English | Telugu

ఆ విషయంలో ‘లవకుశ’ చిత్రాన్ని క్రాస్‌ చేసిన ఎన్టీఆర్‌ సినిమా ఇదే! 

ఒక సినిమాను ప్రారంభించే ముందు దానికి సంబంధించిన అనేక విషయాలను ముందుగానే ప్లాన్‌ చేసుకుంటారు దర్శకనిర్మాతలు. సినిమా ఎన్నిరోజుల్లో పూర్తి చేయాలి, ఎంత బడ్జెట్‌ అవుతుంది, దానికి తగ్గట్టు సినిమాలో నటించే నటీనటుల డేట్స్‌ తదితర విషయాలన్నీ చూసుకున్న తర్వాతే షూటింగ్‌ ప్రారంభిస్తారు. అయితే కొన్ని సినిమాల విషయంలో ఇలాంటి లెక్కలు ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా నిర్మాణం, రిలీజ్‌ చాలా ఆలస్యం జరుగుతుంటాయి. ఎన్నో ఏళ్ళ తరబడి షూటింగ్‌ జరుపుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఎన్‌.టి.రామారావు, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవకుశ’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు పెట్టినరోజు నుంచి రిలీజ్‌ అవ్వడానికి ఐదేళ్ళు పట్టింది. ఆ సినిమాని అధిగమిస్తూ ఎన్‌.టి.రామారావు నటించిన మరో సినిమా ప్రారంభమైన తర్వాత తొమ్మిదేళ్ళకు విడుదలైంది. ఆ సినిమా పేరు ‘ఎవరు దేవుడు’. 

ఎ.వి.ఎం.రాజన్‌, షావుకారు జానకి జంటగా ఎం.ఎ.తిరుముగమ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తునైవన్‌’. ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రీదేవి ఐదేళ్ళ వయసులో బాలమురుగన్‌ పాత్రను పోషించింది. 1969లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు నిర్మాత వాసుదేవ మీనన్‌ రైట్స్‌ తీసుకున్నారు. 1972లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌, జమున ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. మిగతా పాత్రలను ప్రధాన తారాగణం పోషించింది. ఎ.భీమ్‌సింగ్‌ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాను 10 రీళ్ళ వరకు విజయవంతంగా పూర్తి చేశారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత ఐదేళ్ళపాటు ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు. ఈలోగా నిర్మాత వాసుదేవమీనన్‌ కన్నుమూసారు. 

1977లో వాసుదేవ మీనన్‌ కుమారులు హరిదాస్‌ మీనన్‌, రవి మీనన్‌ ఈ సినిమాను పూర్తి చేయాలనుకున్నారు. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఎన్‌.టి.రామారావును కలిసారు. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ఎన్టీఆర్‌ సినిమాను పూర్తి చేసేందుకు కావాల్సిన డేట్స్‌ ఇచ్చారు. అలాగే హీరోయిన్‌ జమున కూడా తగిన 
సహకారాన్ని అందించారు. మొత్తానికి సినిమా షూటింగ్‌ పూర్తి చేశారు. మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఫస్ట్‌ కాపీ తీసుకొచ్చారు. అయితే ఆ సమయానికి ఎన్టీఆర్‌ కెరీర్‌లో చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకు పౌరాణిక, జానపద చిత్రాలు, కుటుంబ నేపథ్యంలో సాగే కథలతో సినిమాలు చేస్తూ వచ్చిన ఆయనకు కమర్షియల్‌ హీరోగా ‘అడవిరాముడు’ చిత్రంతో కొత్త ఇమేజ్‌ వచ్చింది. ‘యమగోల’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘వేటగాడు’ వంటి కమర్షియల్‌ హిట్‌ సినిమాలు చేస్తున్నారు. 

అలాంటి సమయంలో ఒక సాఫ్ట్‌ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ నటించిన ‘ఎవరు దేవుడు’ చిత్రాన్ని రిలీజ్‌ చేసేందుకు పంపిణీదారులు ముందుకు రాలేదు.  అయినా పట్టు వదలకుండా ఎన్నో కష్టాలు పడి సినిమాను రిలీజ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. 1981 ఏప్రిల్‌ 4న ఈ సినిమాను విడుదల చేశారు. అప్పుడు ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమాల్లో స్టెప్పులతో కూడిన పాటలు, ఫైట్స్‌ వంటివి బాగా ఉండడంతో ‘ఎవరు దేవుడు’ చిత్రంలోని ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌ను ఆడియన్స్‌ చూడలేకపోయారు. ఫలితంగా ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. దాదాపు తొమ్మిది సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలకోర్చి సినిమాను పూర్తి చేసి విడుదల చేసినా నిర్మాతలకు ఎలాంటి ఉపయోగం జరగలేదు.