English | Telugu
రెమ్యునరేషన్ విషయంలో తనికెళ్ళ భరణి సీరియస్.. షాకైన నిర్మాత!
Updated : Jun 20, 2024
నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య సంబంధాలు బాగున్నప్పుడే మంచి సినిమాలు రూపొందుతాయి. ఒక సినిమా షూటింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తవ్వాలంటే అందులో నిర్మాత పార్టిసిపేషన్ ఎంతో ఉంటుంది. అనుకున్న టైమ్‌లోనే సినిమా పూర్తి చేయడానికి నిర్మాత ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కేవలం డబ్బు పెట్టుబడిగా పెట్టడంతోనే నిర్మాత బాధ్యత తీరిపోదు. ఎన్నో విషయాల్లో ఇన్‌వాల్వ్ అయినపుడే ఒక మంచి సినిమా రూపుదిద్దుకుంటుంది. 1999లో విడుదలైన ‘ఆవిడే శ్యామల’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. చక్కని కుటుంబ కథా చిత్రంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణల పెర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన ఓ సంఘటనను ఆ చిత్ర నిర్మాత రుద్రరాజు సీతారామరాజు గుర్తు చేసుకున్నారు. మహానటి సావిత్రి వంటి వారితో సినిమాలు నిర్మించడమే కాదు, కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించిన సీతారామరాజుకి నటుడు తనికెళ్ళ భరణి వల్ల ఓ కొత్త అనుభవం ఎదురైంది.
మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘చింత విష్టయాయా శ్యామల’ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకొని సినిమా నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు సీతారామరాజు. ముత్యాల సుబ్బయ్యగానీ, కోడి రామకృష్ణగాని డైరెక్టర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. ముత్యాల సుబ్బయ్య అప్పటికే ఓ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక కోడి రామకృష్ణ ‘దేవీపుత్రుడు’ చేస్తున్నారు. తాను సినిమా చెయ్యలేనని చెప్పారు కోడి రామకృష్ణ. అప్పుడు నిర్మాత ఎం.ఎస్.రాజు ఒక మంచి సినిమా చేసే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని వదులుకోవద్దని, మనం ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకుందామని కోడి రామకృష్ణకు చెప్పి ఒప్పించారు ఎం.ఎస్.రాజు. అప్పుడు ‘చింత విష్టయాయా శ్యామల’ కథ విన్న కోడి ఎంతో ఎక్సైట్ అయ్యారు. తెలుగుకి అనుగుణంగా స్క్రిప్ట్‌ని రెడీ చేసి ‘ఆవిడే శ్యామల’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో సినిమాను ప్రారంభించారు.
ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉంది. దానికి తనికెళ్ళ భరణి అయితే కరెక్ట్‌గా సరిపోతాడని భావించిన కోడి రామకృష్ణ అదే విషయాన్ని నిర్మాత సీతారామరాజుకి చెప్పారు. భరణితో అంతకుముందే మంచి స్నేహం ఉండడంతో ఆ రెండు రోజుల క్యారెక్టర్‌కి ఒప్పించారు నిర్మాత. అడ్వాన్స్ ఇవ్వబోతుంటే.. తర్వాత తీసుకుంటానులే అని ఆ అమౌంట్ తీసుకోలేదు. రెండు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయారు భరణి. రెమ్యునరేషన్ గురించిగానీ, అడ్వాన్స్ గురించిగానీ ఏమీ అడగలేదు. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు భరణి. డబ్బింగ్ పూర్తయితే ఏ నటుడికైనా సినిమాతో సంబంధం ఉండదు. డబ్బింగ్ పూర్తి చేసేసి వెళ్లిపోతున్న భరణిని ఆపి ‘మీ రెమ్యునరేషన్ గురించి ఏమీ చెప్పలేదు. కనీసం అడ్వాన్స్ కూడా తీసుకోలేదు’ అని అడిగారు సీతారామరాజు. దానికి భరణి ‘నేను ఈ సినిమాలో అతిథి పాత్ర చేశాను. అంటే నేను మీ అతిథిని. అతిథి డబ్బు తీసుకుంటాడా..’ అని కోపాన్ని ప్రదర్శిస్తూ అడిగారు. ‘మీరు డబ్బు తీసుకోకుండా ఈ క్యారెక్టర్ చెయ్యడం నాక్కూడా నచ్చదు. మీరు తీసుకోవాల్సిందే’ అన్నారు నిర్మాత. ‘ఒక చిన్న క్యారెక్టర్ చేసినందుకు కూడా మీ దగ్గర డబ్బు తీసుకుంటే అడిగినందుకు మీకు, చేసినందుకు నాకు వేల్యూ ఏం ఉంటుంది’ అన్నారు. ఇద్దరి మధ్య ఎంతో వాగ్వాదం జరిగిన తర్వాత బలవంతంగా కొంత డబ్బును భరణి జేబులో పెట్టేశారు సీతారామరాజు. ఇలాంటి సంఘటనలు నిర్మాతకు ఎంతో మనో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయని, దానివల్ల మరిన్ని మంచి సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది అంటున్నారు నిర్మాత సీతారామరాజు.