English | Telugu
శృంగార గీతాల స్పెషలిస్ట్.. సింగర్ ఎల్ఆర్ ఈశ్వరి గురించి మీకు తెలీని నిజాలు!
Updated : Jul 6, 2021
అల్లరి పాటలతో, కైపు పాటలతో శ్రోతల గుండె గదుల్లో అలజడి రేపిన గాయనిగా ఎల్.ఆర్. ఈశ్వరి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆమె పేరులోని 'ఎల్' అంటే 'లవ్' అనీ, 'ఆర్' అంటే 'రొమాన్స్' అనీ సి. నారాయణరెడ్డి చమత్కరించగా, ఆరుద్ర 'అల్లారు ముద్దుల గాయని'గా ఆమెను ప్రస్తుతించారు. డైరెక్టర్ కె.ఎస్. ప్రకాశరావు అయితే 'విజయలలిత కళ్లల్లో కైపుంటే.. ఎల్.ఆర్. ఈశ్వరి గొంతులో కైపుంటుంది.' అని కితాబిచ్చారు. నిజానికి క్లబ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్‌ను ఆమె ఎంత కైపుగా పాడతారో, భక్తి పాటలను అంత మధురంగానూ ఆమె పాడగలరు.
ఎల్.ఆర్. ఈశ్వరి అసలు పేరు లూర్ద్ మేరీ. ఆమె రోమన్ క్యాథలిక్ కుటుంబంలో మద్రాసులో జన్మించారు. అమ్మమ్మ ఇంట్లోని వారు 'మేరీ' అని పిలిస్తే, హిందూ దేవతల్ని కొలిచే నానమ్మ గారింట్లో ఆమెను 'రాజేశ్వరి' అని పిలిచేవారు. ఈ గొడవంతా ఎందుకని ఆమె తన పేరును 'లూర్ద్ రాజేశ్వరి'గా మార్చేసుకున్నారు. తమిళ చిత్రరంగంలో అప్పటికే రాజేశ్వరి పేరుతో ఒక గాయని ఉండటంతో డైరెక్టర్ ఎ.పి. నాగరాజన్ ఆమెను 'ఎల్.ఆర్. ఈశ్వరి'గా పరిచయం చేశారు. ఆ పేరే స్థిరపడింది.
ఈశ్వరి వాళ్లమ్మ నిర్మల సినిమా పాటలకు కోరస్ పాడేవారు. ఎస్.ఎస్.ఎల్.సి.తో చదువు ఆపేసిన ఈశ్వరి తల్లితో పాటు పాటల రికార్డింగ్‌కు వెళుతూ వచ్చారు. అలా మొదట్లో కొన్ని పాటలకు ఆమె కోరస్ సింగర్‌గా వ్యవహరించారు. స్వరబ్రహ్మ కె.వి. మహదేవన్ ఆమెను 'నల్ల ఇడత్తు సంబంధం' అనే తమిళ చిత్రంతో ఈశ్వరిని గాయనిగా పరిచయం చేశారు.
తెలుగులో ఆమె పాడిన తొలి చిత్రం 'అనుబంధాలు' (1963). అందులో ఆమె పాడిన పాట.. "నా పేరు సెలయేరు.. నన్నెవ్వరాపలేరు". ఆమెకు పాపులారిటీ తెచ్చింది మాత్రం టి.వి. రాజు స్వరకల్పనలో 'శ్రీ సింహాచల క్షేత్ర మహిమ'లో పాడిన పాటలు.
ఆమె తమిళియన్ అయినప్పటికీ తెలుగు, కన్నడ, మలయాళం, తుళు భాషల్లో ఏమాత్రం ఇబ్బంది పడకుండా చాలా స్పష్టంగా పాటలు పాడటం ఆమె ప్రతిభకు నిదర్శనం. 'నన్నగండ ఎల్లి' అనే కన్నడ చిత్రంలో 14 భాషల చరణాలు ఉన్న ఓ క్లిష్టమైన పాటను కూడా సునాయాసంగా ఆమె పాడేశారు. 'కథానాయిక మొల్ల' (1970)లోనూ ఐదు భాషల్లో ఉండే పాటను ఆమె మృదుమధురంగా పాడటం మనకు తెలుసు.
"పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ" (అమాయకుడు), "లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా" (ప్రేమనగర్), "ఏస్కో కోకోకోలా" (రౌడీరాణి), "ఆకులు పోకలు ఇవ్వద్దూ నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ" (భార్యాబిడ్డలు), "నందామయా గరుడ నందామయా" (జీవన తరంగాలు), "మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో" (దేవుడు చేసిన మనుషులు), "అరే ఏమిటి ఈ లోకం... పలుగాకుల లోకం" (అంతులేని కథ), "భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్" (మరో చరిత్ర), "సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్" (సింహబలుడు) లాంటి పాటలను ఆమెలాగా అంత మత్తు, అంత కైపు ధ్వనించే గొంతుతో పాడటం ఎవరికి సాధ్యం!
14 భాషలలో వేలాది పాటలు పాడిన ఎల్.ఆర్. ఈశ్వరి వ్యక్తిగత జీవితం త్యాగమయం. సోదరి, సోదరుడి భవిష్యత్తు కోసం ఆమె అవివాహితగా ఉండిపోయారు. తను వయసులో ఉండగా ఎవరైనా పెళ్లి గురించి ప్రస్తావిస్తే, తాను సంగీతాన్నే పెళ్లి చేసుకున్నానని చెప్పేవారు. ప్రస్తుతం చెన్నైలో ఆమె నివాసం ఉంటున్నారు.