English | Telugu
ఇంకా బ్రేకీవెన్ కాని 'వకీల్ సాబ్'.. 14 రోజుల కలెక్షన్ ఎంతంటే...
Updated : Apr 24, 2021
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వకీల్ సాబ్' సినిమా 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 లక్షల షేర్ రాబట్టింది. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అంచనాలకు దూరంగా కలెక్షన్లు రాబడుతుండటానికి కారణం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితే. కొవిడ్-19 కేసులు ఊహాతీతంగా పెరుగుతూ భయాందోళనలు రేకెత్తుతుండటంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలనే ధ్యాస ప్రజల్లో సన్నగిల్లుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వకీల్ సాబ్' ప్రి బిజినెస్ వాల్యూ రూ. 80.35 కోట్లు. 14 రోజులకు వచ్చింది రూ. 78.26 కోట్లు. అంటే దాదాపు 97.4 శాతం రికవర్ అయినట్లే. మామూలు పరిస్థితులు ఉన్నట్లయితే ఈసరికి బ్రేకీవెన్ అయివుండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 14 రోజులకు 'వకీల్ సాబ్' ఆంధ్రలో రూ. 40.49 కోట్లు, తెలంగాణలో రూ. 24.92 కోట్లు, రాయలసీమలో రూ. 12.85 కోట్లు వసూలు చేసింది.
తెలంగాణలో ప్రి బిజినెస్ విలువ రూ. 25.2 కోట్లకు గాను ఇప్పటికే రూ. 24.92 కోట్లు రికవర్ అయ్యింది. అంటే 98.8 శాతం రికవర్ అయ్యింది. శుక్రవారం ఇక్కడ రూ. 5 లక్షల షేర్ వచ్చింది. ఈ వారంతో తెలంగాణలో ఈ సినిమా బ్రేకీవెన్ కావచ్చని ఆశిస్తున్నారు.
ఆంధ్రలో ప్రి బిజినెస్ వాల్యూ రూ. 41.75 కోట్లకు గాను 14 రోజులకు వచ్చింది రూ. 40.49 కోట్లు. రికవరీ శాతం సుమారు 96.9. ఈ ఏరియాలో కొంతమంది ఎంతో కొంత నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
రాయలసీమ ప్రి బిజినెస్ వాల్యూ రూ. 13.4 కోట్లకు గాను తొమ్మిది రోజులకు వచ్చింది రూ. 12.85 కోట్లు. రికవరీ అయ్యింది సుమారు 95.9 శాతం. ఈ ఏరియాలోనూ కొద్దిమంది బయ్యర్లు నష్టపోనున్నారు.
మొత్తానికి భారీ ఓపెనింగ్స్ రాబట్టిన 'వకీల్ సాబ్' మూడో వారంలో కొవిడ్-19 దెబ్బకు నిరాశాజనక ఫలితాలను అందిస్తున్నాడు. మొదట బ్లాక్‌బస్టర్ అవడం ఖాయమనుకున్న స్టేజ్ నుంచి బ్రేకీవెన్ అయితే చాలనుకొనే స్టేజ్‌కు వచ్చాడు.