Read more!

English | Telugu

సిల్క్‌ స్మిత జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడానికి అసలు కారణం ఇదే!

సినిమా అనేది సామాన్య ప్రేక్షకులకు ఓ వినోద సాధనం.. వారికి సినిమారంగం ఓ అద్దాలమేడలా, రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. అక్కడ ఉండేవారు సుఖసంతోషాలతో ఉంటారని అనుకుంటారు. సినిమా అనేది ఒక మాయ. బయటి నుంచి చూసేవారికి అలాగే కనిపిస్తుంది. కానీ, అందులోనే ఉన్నవారికి మాత్రమే అక్కడ ఉండే కష్టనష్టాల గురించి తెలుస్తుంది. తెరపై నవ్వులు చిందిస్తూ, కవ్విస్తూ ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే కొందరు హీరోయిన్ల జీవితంలోని విషాదాల గురించి బయటి ప్రపంచానికి తెలీదు. ఒకప్పుడు మీడియా అనేది విస్తరించి లేకపోవడం వల్ల సినిమా రంగంలో ఏం జరిగినా అంత త్వరగా బయటికి తెలిసేది కాదు. అలా ఎంతో మంది తారల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. అలాంటి వారిలో సిల్క్‌ స్మిత ఒకరు. ఆమె కొన్ని వందల సినిమాల్లో నటించిందని, కొన్ని కోట్ల ఆస్తులు సంపాదించిందని చివరి రోజుల్లో ఆస్తులు పోగొట్టుకొని అష్టకష్టాలు పడిరదని, ఆ బాధతోనే తన జీవితాన్ని అంతం చేసుకుందని అందరికీ తెలుసు. అయితే ఆమె జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించింది, ఆమె ఆత్మహత్య చేసుకునేంతగా ఆమెను ఎవరు ప్రభావితం చేశారు, నిజ జీవితంలో ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది వంటి కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దగ్గరలోని కొవ్వలి అనే గ్రామం. రెక్కాడితేనేగానీ డొక్కాడని కుటుంబం. ఆ కుటుంబంలో జన్మించింది విజయలక్ష్మీ. ఆర్థిక స్తోమత లేని కారణంగా 4వ తరగతి వరకు మాత్రమే చదివించగలిగారు తల్లిదండ్రులు. ఆ సమయంలో పిల్లలు లేని విజయలక్ష్మీ పెద్దమ్మ అన్నపూర్ణ ఆమెను తనతోపాటు ఏలూరుకి తీసుకెళ్ళి తన దగ్గరే ఉంచుకుంది. విజయలక్ష్మీకి చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాల్లో తను చూసిన డాన్సులను ఇంట్లో చేస్తుండేది. నటనపై ఆసక్తిని గమనించిన అన్నపూర్ణ... గుంటూరులో ఒక సినిమా షూటింగ్‌ జరుగుతోందని తెలుసుకొని అక్కడికి విజయలక్ష్మీని తీసుకెళ్లింది. సుగంబాబు దర్శకత్వంలో ‘భూదేవి’ అనే సినిమా షూటింగ్‌ జరుగుతోంది. డైరెక్టర్‌ని కలిసి విజయలక్ష్మీని విజయమాలగా పరిచయం చేసింది. విజయను చూసిన డైరెక్టర్‌ ‘నల్లగా ఉంది, బొద్దుగా ఉంది. పైగా నటనలో అనుభవం లేదు. అవకాశం ఇవ్వలేను’ అని చెప్పేసాడు. అయినా ఆ ఊరు వదిలి వెళ్ళకుండా మూడు రోజులు అక్కడే ఉండి రోజూ షూటింగ్‌కి విజయను తీసుకెళ్లేది. వాళ్ళు రోజూ రావడాన్ని గమనించిన సుగంబాబు ఒకసారి విజయను పరిశీలనగా చూశాడు, ఆమెతో మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది విజయలో ఏదో ప్రత్యేకత ఉందని. మత్తెక్కించే కళ్ళు, మొహంలో ఆకర్షణ ఆయనకి అప్పుడు కనిపించాయి. అప్పటికప్పుడు ఒక వ్యాంప్‌ క్యారెక్టర్‌ను క్రియేట్‌ చేసి విజయతో చేయించాడు.

