English | Telugu
మొదట అక్కినేని వద్దన్న పాటే సినిమాకు హైలైట్‌గా, ఆయన నటనకు గీటురాయిగా నిలిచింది!
Updated : Jun 12, 2021
శివాజీ గణేశన్ డ్యూయల్ రోల్ చేసిన తమిళ చిత్రం 'ఎంగవూర్ రాజా' బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్టయింది. దాని తెలుగు రీమేక్ 'ధర్మదాత' (1970)లో ఆ పాత్రల్ని నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. లెజెండరీ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ తమ్ముడు అక్కినేని సంజీవి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఎడిటర్ అయిన సంజీవి 'అక్కా చెల్లెలు' మూవీతో డైరెక్టర్‌గా మారారు. ఆయన రూపొందించిన రెండో సినిమా 'ధర్మదాత'. మొదట హీరోయిన్ రోల్‌కు వాణిశ్రీని తీసుకుందామని అనుకున్నారు. కానీ స్విమ్మింగ్ పూల్‌లో ఓ పాట ఉండటంతో, దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంచనను ఎంపిక చేశారు. తండ్రి పాత్రకు జోడీగా షావుకారు జానకి నటించారు. డైలాగ్స్ పినిశెట్టి రాయగా, సి. నారాయణరెడ్డి పాటలు రాశారు. టి. చలపతిరావు సంగీతం సమకూర్చారు.
ఈ సినిమాలోని పాటలు మంచి హిట్టయ్యాయి. అన్నింటిలోకీ హైలైట్‌గా నిలిచిన సాంగ్, అక్కినేని అభినయానికి ప్రేక్షకులు "ఓహో" అన్న సాంగ్ "ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి..". నిజానికి ఈ పాట పెట్టడానికి మొదట అక్కినేని ఒప్పుకోకపోవడం గమనార్హం. తమిళ ఒరిజినల్‌లోనూ ఆ తరహా పాట ఉంది. ఆ పాటలో శివాజీ గణేశన్ ఓవరాక్షన్ చేశారనీ, అలాంటిది మనకు నప్పదనీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తితో వాదించారు ఏఎన్నార్. కృష్ణమూర్తి, డైరెక్టర్ సంజీవి కలిసి ఆయనను ఎలాగో కన్విన్స్ చేశారు. చివరకు ఆ పాటను కొసరాజు చేత రాయించమని సూచించారు అక్కినేని. అంచనాలకు తగ్గట్లే ఆ పాటను సూపర్బ్‌గా రాశారు కొసరాజు.
ఆ పాటకు ప్రాణం పోయడానికీ, సహజత్వం తీసుకు రావడానికీ ఏఎన్నార్ రెండు రోజులు భోజనం మానేశారు. ముఖంలో డల్‌నెస్ వచ్చేలా చూసుకున్నారు. తెరపై ఆ పాటకు ఆయన అభినయిస్తుంటే ప్రేక్షకుల్లో కలిగిన ఇంపాక్ట్ అమోఘం. అందరూ ఆ పాట గురించీ, ఆ పాటలో అక్కినేని అద్భుతాభినయం గురించి మాట్లాడుకున్నవాళ్లే. ఒరిజినల్ తరహాలోనే 'ధర్మదాత' కూడా సూపర్ హిట్టయి, 15 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది.