English | Telugu
ఫొటోల్లో ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ జీవితం!
Updated : Jul 7, 2021
లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ 'దేవదాస్', 'ముఘల్-ఎ-ఆజమ్', 'అందాజ్', 'క్రాంతి', 'కర్మ' లాంటి సినిమాల్లో అద్భుతమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మృతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను విషాద సాగరంలో ముంచేసింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపాలు తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన జీవితాన్ని ఓసారి స్ఫురణకు తెచ్చుకుందాం.
పష్తూన్ కుటుంబంలో 12 మంది సంతానంలో ఒకరిగా పుట్టారు దిలీప్ కుమార్. ఆయన అసలు పేరు ముహమ్మద్ యూసఫ్ ఖాన్. ఇప్పటి పాకిస్తాన్‌లోని పెషావర్, డియోలాలి ప్రాంతాల్లో దిలీప్ తండ్రికి తోటలు ఉండేవి.
1930 ప్రాంతాల్లో దిలీప్ కుమార్ ఫ్యామిలీ ముంబైకి తరలివచ్చింది. సినిమాల్లోకి రాకముందు ఆయన పూణేలో ఒక క్యాంటీన్ నడిపారు. అలాగే ఫ్రూట్ సప్లయర్‌గా వ్యవహరించారు. 1944లో 'జ్వర్ భాత' సినిమాతో నటునిగా పరిచయం అయ్యారు.
యూసఫ్ ఖాన్‌కు దిలీప్ కుమార్ అనే తెర పేరును ఇచ్చింది హిందీ రచయిత భగవతి చరణ్ వర్మ. ఆ తర్వాత కాలంలో ఆయన అనేక సూపర్‌హిట్ ఫిలిమ్స్‌ను అందించారు. మధుబాలతో ప్రేమాయణం నడిపారు. తొమ్మిదేళ్ల పాటు వాళ్ల మధ్య అనుబంధం కొనసాగిందంటారు. అయితే వారి పెళ్లికి మధుబాల తండ్రి అంగీకరించకపోవడంతో, ఇద్దరూ విడిపోయారు.
తనకంటే వయసులో 20 సంవత్సరాలు చిన్నదైన నటి సైరా బానును 1966లో దిలీప్ కుమార్ పెళ్లాడారు. తర్వాత ఆయన ఆస్మా రెహమాన్ అనే ఆమెను 1981లో రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం కేవలం రెండేళ్లకే ముగిసింది.
వెండితెరపై అనేక మరపురాని పాత్రలకు ప్రాణం పోసిన దిలీప్ కుమార్.. జోగన్, దీదర్, దాగ్, దేవదాస్, మధుమతి, యాహుడి తదితర చిత్రాల్లో చేసిన పాత్రలతో 'ట్రాజెడీ కింగ్ ఆఫ్ బాలీవుడ్' అనే పేరు పొందారు.
బిగ్ స్క్రీన్‌పై ఎన్నో పాత్రలకు జీవం పోసిన దిలీప్‌కు చారిత్రక చిత్రం 'ముఘల్-ఎ-ఆజమ్' (1960) మూవీలో చేసిన సలీమ్ పాత్ర ఆయనకు అత్యంత పాపులారిటీ తెచ్చింది. ఇప్పటికీ అభిమానులు ఆ పాత్రను మరవలేదు. 2008 వరకూ కూడా హిందీ చలనచిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా అది నిలిచింది.
బ్రిటీష్ డైరెక్టర్ డేవిడ్ లీన్ రూపొందించిన 'లారెన్స్ ఆఫ్ అరేబియా'లో నటించే అవకాశం వచ్చినా దాన్ని తిరస్కరించిన దిలీప్, హిందీ సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేశారు.
వరుస ఫ్లాపులు ఎదురవడంతో 1976 నుంచి నాలుగేళ్లకు పైగా ఆయన సినిమాలకు విరామం ఇచ్చారు. తిరిగి 1981లో మల్టీస్టారర్ 'క్రాంతి'లో నటించి, ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఆ సినిమాలో హేమమాలిని, మనోజ్ కుమార్, శశికపూర్, శత్రుఘ్న సిన్హా లాంటి ఉద్ధండులు నటించారు.
చివరగా ఆయన నటించిన చిత్రం 'ఖిలా' (1998). ఇందులో ఆయన జగన్నాథ్ సింగ్, జడ్జి అమరనాథ్ సింగ్ అనే ద్విపాత్రలు పోషించారు. 2001లో అజయ్ దేవ్‌గణ్‌తో కలిసి 'అసర్-ది ఇంపాక్ట్' అనే సినిమాలో ఆయన నటించాల్సింది. కానీ ఆ సినిమా ఆగిపోవడంతో ఆయన మళ్లీ నటించలేదు.
అత్యధిక అవార్డులు పొందిన భారతీయ నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో దిలీప్ కుమార్ చోటు సంపాదించారు.