English | Telugu
'వయ్యారి భామలు వగలమారి భర్తలు' షూటింగ్ లాంచ్.. ఎన్టీఆర్-కృష్ణ ఫ్యాన్స్ హల్చల్!
Updated : Jul 7, 2021
మద్రాస్‌లోని ఏవీయం స్టూడియో మెయిన్ గేట్ నుంచి ఫస్ట్ ప్లోర్ దాకా ఉన్న రోడ్డు అంతా కార్లతో నిండిపోయి ఉంది. వాటిని దాటితే ఆ ప్రదేశం అంతా జనవాహినితో కిటకిటలాడుతూ ఉంది. ఫ్లోర్ బయట డి. రామానాయుడు, టి. త్రివిక్రమరావు, కె. రాఘవేంద్రరావు, ఎం. బాలయ్య లాంటి దిగ్గజాలు కనిపిస్తున్నారు. ఫ్లోర్‌లోకి వెళ్తే మళ్లీ బయటకు వస్తామన్న నమ్మకం లేనందువల్లే వారలా నిల్చుండిపోయారు.
ఇక ఫ్లోర్ లోపల.. గాలికూడా ప్రవేశించలేనంతగా జనసందోహం.. "కొండవీటి సింహం ఎన్టీఆర్ జిందాబాద్", "పగబట్టిన సింహం కృష్ణ జిందాబాద్" అనే కేకలతో ఆ ఫ్లోర్ దద్దరిల్లిపోతోంది. తెలుగునాట విపరీమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇద్దరు సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటిస్తున్న 'వయ్యారి భామలు - వగలమారి భర్తలు' చిత్రం ప్రారంభోత్సవం అది...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచీ వచ్చిన ఇద్దరు హీరోల అభిమానులు చేస్తున్న హల్‌చల్, హంగామా చూస్తుంటే మిగతావారికి ఆనందంతో పాటు ఆశ్చర్యమూ కలుగుతోంది. అక్కడున్న ప్రతి అభిమాని చేతిలోనూ పూలదండలున్నాయి. కొన్ని భారీ పూలహారాలను ఆరుగురు కలిసి జాగ్రత్తగా పట్టుకొని మోస్తున్నప్పటికీ అవి ఓ పక్కకు ఒరిగిపోతున్నాయి. ఎవరి అభిమానం వారిది. ఎవరి ఉత్సాహం వారిది. ఎవరి ఆత్రుత వారిది. ఎవర్ని ఎవరూ కంట్రోల్ చేయలేని పరిస్థితి...
అంతలో సెట్లో గులాబీపూల వర్షం కురిసింది. అవి నేలమీద పడడానికి అవకాశం లేనంత మంది జనం ఉండటంతో వారి తలలు ఆ పూలతో నిండిపోయాయి.
అప్పుడే.. "మీరంతా నిశ్శబ్దంగా ఉంటే ఈ షాట్ పూర్తయిన వెంటనే నేనూ, బ్రదర్ కృష్ణ బయటకు వస్తాం.. మీకోసం కొంత టైమ్ స్పెంట్ చేస్తాం. మీరేమీ నిరుత్సాహపడవద్దు." అనే మాటలు గంభీరంగా వినిపించాయి. ఆ గొంతు విన్నవారికెవరైనా అది ఎన్టీఆర్ గొంతు అని అర్థమైపోతుంది. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. అభిమానులు గప్‌చుప్ అయిపోయారు. అంతదాకా అరుపులు, కేకలతో నానా భీభత్సంగా కనిపించిన అక్కడి వాతావరణం ఊహించనంత ప్రశాంతంగా మారిపోయింది.
"యస్ సుబ్బారావు గారూ.. నేనూ, బ్రదరూ రెడీ" అన్నారు ఎన్టీఆర్. "యస్ సార్.. టేక్ చేద్దాం సార్" అన్నారు డైరెక్టర్ కట్టా సుబ్బారావు. కెమెరా రన్ అవుతోంది. షాట్ మొదలైంది.
"ఏం తమ్ముడూ.. బాగున్నావా?" అని కృష్ణను విష్‌చేసి, ఆనందంగా ఆయనను ముద్దుపెట్టుకున్నారు ఎన్టీఆర్. కృష్ణ కూడా అంతే ఆనందంతో, "నేను బాగానే ఉన్నానన్నయ్యా. నీ ప్రయాణం ఎలా జరిగింది?" అని ఎన్టీఆర్‌ను అడిగారు. "ఓ వెరీ నైస్" అన్నారు ఎన్టీఆర్. "కట్" చెప్పారు కట్టా సుబ్బారావు.
అంతే! కొద్ది నిమిషాల దాకా ఆ ప్రదేశం అంతా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. మళ్లీ అభిమానుల నినాదాలు మొదలయ్యాయి. తమ ఆరాధ్య కథానాయకులను వారు చుట్టుముట్టేశారు. మెడలో పూలదండలు వేసి, అంతటితో ఆగకుండా పాదాభివందనాలు మొదలుపెట్టారు. ఇద్దరు స్టార్లూ ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. పది నిమిషాలు అలాగే గడిచిపోయాయి. అక్కడి వాతావారణంలో మార్పులేదు.
