Read more!

English | Telugu

భారతదేశం గర్వించదగ్గ నటి, డాన్సర్‌ శోభన.. ఆ హీరోల వల్లే సినిమాలకు గుడ్‌బై చెప్పింది!

శోభన చంద్రకుమార్‌ పిళ్ళై.. మనందరం శోభన అని పిలుచుకునే అందాల నటి. 1970 మార్చి 21న కేరళలో జన్మించింది. ఆమెకు నాట్యం అంటే ప్రాణం. అయినా నటన మీద మక్కువతో 1984లో మలయాళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించింది. తెలుగులో మంచి స్వింగ్‌లో ఉన్న టైమ్‌లోనే తాను ఇక తెలుగు సినిమాల్లో నటించను అని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఎనౌన్స్‌ చేసింది. అప్పటికే సంవత్సరానికి అరడజనుకు తక్కువ కాకుండా సినిమాలు చేస్తోంది. అంత బిజీ హీరోయిన్‌గా ఉన్న శోభన హఠాత్తుగా తెలుగు సినిమాలకు మాత్రమే గుడ్‌బై ఎందుకు చెబుతోంది అనే విషయం సామాన్య ప్రేక్షకులకు అర్థం కాలేదు. అయితే ఇండస్ట్రీలోని కొందరు సినీ ప్రముఖులకు మాత్రం ఆమె ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందీ అనే విషయం తెలుసు. తెలుగులో ఆమె నటించిన చివరి సినిమా ‘గేమ్‌’. ఈ సినిమా 2006లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ టాలీవుడ్‌కి రాలేదు శోభన. అయితే తమిళ్‌, మలయాళ భాషల్లో మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేసింది. 2006 నుంచి 2020 వరకు ఆమె సెలెక్టివ్‌గా చేసిన సినిమాలు 5 మాత్రమే. అంటే సినిమా రంగానికి పూర్తిగా దూరమైంది. తనకెంతో ఇష్టమైన భరతనాట్యానికి బాగా దగ్గరైంది. నృత్య ప్రదర్శనలు ఇవ్వడం ద్వారానే ఎంతో సంతృప్తి పొందుతున్నానని పలు సందర్భాల్లో ఆమె ప్రకటించింది. మార్చి 21 శోభన పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం. 

ఇకపై సినిమాల్లో నటించను అని శోభన తీసుకున్న నిర్ణయం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని సినిమా ఇండస్ట్రీలోని కొందరు అభిప్రాయపడతారు. వాటిలో ఒకటి మలయాళ సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఒక టాప్‌ హీరోతో ఆమె ప్రేమాయణం నడిపిందని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత శోభనను కాదని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు ఆ హీరో. దీంతో మనస్తాపం చెందిన శోభన సినిమాలు తనకు సరిపడవని, తనకెంతో ఇష్టమైన నాట్యంలోనే తనకు సంతృప్తి ఉంటుందని భావించి సినిమాలకు గుడ్‌బై చెప్పిందనేది ఒక వాదన. 

మరో వాదన ఏమిటంటే.. తెలుగులో బిజీ హీరోయిన్‌గా ఉంటూ ఎంతో మంది హీరోల సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించిన శోభనకు ఒక హీరో ప్రవర్తన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, అందుకే తెలుగు సినిమాల్లో నటించనని ప్రకటించిందని అంటారు. ఆ హీరో వల్ల లైంగిక వేధింపులకు గురైన శోభన ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో చెప్పుకున్నారు. ఆ హీరో వల్ల గతంలో దివ్యవాణి, మాళవిక వంటి హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారనే విషయం ఇండస్ట్రీలో చాలాకాలం ప్రచారం జరిగింది. ఈ రెండు అనుభవాలతో సినిమాలంటే విరక్తి కలిగి భరత నాట్యాన్ని ఆశ్రయించిందని కొందరి అభిప్రాయం. అంతేకాదు, 54 ఏళ్ళ శోభన పెళ్లి చేసుకోకుండా ఇప్పటికీ అవివాహితగానే ఉండిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.  

కారణాలు ఏవైనా ఒక మంచి నటిని సినీ పరిశ్రమ దూరం చేసుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఐదు భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన శోభన.. తన నటనకు అత్యున్నత అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 2004లో కన్నడలో విడుదలైన ‘ఆప్తమిత్ర’ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో సౌందర్య ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాతి సంవత్సరమే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ‘చంద్రముఖి’ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలకు మూలం 1993లో విడుదలైన ‘మణిచిత్రతాళు’ అనే మలయాళ సినిమా. ఈ సినిమాలో శోభన ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని నటనకుగాను శోభన ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత నటి రేవతి దర్శకత్వంలో వచ్చిన ఇంగ్లీష్‌ చిత్రం ‘మిత్ర్‌.. మై ఫ్రెండ్‌’లో ఆమె నటనకు రెండోసారి ఉత్తమనటిగా జాతీయ అవార్డు లభించింది. ఇవి కాక ఆమె కెరీర్‌లో ఫిలింఫేర్‌, ఇతర అవార్డులు ఎన్నో ఉన్నాయి. పద్మశ్రీ, కలైమామణి అవార్డులు, గౌరవ డాక్టరేట్‌.. ఇలా ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. 

సినిమాలకు దూరమైన తర్వాత ఆమె తన దృష్టినంతా భరతనాట్యం మీదే పెట్టింది. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా కొన్ని వేల నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. 1994లో ‘కళార్పణ’ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఎంతోమందికి భరతనాట్యంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా నృత్య వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఎంతో మంది శోభన దగ్గర శిష్యరికం చేసి నాట్యంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు. నాట్యంలోనే కాదు, నటనలోనూ పలువురికి శిక్షణ ఇస్తోంది శోభన. సినిమాలకు దూరమైనప్పటికీ ప్రపంచ దేశాల్లో ఉన్న ఎంతో మంది కళాభిమానులను తన నాట్యం ద్వారా అలరిస్తున్న శోభన మరిన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని భారత దేశం గర్వించే స్థాయిలో ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.