ఆ తర్వాత విజయను తీసుకొని మద్రాస్‌ వచ్చేసింది అన్నపూర్ణ. ఆ సమయంలో ఆడదంటే అలుసా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత ‘వండిచక్కరం’ అనే సినిమాలో సిల్క్‌ అనే పాత్రను ఇచ్చాడు దర్శకుడు వినుచక్రవర్తి. ఆ సినిమాలో విజయ చేసిన సిల్క్‌ పాత్రకు విపరీతమైన పేరు వచ్చింది. అప్పటికే స్మితగా పేరు మార్చుకున్న విజయ.. స్మితకు ముందు సిల్క్‌ని చేర్చి సిల్క్‌ స్మిత అయిపోయింది. వండిచక్కరంలో చేసిన సిల్క్‌ క్యారెక్టర్‌ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారిగా బిజీ ఆర్టిస్టుని చేసేసింది. కొన్ని వందల సినిమాల్లో వ్యాంప్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, గ్లామర్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది. కోట్లు విలువైన ఆస్తులు కూడబెట్టింది. ఆరోజుల్లో సిల్క్‌ స్మిత లేని సినిమా ఉండేది కాదు. రిలీజ్‌ కాకుండా ఆగిపోయిన సినిమాల్లో స్మిత పాటని జోడిస్తే ఆ సినిమాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న స్మిత కొరికిన ఒక యాపిల్‌ను వేలం వేస్తే ఆరోజుల్లో పాతికవేలకు అమ్ముడుపోయింది. దీన్నిబట్టి స్మితకు ఉన్న క్రేజ్‌ ఏమిటో అర్థమవుతుంది. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా స్మిత పాట ఉండాలని, అలా అయితేనే సినిమాను తీసుకుంటామని చెప్పి సందర్భాలు కూడా ఉన్నాయి. 

అప్పటివరకు ఒక వెలుగు వెలిగిన సిల్మ్‌స్మిత జీవితంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతను వైజాగ్‌కి చెందిన రాధాకృష్ణ అనే డాక్టర్‌. ఎప్పుడూ సినిమాలు, షూటింగులతో అలిసిపోయే స్మితకు అతని పరిచయంతో కొంత మానసిక ప్రశాంతత ఏర్పడిరదని భావించింది. అతనితో సన్నిహితంగా మెలిగేది. అతన్ని పూర్తిగా నమ్మింది. తన ఆస్తి వ్యవహారాలు, సినిమా కాల్షీట్లు.. అన్నీ అతని చేతిలో పెట్టింది. అతనితో సహజీవనం చేస్తున్నప్పుడు తెలిసింది అతనికి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారని. అయినా సర్దుకుంది. తన భార్య, పిల్లలను తీసుకొచ్చి స్మిత ఇంట్లోనే ఉంచాడు రాధాకృష్ణ. అది కూడా సహించింది. ఆ తర్వాత నుంచి స్మితపై ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టాడు రాధాకృష్ణ. స్మిత ఏమీ చేయలేని స్థితిలోకి నెట్టబడిరది. అన్ని వ్యవహారాలు అతని చేతిలో ఉన్నాయి. డబ్బు ఎంత వస్తుందో తెలీదు, వచ్చిన డబ్బు ఏమైపోతోందో తెలియని పరిస్థితి ఏర్పడిరది. ఎదురు తిరిగితే తనకు ఏమీ దక్కదని గ్రహించింది స్మిత. ఎంతో కష్టపడి అంతటి ఉన్నత స్థానానికి చేరుకున్న స్మిత అలాంటి దయనీయ స్థితికి చేరుకోవడం అనేది స్వయంకృతాపరాధమనే చెప్పాలి. క్రమంగా ఆమెను మద్యానికి బానిస చేశాడు రాధాకృష్ణ. తన వికృత చేష్టలతో ఆమెను మానసికంగానే కాదు, శారీరకంగా కూడా హింసించేవాడు. అలాంటి పరిస్థితుల్లో మానసికంగా కుంగిపోయిన స్మిత తనకు ఆత్మహత్యే శరణ్యమని భావించి ఉరి వేసుకొని తనువు చాలించింది. 

కటిక పేదరికం నుంచి వచ్చిన స్మిత ఎదుటివారి కష్టాలను తన కష్టాలు భావించేది. అవకాశాలు లేక ఆర్థికంగా చితికిపోయిన కళాకారులకు తనవంతు సాయం చేసేది. తనకు తొలిరోజుల్లో అవకాశాలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు అండగా నిలబడేది. ఆమె ఆస్తులు కరిగిపోవడానికి నిర్మాతగా ఆమె చేసిన సినిమాలు కూడా కారణమయ్యాయి. కొన్ని సినిమాలకు ఫైనాన్స్‌ చేయడం, అవి వెనక్కి రాకపోవడం ఆమెను కోలుకోలేని దెబ్బతీశాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఒక కాగితంపై రాసి మరీ చనిపోయింది. అయినా ఆమె ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు నిర్ధారించేలా రాధాకృష్ణ తన ప్రయత్నాలు చేశాడని చెప్పుకున్నారు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన స్మిత జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది.