English | Telugu
లేడీ ఆడియన్స్ చూడకపోయినా.. బడ్జెట్‌కి నాలుగు రెట్లు కలెక్ట్ చేసిన సినిమా ఇదే!
Updated : Oct 1, 2024
ఒక సినిమా సూపర్‌హిట్ అవ్వాలన్నా, నిర్మాతకు కనకవర్షం కురవాలన్నా ప్రేక్షకుల ఆదరణ బాగుంటేనే సాధ్యమవుతుంది. అప్పుడే సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అవుతాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూస్తేనే కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ అవుతాయి. అలాంటిది.. మహిళా ప్రేక్షకులు థియేటర్స్‌కి రాకపోయినా సినిమా సూపర్‌హిట్ అయి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఉన్నాయా అంటే.. ఖచ్ఛితంగా అలాంటి సినిమా ఉండదు అనే మాటే వినిపిస్తుంది. కానీ, ఆ మాటను అబద్ధం చేసింది ఓ సినిమా. లేడీ ఆడియన్స్ లేకుండా ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించిన ఆ సినిమా పేరు ‘మోసగాళ్ళకు మోసగాడు’. శ్రీ పద్మాలయా మూవీస్ పతాకంపై కృష్ణ సోదరులు నిర్మించిన తొలి సినిమా ఇదే. కలెక్షన్ల పరంగా ఈ సినిమా సాధించిన రికార్డుల గురించి సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
సాహసాలు చెయ్యడంలో, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో కృష్ణకు మరెవ్వరూ సాటి లేరు అనేది ఆరోజుల్లో కృష్ణ అభిమానుల నుంచి ఇండస్ట్రీ వరకు అందరూ చెప్పుకునే మాట. దానికి తగ్గట్టుగానే తను చేసే సినిమాల ఎంపికలో ఎంతో దూకుడుగా వెళ్ళేవారు కృష్ణ. అలా ఇండియాలో ఎవరూ చేయని విధంగా కౌబాయ్ జోనర్‌లో సినిమా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ జోనర్‌లో మూవీ చెయ్యాలన్న ఆలోచన కృష్ణకు రావడానికి కారణమైన సినిమా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ. ఈ సినిమాను థియేటర్‌లో చూసిన కృష్ణకు అలాంటి సినిమాను తెలుగు నేటివిటీతో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. రచయిత ఆరుద్రతో ఆ సినిమా చూడమని చెప్పారు. సినిమా చూసిన ఆరుద్ర తెలుగులో క్యారెక్టర్లు మార్చి కౌబాయ్ సినిమా చెయ్యవచ్చు అని చెప్పారు. అయితే ఆ సినిమాతోపాటు మెకన్నాస్ గోల్డ్ అనే సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్‌ని జతచేసి చేస్తే బాగుంటుందని ఆరుద్ర చెప్పారు.
నెలరోజుల్లో మోసగాళ్ళకు మోసగాడు సబ్జెక్ట్‌ని రెడీ చేసి కృష్ణకు చెప్పారు ఆరుద్ర. ఆయనకు కథ బాగా నచ్చింది. వెంటనే షూటింగ్ ప్రారంభించారు. రూ.7 లక్షల బడ్జెట్‌తో సినిమాని కంప్లీట్ చేశారు. అయితే సినిమాలోని గ్రాండియర్ చూస్తే రూ.15 లక్షలు బడ్జెట్ అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ, బడ్జెట్‌ని బాగా కంట్రోల్ చేసి 7 లక్షల్లోనే తీశారు. ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌కి వచ్చిన నిర్మాత నాగిరెడ్డి.. ఇలాంటి సినిమాలు తెలుగులో ఎవరు చూస్తారు అంటూ తన సందేహాన్ని చెప్పారు. దీంతో కృష్ణకు ఆలోచన పట్టుకుంది. అలాంటి విషయాల్లో ఎన్టీఆర్ జడ్జిమెంట్ బాగుంటుందని భావించిన కృష్ణ ఆయన కోసం ప్రత్యేకంగా షో వేసి చూపించారు. సినిమా చూసిన తర్వాత ‘ఇది మాస్ సినిమా బ్రదర్.. తప్పకుండా హిట్ అవుతుంది. కాకపోతే లాంగ్ రన్ ఉండదు. అంతేకాదు, లేడీ ఆడియన్స్‌ని కూడా ఈ సినిమాకి ఎక్స్‌పెక్ట్ చెయ్యకండి’ అన్నారు. సినిమాను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ చెప్పినట్టే సినిమాకి లేడీ ఆడియన్స్ కరువయ్యారు. అయినా కృష్ణ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆడియన్స్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అప్పటివరకు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు మోసగాళ్ళకు మోసగాడు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. మహిళా ప్రేక్షకుల ఆదరణ ఉంటేనే సినిమాలు సూపర్‌హిట్ అవుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో కృష్ణ నిరుత్సాహపడలేదు. తప్పకుండా సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి అని ఊహించారు. ఆయన అనుకున్నట్టుగానే కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు లాభాలు తెచ్చిపెట్టింది మోసగాళ్లకు మోసగాడు. ఆరోజుల్లో ఈ సినిమా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఆరోజుల్లో రీరిలీజ్ అనేది సాధారణ విషయం. మళ్లీ మళ్ళీ హిట్ అయిన సినిమాలను రిలీజ్ చేస్తూ ఉండేవారు. అలా మోసగాళ్ళకు మోసగాడు చిత్రాన్ని ఎన్నిసార్లు రీరిలీజ్ చేసినా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అయ్యేది. ఫస్ట్ రిలీజ్‌లోనే కాదు, రీ రిలీజ్‌లో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ, కె.ఎస్.ఆర్.దాస్ కాంబినేషన్‌లో రూపొందిన మోసగాళ్ళకు మోసగాడు ఒక బెంచ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.