Read more!

English | Telugu

బాలకృష్ణతో 7 సినిమాలు చేసిన టాప్‌ డైరెక్టర్‌.. ఒక్క సూపర్‌హిట్‌ కూడా ఇవ్వలేదు.. ఎవరో తెలుసా?

హీరోలను స్క్రీన్‌పై ఎలా ప్రజెంట్‌ చెయ్యాలి, వాళ్ల ఇంట్రడక్షన్‌ని ఎంత ఇంప్రెసివ్‌గా చూపించాలి, ఆడియన్స్‌తో ఎలా విజిల్స్‌ వేయించాలి అనే విషయం రాఘవేంద్రరావుకి తెలిసినంతగా అప్పటి తరం డైరెక్టర్లలో ఎవరికీ తెలీదు. అలాగే హీరోయిన్ల అందాలను ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ఎలా చూపించాలి అనేది కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే. అలాంటి టాప్‌ డైరెక్టర్‌ మొదటి తరం, రెండో తరం హీరోలకు బ్లాక్‌బస్టర్స్‌, సూపర్‌హిట్స్‌ ఇచ్చి వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డారు. కానీ, ఈ విషయంలో నందమూరి బాలకృష్ణకు మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఏవరేజ్‌, హిట్‌ రేంజ్‌ వరకు మాత్రమే వెళ్ళాయి తప్ప ఒక్క సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌ అవ్వలేదు, సూపర్‌హిట్‌ కూడా కాలేదు. 

మొదటి తరం హీరోలైన ఎన్‌.టి.ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి హీరోల కాంబినేషన్‌లో రాఘవేంద్రరావు చేసిన కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి, కొన్ని సూపర్‌హిట్‌ అయ్యాయి. అలాగే ఆ తర్వాతి తరం హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ వంటి హీరోలకు కూడా అదే పద్ధతిలో విజయాలు అందించారు. మొదటి తరం హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, రెండో తరం హీరోల్లో నందమూరి బాలకృష్ణలకు మాత్రం ఒక్క సూపర్‌హిట్‌ కూడా ఇవ్వలేదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. బాలకృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఏయే సినిమాలు వచ్చాయి, అవి ఏ రేంజ్‌ హిట్‌ అయ్యాయో తెలుసుకుందాం.

వీరిద్దరి కాంబినేషన్‌లో 1980లో వచ్చిన మొదటి సినిమా ‘రౌడీ రాముడు కొంటెకృష్ణుడు’. రౌడీరాముడుగా ఎన్‌.టి.ఆర్‌., కొంటెకృష్ణుడుగా బాలకృష్ణ నటించారు. ఎన్‌.టి.ఆర్‌.కి జోడీగా శ్రీదేవి, బాలకృష్ణకు జంటగా రాజ్యలక్ష్మీ నటించారు. ఈ చిత్రాన్ని రామకృష్ణా సినీ స్టూడియోస్‌ పతాకంపై ఎన్‌.టి.ఆర్‌. స్వయంగా నిర్మించారు. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌తో స్టార్ట్‌ అయినప్పటికీ లాంగ్‌ రన్‌ లేకపోవడం వల్ల ఏవరేజ్‌ మూవీ అనిపించుకుంది. 

రెండో సినిమా 1985లో విడుదలైన ‘పట్టాభిషేకం’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలకృష్ణ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా ఇదే. ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. రామకృష్ణా సినీ స్టూడియోస్‌ పతాకంపై నందమూరి హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి వారం రికార్డు స్థాయిలో రూ.96 లక్షలకు పైగా కలెక్ట్‌ చేసిన ఈ సినిమా ఆ తర్వాత రన్‌లో ఆ స్థాయిలో కలెక్షన్స్‌ సాధించలేక జస్ట్‌ హిట్‌ అనిపించుకుంది. 

1986లో వీరి కాంబినేషన్‌లో విడుదలైన మూడో సినిమా ‘అపూర్వ సహోదరులు’. బాలకృష్ణ తన కెరీర్‌లో మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇదే. ఇందులో విజయశాంతి, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. ఆర్‌.కె.అసోసియేట్స్‌ బేనర్‌లో కె.రాఘవేంద్రరావు సోదరుడు. కె.కృష్ణమోహనరావు ఈ సినిమాను నిర్మించారు. మొదటివారం ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.80 లక్షలకు పైగా కలెక్ట్‌ చేసింది. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో రన్‌ కొనసాగించలేక ఇది కూడా జస్ట్‌ హిట్‌ సినిమాగా నిలిచింది.

నాలుగో సినిమా ‘సాహస సామ్రాట్‌’. దేవీకమల్‌ మూవీస్‌ బేనర్‌పై కె.సి.శేఖర్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1987లో విడుదలైన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్‌గా నటించింది. ఇదే సంవత్సరం సూపర్‌స్టార్‌ కృష్ణ కుమారుడు రమేష్‌బాబు హీరోగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన సినిమాకు ‘సామ్రాట్‌’ అనే పేరు పెట్టారు. బాలకృష్ణ సినిమాకి కూడా మొదట ‘సామ్రాట్‌’ అనే టైటిల్‌నే నిర్ణయించారు. తప్పని పరిస్థితుల్లో బాలకృష్ణ సినిమాకి ‘సాహస సామ్రాట్‌’ అనే పేరు మార్చుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. 

ఐదో సినిమాగా గోపీ ఆర్ట్‌ పిక్చర్స్‌ బేనర్‌పై చలసాని గోపి నిర్మించిన సినిమా ‘దొంగరాముడు’. ఈ సినిమాలో రాధ హీరోయిన్‌గా నటించింది. 1988లో విడుదలైన ఈ సినిమా మొదటివారం కోటి రూపాయలకుపైగా కలెక్ట్‌ చేసింది. రెండో వారం నుంచి కలెక్షన్లు పూర్తిగా పడిపోవడంతో ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. 

ఆరో సినిమా 1992లో వైజయంతి మూవీస్‌ బేనర్‌పై సి.అశ్వినీదత్‌ నిర్మించిన ‘అశ్వమేధం’. ఈ సినిమాలో శోభన్‌బాబు ఓ కీలక పాత్రలో నటించారు. బాలకృష్ణకు జోడీగా నగ్మా, మీనా నటించారు. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ అనిపించుకుంది.

నందమూరి బాలకృష్ణ, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన ఏడో సినిమా ‘పాండురంగడు’. 2008లో విడుదలైన ఈ సినిమాను ఆర్‌.కె.అసోసియేట్స్‌ బేనర్‌పై కె.కృష్ణమోహనరావు నిర్మించారు. 1986లో చేసిన ‘పట్టాభిషేకం’ తర్వాత బాలకృష్ణతో కృష్ణమోహనరావు నిర్మించిన రెండో సినిమా ఇది. ‘పాండురంగడు’ చిత్రంలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలు పోషించారు. బాలకృష్ణకు జంటగా స్నేహ, టబు నటించారు. ఎన్‌.టి.రామారావు నటించిన భక్తిరసాత్మక చిత్రం ‘పాండురంగ మహత్మ్యం’ చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపొందినప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని చవిచూసింది. 

1992లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అశ్వమేధం’ భారీ పరాజయం అందుకోవడంతో ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేసే ధైర్యం చేయలేదు. ఆ తర్వాత రాఘవేంద్రరావు అన్నమయ్య, శ్రీమంజునాథ, శ్రీరామదాసు వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తిన రాఘవేంద్రరావుతో ఆ తరహా సినిమా చేసేందుకు దాదాపు 16 సంవత్సరాల తర్వాత సిద్ధమయ్యారు బాలకృష్ణ. కానీ, ఫలితం లేకుండా పోయింది. బాలకృష్ణ కెరీర్‌లో రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో చేసిన సినిమాలు ఏడు. వీటిలో మూడు మాత్రమే బాక్సాఫీస్‌ వద్ద సేఫ్‌ ప్రాజెక్ట్స్‌ అనిపించుకున్నాయి. మిగతా నాలుగు సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్‌గా ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చి కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్‌ చేసిన రాఘవేంద్రరావు.. బాలకృష్ణకు మాత్రం ఒక్క సూపర్‌హిట్‌ కూడా ఇవ్వలేకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు.