Read more!

English | Telugu

అనుకోకుండా వచ్చిన అవకాశంతో.. మూడు భాషల్లో బ్లాక్‌బస్టర్స్‌ తీసిన రామానాయుడు!

అన్నీ కలిసొచ్చాయి.. అదృష్టం.. రాసిపెట్టి ఉంటే అదే మన దగ్గరకు వస్తుంది.. ఇలాంటి మాటలు సర్వసాధారణంగా వింటూ వుంటాం. ఈ సెంటిమెంట్‌ సినిమా రంగంలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి నమ్మకాల వల్ల విజయాలు అందుకున్నవారు కూడా ఉన్నారు. వారిలో మూవీ మొఘల్‌ డి.రామానాయుడు ఒకరు. 1964లో ఎన్టీఆర్‌ హీరోగా నిర్మించిన ‘రాముడు భీముడు’ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన రామానాయుడు మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించారు. అయితే ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఆయన్ని నష్టాల్లోకి నెట్టేశాయి. అంతకుముందు రకరకాల వ్యాపారాలు చేసి సినిమా రంగానికి వచ్చిన రామానాయుడు తనకు ఇక్కడ కూడా కలిసి రాదనే అభిప్రాయానికి వచ్చాడు. ఆ సమయంలోనే ‘ప్రేమనగర్‌’ సినిమా చేసే అవకాశం వచ్చింది. 

వాస్తవానికి ప్రేమనగర్‌ నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి నిర్మించాల్సిన సినిమా. పాత రోజుల్లో నవలలకు విపరీతమైన క్రేజ్‌ ఉండేది. ఆ టైమ్‌లో కోడూరి కౌసల్యాదేవి రచించిన ప్రేమనగర్‌ నవలను విపరీతంగా చదివారు పాఠకులు. దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని భావించిన శ్రీధర్‌రెడ్డి ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావుకు చెప్పారు. దానికి ఆయన కూడా ఓకే చెప్పడంతో ఆ నవల రైట్స్‌ తీసుకున్నారు శ్రీధర్‌రెడ్డి. సినిమా నిర్మాణానికి కావాల్సిన డబ్బు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కినేని హీరో, హీరోయిన్‌ కె.ఆర్‌.విజయ. ఈ సినిమాకి అవసరమైన కాస్ట్యూమ్స్‌ కొనేందుకు కారులో బయల్దేరారు శ్రీధర్‌రెడ్డి, అతని భార్య. ఆ కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. దాన్ని అపశకునంగా భావించిన శ్రీధర్‌రెడ్డి భార్య మనకు ఈ సినిమా వద్దని చెప్పింది. దాంతో ఆ సినిమాను నిర్మించే ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ కథ మీద ఎంతో నమ్మకం ఉన్న అక్కినేని... రామానాయుడికి విషయం చెప్పారు. హీరోయే అంత నమ్మకంగా చెప్పడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే రూ.60 వేలకు ప్రేమనగర్‌ రైట్స్‌ కొనేశారు. 

అక్కినేని నాగేశ్వరరావుహీరో, వాణిశ్రీ హీరోయిన్‌, కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకుడు. అలాగే మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ కూడా ఫిక్స్‌ అయిపోయారు. సినిమా బడ్జెట్‌ రూ.15 లక్షలు. అప్పటికే నష్టాల్లో ఉన్న రామానాయుడు ప్రేమనగర్‌ కోసం అనుకున్న బడ్జెట్‌లో రూ.10 లక్షలు నవయుగ ఫిలింస్‌ వారిని పెట్టవలసిందిగా అడిగారు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో సినిమా ప్రారంభమైంది. సినిమా కోసం ప్యాలెస్‌ లాంటి సెట్‌ను వేశారు. అప్పట్లోనే దానికి రూ.5 లక్షలు ఖర్చయింది. దానికి మిగతా నిర్మాతలు ఆశ్చర్యపోయి ‘ఎందుకింత ఖర్చు పెడుతున్నారు?’ అని అడిగారు. దానికి రామానాయుడు ‘ఈసారి తాడో పేడో తేల్చుకుందామని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా అటో ఇటో అయితే.. మా ఇద్దరు పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించి, నాకున్న 90 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటాను’ అన్నారు. 1970లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించి 1971లో విడుదల చేశారు. 34 ప్రింట్లతో సినిమాను విడుదల చేస్తే మొదటి షోకే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. భారీ వర్షాలను కూడా లెక్కచేయకుండా తండోపతండాలుగా ఈ సినిమాను చూశారు ప్రేక్షకులు. రోజురోజుకీ సినిమాకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. టోటల్‌గా రూ.50 లక్షలు వసూలు చేసింది ‘ప్రేమనగర్‌’.  

ఇదే సినిమాను 1972లో శివాజీ గణేశన్‌, వాణిశ్రీలతో తమిళ్‌లో ‘వసంతమాళిగ’ పేరుతో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని రూ.70 లక్షలు కలెక్ట్‌ చేసింది. అప్పటివరకు తమిళ్‌ హిట్‌ సినిమాలకు వచ్చిన కలెక్షన్‌ కంటే అది చాలా ఎక్కువ. ఆ తర్వాత 1974లో రాజేష్‌ ఖన్నా, హేమమాలిని జంటగా ‘ప్రేమ్‌నగర్‌’ పేరుతో హిందీలో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. అలా ఒక్కసారిగా రామానాయుడు టాప్‌ ప్రొడ్యూసర్‌ అయిపోయారు. తమిళ్‌, హిందీ వెర్షన్లకు కూడా కె.ఎస్‌.ప్రకాశరావే దర్శకత్వం వహించారు. రామానాయుడు స్టార్‌ ప్రొడ్యూసర్‌గా ఎదిగేందుకు, ఆ తర్వాతికాలంలో మరెన్నో మరపురాని సినిమాలను రూపొందించేందుకు ‘ప్రేమనగర్‌’ చిత్రం ఎంతగానో దోహదపడింది.