామాల మధ్య గుడి కట్టించి, సీతారాముల విగ్రహాలను అందులో ప్రతిష్ఠించారనేది ఆ వార్తలోని ప్రధానాంశం. కథాచర్చలు ఐదారు నెలల పాటు నిర్మాత మురారి ఆఫీసులో జరిగాయి. మురారి, జంధ్యాలతో పాటు రచయిత భమిడిపాటి రాధాకృష్ణ సైతం ఆ చర్చల్లో పాల్గొన్నారు.
తన గత చిత్రాలకు భిన్నంగా జంధ్యాల ఈ చిత్రాన్ని రూపొందించారు. అదివరకు ఆయన సీరియస్ డ్రామాతో ప్రేమకథను తియ్యలేదు. అంతేకాదు, తన మునుపటి చిత్రాలకు డైలాగ్స్‌ను వేరే రచయితలతో కలిసి రాస్తూ వచ్చిన ఆయన ఈ చిత్రానికి పూర్తి సంభాషణలను తనే రాశారు. బాలకృష్ణకు ఆయన రాసిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించింది జంధ్యాల కాదు, ఆయన దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇ.వి.వి. సత్యనారాయణ. గురువు ప్రోత్సహించడంతో ఆయన ఆ క్లైమాక్స్‌ను చక్కగా తీసి, భవిష్యత్తులో గురువు పేరును నిలబెట్టిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్నారు.
కె.వి. మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ రసగుళికలే. ప్రధానంగా ఆత్రేయ రాసిన పాటలు ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉంటాయి. "రాళ్లల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేర్లు", "వీళ్లూ వాళ్లూ ఎవరంట నువ్వూ నేనూ ఒకటంట", "కల్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కల్యాణమే", "ఎంత నేర్చినా ఎంత చూసినా" పాటలను ఆత్రేయ రాశారు.
"ఎంత నేర్చినా" అనేది త్యాగరాజ కృతి. దాని ఆధారంగా ఈ సినిమాలో "ఎంత నేర్చినా ఎంత చూసినా" పాటను రాశారు ఆత్రేయ. రజనీని కలుసుకోవడానికి సంగీతం మేస్టారు వేషంలో ఆమె ఇంటికి వచ్చిన బాలకృష్ణ ఆమెకు పాట నేర్పే సన్నివేశంలో ఈ పాట వస్తుంది. ఈ పాటలో సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు గెటప్పుల్లో కనిపిస్తారు బాలకృష్ణ, రజని.
"కల్యాణ వైభోగమే" పాటను గోదావరి మధ్యలో ఉండే ఇసుక లంకలపై ఎలక్ట్రికల్ బల్బులు అమర్చి 5 రాత్రుళ్లు బాలయ్య, రజని జంటపై చిత్రీకరించారు. 140 మంది ఎలక్ట్రీషియన్లు ఈ పాట సెట్టింగ్‌ల కోసం పనిచేశారంట.
పద్నాలుగు సంవత్సరాల క్రితం విడిపోయిన సీతారాముల విగ్రహాలతో పాటుగా హీరో హీరోయిన్లు కలుసుకోవడం అనే పాయింట్ ప్రేక్షకులకు బాగా నచ్చేసి, 'సీతారామ కల్యాణం'కు ఘన విజయం చేకూర్చిపెట్టారు. 1986 ఏప్రిల్ 18న విడుదలైన ఈ సినిమా 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.