English | Telugu

అల్లు అంటే హాస్యపు జల్లు.. 50 ఏళ్లపాటు నవ్వులు పంచిన హాస్య చక్రవర్తి!

‘అల్లు అంటే హాస్యపు జల్లు’.. ఇది పాతతరం నుంచి ఇప్పటి తరం వరకు జనం నోళ్ళలో నానుతున్న మాట. ఎంతో మంది హాస్యనటులు ఉన్నా.. అల్లు రామలింగయ్య హాస్యానికి ఉన్న ప్రత్యేకత వేరు. తన కెరీర్‌లో చేసిన వందల సినిమాల్లోని హాస్య పాత్రలన్నీ ఎంతో విభిన్నంగా, విలక్షణంగా ఉంటాయి. ఎవరినీ అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నారు అల్లు. ఆయన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీ.. ఇలా అన్నీ ఆయన ప్రత్యేకతలే. నిజ జీవితంలో ఆయన్ని కలిసిన వారెవ్వరూ సినిమాల్లో హాస్యాన్ని అంత బాగా పండిస్తున్న అల్లు రామలింగయ్య ఇతనేనా అనుకుంటారు. ఎందుకంటే సినిమాల్లో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే ఆయన నిజజీవితంలో ఎంతో హుందాగా ఉండేవారు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు. 1950లో ‘పుట్టిల్లు’ చిత్రంతో నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేసిన అల్లు రామలింగయ్య చివరి చిత్రం 2003లో వచ్చిన ‘కళ్యాణరాముడు’. 53 ఏళ్ళ కెరీర్‌లో 1000కి పైగా సినిమాల్లో నటించిన అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్‌ 1. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.  

1992 అక్టోబర్‌ 1న పాలకొల్లులో జన్మించారు అల్లు రామలింగయ్య. వీరి తాత అల్లు సుబ్బారాయుడు హయాంలో చాలా ఆస్తులు ఉండేవి. అతని దానగుణం వల్ల ఆస్తులు కరిగిపోయాయి. తర్వాత ఆయన కుమారుడు అల్లు వెంకయ్య వ్యవసాయం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. వెంకయ్య, సత్తెమ్మ దంపతులకు ఏడుగురు సంతానం. వారిలో అల్లు రామలింగయ్యకు చదువుకంటే ఇతర వ్యాపకాలు ఎక్కువ. చిన్నతనంలోనే అందర్నీ అనుకరిస్తూ నవ్వించేవారు. అలా చేస్తుండగానే నటించాలన్న ఆసక్తి పెరిగింది. నాటకాల్లో నటించేందుకు నానా కష్టాలు పడిన అల్లు తొలిసారి భక్త ప్రహ్లాద నాటకంలో నటించారు. అలా నాటకాలు వేస్తున్న సమయంలోనే మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా జైలుకెళ్లాల్సి వచ్చింది. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ అంటరానితనంపై పోరాటం చేశారు. ఆరోజుల్లోనే వీలు చిక్కినప్పుడల్లా ప్రజలకు ఉచితంగా హోమియో వైద్యం చేసేవారు. 

తొలి చిత్రం ‘పుట్టిల్లు’ ఆర్థికంగా విజయం సాధించకపోయినా.. అల్లు రామలింగయ్యకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా.. అప్పటి అగ్ర తారలు ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లతో కలిసి ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు అల్లు. ‘పరివర్తన’, ‘చక్రపాణి’, ‘వద్దంటే డబ్బు’, ‘దొంగ రాముడు’, ‘సంతానం’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్‌’, ‘భాగ్యరేఖ’, ‘తోడికోడళ్ళు’, ‘పెళ్ళినాటి ప్రమాణాలు’, ‘ఆడపెత్తనం’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘మంచి మనసుకు మంచి రోజులు’, ‘ఇల్లరికం’.. ఇలా 1950వ దశకంలో లెక్కకు మించిన సినిమాలు చేసిన అల్లు ఆ తర్వాతి కాలంలో కామెడీ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. కేవలం హాస్య పాత్రలతోనే సరిపెట్టుకోకుండా సెంటిమెంట్‌ క్యారెక్టర్లు, విలన్‌ పాత్రలు, కామెడీ విలన్‌ పాత్రలతో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించారు అల్లు రామలింగయ్య. 

నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా తన అభిరుచి ఏమిటో చాటి చెప్పారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌ను స్థాపించి కుమారుడు అల్లు అరవింద్‌ను నిర్మాతగా ప్రోత్సహించారు. గీతా ఆర్ట్స్‌లో వచ్చే ప్రతి సినిమాకీ సమర్పకుడిగా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు అల్లు రామలింగయ్య. 50 ఏళ్ళ సినిమా కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన అల్లు రామలింగయ్య సినిమా రంగానికి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 1998లో ఫిలింఫేర్‌ లైఫ్‌ టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు, 2001లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. కొన్ని దశాబ్దాలపాటు ప్రేక్షకులపై హాస్యపు జల్లు కురిపించి వారి మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లు రామలింగయ్య జయంతి అక్టోబర్‌ 1. ఈ సందర్భంగా ఆయనకు ఘననివాళి సమర్పిస్తోంది తెలుగువన్‌.