Read more!

English | Telugu

ట్రిపుల్‌ రోల్స్‌లో నటించిన తెలుగు హీరోలు.. ఎక్కువ సినిమాలు చేసింది ఎవరో తెలుసా?

ఒక సినిమాలో ఒకటికి మించి పాత్రలు చేసే హీరోలను మనం ఇండియాలోనే చూస్తాం. అలాంటి అసాధారణమైన సినిమాలను భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తారు కూడా. డూయల్‌ రోల్స్‌ చేయడం అంటే హీరోలకు కొంచెం కష్టంతో కూడుకున్న విషయమే. అయినా మన హీరోలు అలాంటి సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. 1966లో వచ్చిన ‘నవరాత్రి’ చిత్రంలో ఏకంగా 9 క్యారెక్టర్లలో నటించి ఆరోజుల్లో రికార్డు సృష్టించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆ తొమ్మిది క్యారెక్టర్లను ఎంతో అద్భుతంగా పోషించారని అప్పట్లో అక్కినేనిని అందరూ ప్రశంసించారు. ఈ సినిమా తమిళ్‌ రీమేక్‌గా వచ్చింది. తమిళ్‌లో ఆ 9 క్యారెక్టర్లను శివాజీ గణేశన్‌ పోషించారు. దాదాపు 42 సంవత్సరాల తర్వాత కమల్‌హాసన్‌ ‘దశావతారం’ చిత్రంలో ఏకంగా 10 క్యారెక్టర్లు చేసి శివాజీగణేశన్‌ పేరిట ఉన్న రికార్డును క్రాస్‌ చేశారు. అయితే తెలుగులో మాత్రం ఇప్పటికీ 9 క్యారెక్టర్లు చేసిన అక్కినేనిదే రికార్డు. ఆ తర్వాత ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్లు చేసిన హీరోల గురించి చెప్పుకోవాలంటే తెలుగు హీరోల్లో ఆ ఫీట్‌ సాధించినవారు ఆరుగురు ఉన్నారు. వారిలో మూడు క్యారెక్టర్లు పోషించిన మొదటి హీరోగా ఎన్‌.టి.రామారావు రికార్డు క్రియేట్‌ చేశారు. 1977లో విడుదలైన ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో కృష్ణుడుగా, దుర్యోధనుడుగా, కర్ణుడిగా మూడు విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించారు. ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తూ మూడు పాత్రలు చేయడం నిజంగా సాహసం అనే చెప్పాలి. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఎన్‌.టి.రామారావే. ఈ సినిమా ఘనవిజయం సాధించి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ‘దానవీరశూర కర్ణ’ ఎవర్‌గ్రీన్‌ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 1979లో మళ్ళీ స్వీయ దర్శకత్వంలోనే ‘శ్రీమద్‌ విరాటపర్వం’ చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఏకంగా ఐదు పాత్రలు పోషించారు. కృష్ణుడు, అర్జునుడు, దురోధ్యనుడు, బృహన్నల, కీచకుడు.. ఇలా ఐదు పాత్రలు పోషించి మెప్పించడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. 

‘దానవీరశూర కర్ణ’ చిత్రం విడుదలైన తర్వాతి సంవత్సరమే హీరో కృష్ణ మూడు పాత్రలు పోషించగా రూపొందిన సినిమా ‘కుమార రాజా’. ఈ చిత్రంలో తండ్రిగా, ఇద్దరు కుమారులుగా కృష్ణ నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో మూడు పాత్రలు పోషించిన హీరోగా కృష్ణ రికార్డు సృష్టించారు. ఆయన కెరీర్‌లో ఏడు సార్లు ఈ ఫీట్‌ను సాధించారు. 1982లో విడుదలైన ‘పగబట్టిన సింహం’, ‘డాక్టర్‌ సినీ యాక్టర్‌’ చిత్రాల్లో ట్రిపుల్‌ రోల్‌ చేశారు. వీటిలో ‘పగబట్టిన సింహం’ చిత్రం ఎబౌ ఏవరేజ్‌ అయింది. 1983లో ‘సిరిపురం మొనగాడు’ చిత్రంలో కృష్ణ మూడు పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏవరేజ్‌గా నిలిచింది. 1984లో వచ్చిన ‘రక్త సంబంధం’, ‘బంగారు కాపురం’ చిత్రాల్లో మూడేసి పాత్రలు పోషించారు కృష్ణ. ఇందులో ‘రక్తసంబంధం’ ఫ్లాప్‌ అవ్వగా, ‘బంగారు కాపురం’ జస్ట్‌ ఓకే అనిపించుకుంది. 1997లో చివరిసారి ‘బొబ్బిలిదొర’ చిత్రంలో కృష్ణ మూడు పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. ఇలా ఏడు సార్లు ట్రిపుల్‌ రోల్‌లో నటించి రికార్డు సృష్టించారు కృష్ణ. 

1983లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రంలో హీరో శోభన్‌బాబు ట్రిపుల్‌ రోల్‌లో నటించారు. కానీ, ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. 1994లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రంలో చిరంజీవి మూడు పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏవరేజ్‌ మూవీ అనిపించుకుంది. ఆ తర్వాత 2012లో నందమూరి బాలకృష్ణ ‘అధినాయకుడు’ చిత్రంలో మూడు క్యారెక్టర్స్‌లో నటించారు. ఇది ఫ్లాప్‌ సినిమాగా నిలిచింది. ఇక యంగ్‌ హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఆ ఫీట్‌ను సాధించారు. 2017లో విడుదలైన ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రలు పోషించి అందర్నీ మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు టాలీవుడ్‌ హీరోలు ట్రిపుల్‌ రోల్‌లో నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాప్‌ సినిమాలుగానే నిలిచాయి. ఈ కేటగిరిలో హిట్‌ అయిన సినిమాలుగా ‘దానవీరశూర కర్ణ’, ‘కుమారరాజా’, ‘జై లవకుశ’ చిత్రాలను చెప్పుకోవచ్చు.