Read more!

English | Telugu

15 సంవత్సరాల్లో కృష్ణ, బాలకృష్ణ 21 సార్లు పోటీ పడ్డారు.. ఎవరు నెగ్గారు, ఎవరు తగ్గారు? 

సినిమా రంగంలో హిట్లు, ఫాపులు అనేది సహజం. ఒకసారి ఒక హీరో నటించిన సినిమా హిట్‌ అయితే, మరో హీరో సినిమా ఫ్లాప్‌ అవుతుంది. ఆయా హీరోల అభిమానులు మాత్రం సినిమా ఫలితాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అందుకే తమ హీరోకి ప్రధాన ప్రత్యర్థి అయిన హీరోతో ఎన్నిసార్లు పోటీపడ్డాడు, ఎన్నిసార్లు విజయం సాధించాడు అనే లెక్కలు వేసి మరీ చెబుతారు. అలా ఇద్దరు హీరోలు 21 సార్లు పోటీ పడ్డారు. అయితే ఆ ఇద్దరూ ఒకేతరం హీరోలు కాకపోయినా ఒక వారంలోనే వారిద్దరి సినిమాలు రిలీజ్‌ అవ్వడంతో దానికి ఓ ప్రత్యేకత ఏర్పడిరది. వారే సూపర్‌స్టార్‌ కృష్ణ, నటసింహ నందమూరి బాలకృష్ణ. పాతతరం హీరో కృష్ణ, అప్పటికి కొత్తతరంగా చెప్పుకునే బాలకృష్ణతో పోటీ పడడం అనేది చెప్పుకోదగ్గది కాకపోయినా దాదాపు 15 సంవత్సరాల వ్యవధిలో కొన్ని సినిమాలు ఒక వారం గ్యాప్‌లో, మరికొన్ని ఒకేరోజు, రెండు మూడు రోజుల గ్యాప్‌లో రిలీజ్‌ అయ్యాయి. అలా 21 సార్లు పోటీ పడ్డారు ఈ ఇద్దరు హీరోలు. మరి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో చూద్దాం. 

1984లో కృష్ణ, బాలకృష్ణ మొదటిగా పోటీ పడ్డారు. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన నాయకులకు సవాల్‌, తాతినేని ప్రసాద్‌ డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా రూపొందిన డిస్కోకింగ్‌ ఒకేవారంలో రిలీజ్‌ అయ్యాయి. ఇందులో నాయకులకు సవాల్‌ సూపర్‌హిట్‌ అవ్వగా డిస్కోకింగ్‌ ఫ్లాప్‌ అయింది. 

పి.సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమా ఉద్దండుడు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన మంగమ్మగారి మనవడు పోటీ పడగా ఉద్దండుడు సూపర్‌హిట్‌ అయ్యింది. మంగమ్మగారి మనవడు సెన్సేషనల్‌ హిట్‌ అయి బాలకృష్ణ కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. 

కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన దొంగలు బాబోయ్‌ దొంగలు, కె.మురళీమోహన్‌రావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన కథానాయకుడు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ ఘనవిజయాల్ని అందుకున్నాయి. 

కృష్ణ, టి.కృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన అందరికంటే మొనగాడు, బాలకృష్ణ, పరుచూరి బ్రదర్స్‌ కాంబినేషన్‌లో రూపొందిన భలే తమ్ముడు ఒకేవారం విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. 

బాలకృష్ణ హీరోగా ఎన్‌.బి.చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన కత్తుల కొండయ్య, విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ నటించిన సూర్యచంద్ర ఒకేసారి రిలీజ్‌ అయ్యాయి. ఇందులో కత్తుల కొండయ్య ఫ్లాప్‌ అవ్వగా, సూర్యచంద్ర చిత్రం సూపర్‌హిట్‌ సాధించింది. 

ఎన్‌.బి.చక్రవర్తి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నిప్పులాంటి మనిషి, జి.రామ్మోహన్‌రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన బ్రహ్మాస్త్రం కొంత గ్యాప్‌తో రిలీజ్‌ అయ్యాయి. ఇందులో బ్రహ్మాస్త్రం సూపర్‌హిట్‌ అవ్వగా, నిప్పులాంటి మనిషి ఎబౌ ఏవర్‌గా నిలిచింది. 

కృష్ణ, కె.బాపయ్య కాంబినేషన్‌లో వచ్చిన జయం మనదే, బాలకృష్ణ, జంధ్యాల కాంబినేషన్‌లో వచ్చిన సీతారామకళ్యాణం ఒకేవారం రిలీజ్‌ అయ్యాయి. జయం మనదే హిట్‌ అవ్వగా, సీతారామకళ్యాణం సూపర్‌హిట్‌ అయింది. 

ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భార్గవరాముడు, ఎం.మల్లిఖార్జునరావు తండ్రీ కొడుకుల ఛాలెంజ్‌ చిత్రాలు ఒకే సీజన్‌లో రిలీజ్‌ అవ్వగా ఈ రెండు సినిమాలూ పెద్ద హిట్‌ అయ్యాయి.  

కృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన దొంగోడొచ్చాడు, బాలకృష్ణ, నందమూరి రమేష్‌ కాంబినేషన్‌లో రూపొందిన అల్లరి కృష్ణయ్య ఒకేవారం విడుదలయ్యాయి. ఇందులో దొంగోడొచ్చాడు సూపర్‌హిట్‌ అవ్వగా, అల్లరి కృష్ణయ్య ఫ్లాప్‌ అయింది. 

కృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి డైరెక్ట్‌ చేసిన సర్దార్‌ కృష్ణమనాయుడు భారీ ఫ్లాప్‌, బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ చేసిన మువ్వగోపాలుడు ఒకేవారం రిలీజ్‌ అయ్యాయి. ఇందులో సర్దార్‌ కృష్ణమనాయుడు భారీ ఫ్లాప్‌ అవ్వగా, మువ్వగోపాలుడు సెన్సేషనల్‌ హిట్‌ అయింది. 

కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన కలియుగ కర్ణు, బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్‌ చేసిన ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌ ఒకేరోజు రిలీజ్‌ అయ్యాయి. ఈ రెండు సినిమాలూ ఏవరేజ్‌గా నిలిచాయి. 

బాలకృష్ణ, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన దొంగరాముడు, కృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషనల్‌లో వచ్చిన చుట్టాలబ్బాయి ఒకే వారం విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ ఫ్లాప్‌ అయ్యాయి. 

ఎస్‌.ఎస్‌.రవిచంద్ర దర్శకత్వంలో కృష్ణ నటించిన రౌడీ నెంబర్‌ 1, కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన భారతంలో బాలచంద్రుడు చిత్రాలు ఒకే సీజన్‌లో రిలీజ్‌ అయ్యాయి. ఇందులో కృష్ణ సినిమా హిట్‌ అయింది. బాలకృష్ణ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. 

బాలకృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన రక్తాభిషేకం, కృష్ణ హీరోగా దాసరి నారాయణరావు చేసిన ప్రజా ప్రతినిది ఒకేరోజు విడుదలయ్యాయి. ఇందులో రక్తాభిషేకం హిట్‌ సాధించగా, ప్రజాప్రతినిధి ఫ్లాప్‌ అయ్యింది. 

జి.రామ్మోహన్‌రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన మంచి కుటుంబం, బాలకృష్ణ హీరోగా ఎ.కోదండరామిరెడ్డి రూపొందించిన భలేదొంగ ఒకేవారం విడుదలయ్యాయి. ఇందులో రెండు సినిమాలూ హిట్‌ అయినప్పటికీ కలెక్షన్లపరంగా భలేదొంగ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. 
కె.ఎస్‌.ఆర్‌. దాస్‌, కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన పార్థుడు, కోడి రామకృష్ణ దర్శకత్వంలో  వచ్చిన ముద్దుల మావయ్య. ఈ రెండు సినిమాలు ఒకే సీజన్‌లో రిలీజ్‌ అయ్యాయి. ఇందులో పార్థుడు ఫ్లాప్‌ అవ్వగా, ముద్దుల మావయ్య సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. 

తాతినేని రామారావుతో బాలకృష్ణ చేసిన ప్రాణానికి ప్రాణం, కె.ఎస్‌.ఆర్‌.దాస్‌తో కృష్ణ చేసిన ఇన్‌స్పెక్టర్‌ రుద్ర.. ఈ రెండూ ఒకేరోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ ఫ్లాప్‌ అయ్యాయి. 
ముప్పల నేని శివ, కృష్ణ కాంబినేషన్‌లో రూపొందిన ఘరానా అల్లుడు,  బాలకృష్ణ కాంబినేషన్‌లో సింగీతం శ్రీనివాసరావు భైరవద్వీపం చిత్రాన్ని రూపొందించారు. ఇందులో కృష్ణ హిట్‌ని అందుకోగా, బాలకృష్ణ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించింది. 

ఎం.రాధాకృష్ణన్‌ దర్శత్వంలో కృష్ణ నటించిన రియల్‌ హీరో, ఎ.కోదండరామిరెడి దర్శకత్వంలో రూపొందిన మాతో పెట్టుకోకు.. ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదలై సూపర్‌ ఫ్లాప్‌గా పేరు తెచ్చుకున్నాయి.

బాలకృష్ణ హీరోగా శరత్‌ దర్శకత్వంలో వచ్చిన వంశానికొక్కడు, కృష్ణ హీరోగా ఎస్‌.వి.కృష్ణారెడ్డి తర్శకత్వంలో రూపొందిన సంప్రదాయం చితాల్రు ఒకేరోజు విడుదలయ్యాయి. అందులో వంశానికొక్కడు పెద్ద హిట్‌ అయ్యింది. సంప్రదాయం మాత్రం సూపర్‌ ఫ్లాప్‌ అయింది. 

చివరిగా బాలకృష్ణ, బి.గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి బాలకృష్ణ కెరీర్‌లోనే సెన్సేషనల్‌ హిట్‌ కాగా, తెలుగు సినిమా ట్రెండ్‌ని మార్చిన సినిమా ఇది. ఇదే రోజు కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మానవుడు దానవుడు సూపర్‌ ఫ్లాప్‌ అయ్యింది.