"పరిస్థితి ఇలాగే ఉంటే ఈ రోజంతా షూటింగ్ జరగదు. ఈ సెట్ సాయంత్రానికి కనిపించదు." అని ఎవరో గట్టిగా అరిచారు. నిర్మాత గురుపాదం తన పరిస్థితి ఏమిటన్నట్లు హీరో కృష్ణ వంక చూశారు. కృష్ణకు అర్థమైంది. ఎన్టీఆర్ కూడా ఫ్లోర్ బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఫ్యాన్స్ ఆయనను కదలనివ్వట్లేదు. అంతలో కృష్ణ "దయచేసి అభిమానులందరూ బయటకు నడవండి. నేనూ బయటకు వస్తాను" అన్నారు.
"కన్వర్‌లాల్ జిందాబాద్.. విప్లవజ్యోతి సీతారామరాజు జిందాబాద్.. పగబట్టిన సింహం జిందాబాద్.. అందరికీ మొనగాడు జిందాబాద్" అని నినాదాలు చేసుకుంటూ హీరో కృష్ణను ఆయన అభిమానులు బయటకు తీసుకుపోయారు. కృష్ణ బయటకు రాగానే, ఫ్లోర్ బయటవుండి లోపలికి రాలేకపోయిన కొంతమంది అభిమానులు ఆయనకు పాదాభివందనాలు చేశారు. మళ్లీ పూలదండల కార్యక్రమం, ఆటోగ్రాఫ్‌ల పర్వంతో పాటు స్టిల్స్ దిగే కార్యక్రమం నడిచింది. కొంతసేపు అభిమానుల కోరికను తీర్చిన కృష్ణ, "ఇక నన్ను వదిలెయ్యండి. సాయంత్రం కలుస్తాను" అంటూ అభిమానులను నెట్టుకుంటూ కారెక్కారు.
"అన్నా.. నిన్ను మర్చిపోలేనన్నా" అంటూ ఓ అభిమాని కృష్ణ చేతిని అందుకొని ముద్దుపెట్టుకున్నాడు. అతనితో "అలాగే అలాగే" అని, డ్రైవర్‌ను కారు స్టార్ట్ చెయ్యమని చేయి ఊపారు కృష్ణ. అప్పటికీ అభిమానులు వదలలేదు. కారు దగ్గరకు వచ్చి, "అసాధ్యుడు కృష్ణ.. అఖండుడు కృష్ణ.. జేమ్స్‌బాండ్ కృష్ణ" అని అరవడం ప్రారంభించారు. "నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని చేయివూపారు కృష్ణ. కారు బయలుదేరింది.
ఇక సెట్‌లో.. హోరాహోరీగా ఎన్టీఆర్ మీద దండలు దాడిచేస్తున్నాయి. కట్టా సుబ్బారావు వచ్చి, సార్ సెట్ అంతా పూలతో నిండిపోయింది. సెట్ క్లీన్ చేయించాలి అన్నారు. అభిమానులనందర్నీ ఫ్లోర్ బయటకు నడవాల్సిందిగా కోరి, తను కూడా బయలుదేరారు. "కొండవీటి సింహం జిందాబాద్.. సర్దార్ పాపారాయుడు జిందాబాద్.. బొబ్బిలి పులి జిందాబాద్." అంటూ నినాదాలు చేసుకుంటూ, కేరంతలు కొడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సెట్ బయటకు నడిచారు.
తనకు పాదాభివందనాలు చేస్తున్నవారిని ఎన్టీఆర్ లేవనెత్తబోతుంటే, "మామీద నడిచివెళ్లండి సార్" అన్నాడొక వీరాభిమాని. అతనిని లేవనెత్తి ఆప్యాయంగా భుజం తట్టారు ఎన్టీఆర్. అభిమానుల కోలాహలంతో, జయజయ నినానాదాలతో ఏవీయం స్టూడియో దద్దరిల్లిపోయింది.
"మీరందరూ నన్ను చూడ్డానికి వచ్చారు. సంతోషం. ఇంతమంది అభిమానులు నాకోసం వచ్చి నా విజయాన్ని కోరుకుంటున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది." అని అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు ఎన్టీఆర్. అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు ఓర్పుగా జవాబులు చెప్పారు. అలా అరగంటసేపు సెట్ బయట కూర్చొని అభిమానులతో గడిపి వారికి ఆనందాన్ని చేకూర్చారు ఎన్టీఆర్.
వయ్యారి భామలుగా శ్రీదేవి, రాధిక, వగలమారి భర్తలుగా ఎన్టీఆర్, కృష్ణ నటించిన ఈ చిత్రంలో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, పండరీబాయి, ఎస్. వరలక్ష్మి, రమాప్రభ కీలక పాత్రలు చేశారు. డి.వి. నరసరాజు సంభాషణలు రాయగా, రాజన్-నాగేంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పి.ఎస్. ప్రకాశ్ ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. 1982 సెప్టెంబర్ 20న విడుదలైన 'వయ్యారి భామలు వగలమారి భర్తలు' చిత్రం ఇద్దరు హీరోల అభిమానులను అలరించింది.