Read more!

English | Telugu

ఫస్ట్‌ హాఫ్‌ వరకు డైలాగులు లేకుండా నటించిన ముగ్గురు టాలీవుడ్‌ టాప్‌ హీరోలు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముగ్గురు టాప్‌ హీరోలకు మూడు అరుదైన సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఆ ముగ్గురు హీరోలు నటరత్న ఎన్‌.టి.రామరావు, సూపర్‌స్టార్‌ కృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి. ఈ ముగ్గురు హీరోలు వారి వారి జనరేషన్లలో టాప్‌ హీరోలుగా వెలుగొందారు. తెలుగు హీరోలలో ఈ ముగ్గురు మాత్రమే చేసిన ఆ క్యారెక్టర్‌ పేరు టార్జాన్‌. ఎన్‌.టి.రామారావు తన కెరీర్‌లో 300కి పైగా సినిమాల్లో నటించగా, కృష్ణ 350కి పైగా సినిమాల్లో నటించారు. ఇక చిరంజీవి 150కి పైగా సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. 

ఈ హీరోల్లో మొదట టార్జాన్‌గా నటించే అవకాశం కృష్ణకు దక్కింది. 1967 మార్చి 3న విడుదలైన ‘ఇద్దరు మొనగాళ్ళు’ చిత్రంలో కృష్ణ టార్జాన్‌ పాత్రను పోషించారు. బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాంతారావు, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. కాంతారావు సరసన కృష్ణకుమారి, కృష్ణ సరసన సంధ్యారాణి హీరోయిన్లుగా కనిపిస్తారు. కృష్ణ నటించిన మొట్ట మొదటి జానపద చిత్రం ఇది. అలాగే బి.విఠలాచార్య దర్శకత్వంలో కృష్ణ చేసిన ఒకే ఒక్క సినిమా కూడా ఇదే. కృష్ణ హీరోగా పరిచయమైన తర్వాత చేసిన నాలుగో సినిమా ఇది. కృష్ణకు హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన ‘గూఢచారి 116’ తర్వాత ఈ సినిమా చేశారు. ఈ సినిమాలో ఫస్ట్‌హాఫ్‌ మొత్తం కృష్ణకు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. అయినా ‘ఇద్దరు మొనగాళ్ళు’ బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది.

1978 జూలై 28న విడుదలైన సినిమా ‘రాజపుత్ర రహస్యం’. ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్‌.టి.రామారావు టార్జాన్‌గా నటించారు. ఆయన సరసన జయప్రద హీరోయిన్‌గా నటించింది. ఇది కూడా జానపద చిత్రంగానే రూపొందింది. ఈ సినిమాలో మొదటి 30 నిమిషాలు హీరో కనిపించడు. ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఫస్ట్‌హాఫ్‌ అంతా ఆయనకు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు. అయినప్పటికీ  ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. 

మెగాస్టార్‌ చిరంజీవి, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన ‘అడవిదొంగ’ 1985 సెప్టెంబర్‌ 19న విడుదలైంది. చిరంజీవి హీరో అయిన తర్వాత కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన మొదటి సినిమా ఇదే. ఇందులో రాధ హీరోయిన్‌గా నటించింది. చిరంజీవి టార్జాన్‌గా నటించిన ఒకే ఒక్క సినిమా ఇది. పై రెండు సినిమాలు జానపద సినిమాలుగా రూపొందితే.. ‘అడవిదొంగ’ మాత్రం సాంఘిక చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాలో ఇంటర్వెల్‌ ముందు మాత్రమే చిరంజీవికి డైలాగులు మొదలవుతాయి. ‘అడవిదొంగ’ చిరంజీవి కెరీర్‌లో పెద్ద హిట్‌ అయిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 

తెలుగు చలనచిత్ర చరిత్రలో టార్జాన్‌ పాత్రను పోషించే అవకాశం ఎన్టీఆర్‌, కృష్ణ, చిరంజీవిలకు మాత్రమే దక్కింది. కృష్ణ సినిమా ‘ఇద్దరు మొనగాళ్ళు’ బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రూపొందగా, ఎన్టీఆర్‌ సినిమా ‘రాజపుత్ర రహస్యం’ ఈస్ట్‌మన్‌కలర్‌లో చేశారు. చిరంజీవి సినిమా ‘అడవిదొంగ’ను కలర్‌లో తెరకెక్కించారు. ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించడం విశేషం.