English | Telugu
రెండో సినిమాకే ఇంటికి వెళ్లిపోవాల్సిన రాజేంద్రప్రసాద్.. దర్శకనిర్మాతగా చరిత్ర సృష్టించారు!
Updated : Sep 30, 2024
తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది నిర్మాతలు తమ అభిరుచి మేరకు అత్యుత్తమ చిత్రాలను నిర్మించి అగ్ర నిర్మాతలుగా వెలుగొందారు. వారిలో ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ ఒకరు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు 30 సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా 1971లో వచ్చిన ‘దసరాబుల్లోడు’ చిత్రంతో దర్శకుడిగా మారి 1986 వరకు సినిమాలు రూపొందించారు. వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ‘కెప్టెన్ నాగార్జున్’. ఆయన కాలేజీ రోజుల్లో చదవులో తప్ప మిగతా అన్ని యాక్టివిటీస్‌లో ఎంతో చురుకుగా ఉండేవారు. రాఘవ కళాసమితి పేరుతో ఓ సాంస్కృతిక సంస్థను స్థాపించి లెక్కకు మించిన నాటకాలు ప్రదర్శించారు. నటుడిగా మంచి గుర్తింపును, అవార్డులను సొంతం చేసుకున్నారు. హీరోగా సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వాలనేది ఆయన కోరిక. ఆ కోరికతోనే మద్రాస్‌లో అడుగు పెట్టారు. అంతకుముందే అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం ఉండడంతో ఆయన ద్వారా అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ, నటుడిగా రాజేంద్రప్రసాద్‌కి అవకాశాలు రాలేదు.
అప్పుడు చిత్ర నిర్మాణం వైపు దృష్టి సారించారు రాజేంద్రప్రసాద్. తన తండ్రి జగపతి పేరుతో జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థను ప్రారంభించారు. జగ్గయ్య హీరోగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో తొలి చిత్రం ‘అన్నపూర్ణ’ నిర్మించారు. జగపతి సంస్థలో వి.మధుసూదనరావు ఆస్థాన దర్శకుడైపోయారు. ఆ సంస్థ వరసగా నిర్మించిన ఆరు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. జగపతి సంస్థ నిర్మించిన రెండో సినిమాతోనే రాజేంద్రప్రసాద్ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. ఆ సినిమా అటో ఇటో అయితే తిరిగి ఊరికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో బెంగాలీ నవలలు తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేవి. దాంతో సాగరిక అనే నవల ఆధారంగా ‘ఆరాధన’ చిత్రాన్ని ప్రారంభించారు. నవలగా అద్భుతం అనిపించింది. సగం సినిమా షూటింగ్ జరిగిన అది రాజేంద్రప్రసాద్‌ను డిజప్పాయింట్ చేసింది. కథలో డ్రా బ్యాక్ ఏమిటంటే.. సినిమాలో ముప్పావు భాగం హీరో అంధుడిగా కనిపిస్తాడు. అప్పటివరకు రొమాంటిక్ హీరోగా అలరిస్తూ వచ్చిన అక్కినేని నాగేశ్వరరావును ఆ క్యారెక్టర్‌లో చూసి ప్రేక్షకులు తట్టుకోగలరా అనుకున్నారు.
ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఓ సలహా ఇచ్చారు. ప్రముఖ డైరెక్టర్లుగా ఉన్న బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి వంటి వారికి అప్పటివరకు తీసిన సినిమా చూపించమన్నారు. ఆ డైరెక్టర్లు చూసి ‘నువ్వు కొత్తగా ఇంస్ట్రీకి వచ్చావు. ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా తీసే జనం ఎలా చూస్తారనుకున్నారు’ అన్నారు. అప్పుడు రాజేంద్రప్రసాద్‌కి ఏం చెయ్యాలో తోచలేదు. అప్పటి వరకు తీసిన సినిమాను పక్కన పెట్టి వేరే కథ ట్రై చేద్దామా అని అక్కినేని అన్నారు. తన దగ్గర ఉన్న డబ్బు అంతంత మాత్రమేనని, కొత్తగా మరో సినిమా చేసే పరిస్థితి లేదని, ఆ సినిమానే కంటిన్యూ చేద్దామని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆ కథతోనే సినిమాను పూర్తి చేశారు. 1962 ఫిబ్రవరి 16న ‘ఆరాధన’ విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో నిర్మాతగా నిలదొక్కుకున్నారు రాజేంద్రప్రసాద్. అలా వరసగా ఆరు సినిమాలు వి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించిన ఆయన ఏడో సినిమాగా ఎ.సంజీవి దర్శకత్వంలో ‘అక్కాచెల్లెలు’ నిర్మించారు. ఆ సినిమా తర్వాత 1971లో ‘దసరాబుల్లోడు’ చిత్రంతో దర్శకుడిగా మారారు రాజేంద్రప్రసాద్. తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత 30 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఇండస్ట్రీలో కొనసాగాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న తనను ‘ఆరాధన’ సినిమా నిలబెట్టిందని, ఆ సినిమాకి సంబంధించిన జరిగిన పరిణామాలు తాను ఎప్పటికీ మర్చిపోలేనని వి.బి.రాజేంద్రప్రసాద్ చెప్పేవారు. 1986 తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోని ఆయన 1998 వరకు నిర్మాతగా కొనసాగారు. వి.బి.రాజంద్రప్రసాద్ నిర్మించిన చివరి సినిమా జగపతిబాబు హీరోగా వచ్చిన ‘పెళ్లి పీటలు’.