English | Telugu

ఆ హిందీ సినిమాకు 5 లక్షల మంది నిర్మాతలు!

ఒక సినిమాని నిర్మించాలంటే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిర్మాతలు ఉండడం సహజం. కొన్ని సినిమాలను నాలుగైదు సంస్థలు కూడా కలిసి నిర్మిస్తాయి. కానీ, ఒక హిందీ సినిమా నిర్మాణానికి 5 లక్షల మంది భాగస్వామ్యం వహించారంటే నమ్ముతారా? ఇది నిజం. ఆ సినిమా పేరు ‘మంథన్‌’. గిరీశ్‌ కర్నాడ్‌, నసీరుద్దీన్‌షా, అమ్రిష్‌పురి, స్మితా పాటిల్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 1976లో ‘మంథన్‌’ విడుదలైంది. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేసి శ్వేత విప్లవ పితామహుడిగా పేరు తెచ్చుకున్న వర్గీస్‌ కురియన్‌ జీవిత కథ నేపథ్యంలో శామ్‌ బెనెగల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వర్గీస్‌ వచ్చిన తర్వాతే గుజరాత్‌ పాడి రైతుల జీవితాలు బాగుపడ్డాయి. వారి జీవితాల్లో ఆయన వెలుగును నింపారు. 

వర్గీస్‌ జీవితకథ ఆధారంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో దానికి రైతులు భాగస్వామ్యం వహించడం సముచితం అని భావించారు శ్యామ్‌ బెనెగల్‌. ఆయన ఆలోచనకు గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. ఈ సంస్థలో భాగస్వాములైన 5 లక్షల మంది రైతులు రూ.2 చొప్పున అందించారు. ఇంత ఎక్కువ మంది కలిసి నిర్మించిన తొలి క్రౌడ్‌ ఫండింగ్ మూవీగా ప్రపంచ రికార్డు సృష్టించింది ‘మంథన్‌’. అలాగే మన దేశంలో నిర్మించిన తొలి క్రౌడ్‌ ఫండింగ్ మూవీ కూడా ఇదే. ఈ సినిమాకి ఘనవిజయం చేకూర్చాలని రైతులు ఎద్దుల బండ్లపై వేలాదిగా థియేటర్లకు తరలివచ్చారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద చర్చనీయాంశమైంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గుజరాత్‌లోని ఖేడా జిల్లా పేద రైతులు సమిష్టిగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. త్రిభువన్‌దాస్‌ పటేల్‌ వంటి నాయకుల ఆధ్వర్యంలో కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం ఏర్పడుతుంది. గుజరాత్‌లోని ప్రతి జిల్లాలో ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేశారు. ఈ సంఘాల వల్లే 1946లో గుజరాత్‌లోని ఆనంద్‌లో పాల సహకార సంస్థ ‘అమూల్‌’ ఏర్పాటు చేయడం జరిగింది. చివరికి 1970లో నేషన్‌వైడ్‌ మిల్క్‌ గ్రిడ్‌ను సృష్టించడం ద్వారా భారతదేశంలో శ్వేత విప్లవం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ‘మంథన్‌’ చిత్రాన్ని రూపొందించారు. 

1977లో ఉత్తమ హిందీ చిత్రంగా ‘మంథన్‌’ జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే విజయ్‌ టెండూల్కర్‌ ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. 1976లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ చిత్రాన్ని ఆస్కార్‌ అవార్డుకు పంపించారు. ఈ చిత్రం టైటిల్‌ సాంగ్‌ ‘మేరో గామ్‌ కథపరే..’ను పాడిన ప్రీతి సాగర్‌కు ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్‌ అవార్డు లభించింది. ఆ తర్వాత ఈ పాటను అమూల్‌ కోసం చేసిన టీవీ యాడ్స్‌లో సౌండ్‌ ట్రాక్‌గా ఉపయోగించారు.