English | Telugu

జమున-ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ల మధ్య కోల్డ్‌వార్‌.. ‘గుండమ్మ కథ’ పూర్తి కావడానికి ఏడాది పట్టింది!

ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు రూపొందుతుంటాయి. వాటిలో కొన్ని క్లాసిక్‌ చిత్రాలుగా నిలిచిపోతాయి. సినిమా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి ఎన్నో క్లాసిక్స్‌ వచ్చాయి. తరాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటాయి ఆ సినిమాలు. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఇచ్చారు ప్రేక్షకులు. 1962లో ఈ సినిమా విడుదలైంది. అప్పటికి ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అగ్ర హీరోలుగా ఛలామణి అవుతున్నారు. ఆ ఇద్దరిని హీరోలుగా పెట్టి ఓ మంచి సినిమా తియ్యాలంటే దానికి తగిన కథ ఉండాలి. అలాంటి కథ కోసం అన్వేషిస్తున్న తరుణంలో కన్నడలో బి.విఠలాచార్య దర్శకత్వంలో 1958లో రూపొంది ఘనవిజయం సాధించిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమా విజయా ప్రొడక్షన్స్‌ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి బాగా నచ్చింది. దాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది.

‘మనె తుంబిద హెణ్ణు’ నిర్మాణ సమయంలో విజయా సంస్థ ఆ సినిమా నిర్మాతకు ఎంతో సహకరించింది. ఆ కృతజ్ఞతతో తెలుగు రీమేక్‌ హక్కులను విజయా సంస్థకు ఇచ్చారు. సినిమాలకు సంబంధించిన నిర్ణయాలు నాగిరెడ్డి తీసుకునేవారు. కానీ, ఫైనల్‌గా చక్రపాణి ఆమోద ముద్ర వేసిన తర్వాతే సినిమా పట్టాలెక్కేది. అయితే కన్నడ చిత్రంలోని కొన్ని అంశాలు చక్రపాణికి నచ్చలేదు. దీంతో సినిమా చేయడం కుదరదని తేల్చి చెప్పారు. కానీ, నాగిరెడ్డికి మాత్రం ఆ సినిమా చెయ్యాలనే ఆసక్తి ఉంది. దాంతో కన్నడ చిత్రంలోని గుండమ్మ కుటుంబాన్ని మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను సిద్ధం చెయ్యాలని చెప్పారు చక్రపాణి. షేక్స్‌ పియర్‌ రచన ‘టేమింగ్‌ ఆఫ్‌ ది ష్రూ’ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కథ తయారు చేశారు. ఈ క్రమంలో గుండమ్మను ప్రధాన పాత్రగా చేసుకున్నారు. అయితే ఆ పాత్రకు ఏ పేరు పెట్టాలి అనే విషయంలో చర్చలు జరిగాయి. ఇంకా వేరే పేరెందుకు అదే పేరు పెట్టెయ్యమని చెప్పారు చక్రపాణి. వాస్తవానికి గుండమ్మ అనే పేరు కన్నడలోనే ఎక్కువ కనిపిస్తుంది. కానీ, ఈ సినిమా తర్వాత అది తెలుగు పేరులాగే అందరికీ అనిపించింది. సినిమాలో ఇద్దరు అగ్ర కథానాయకులు ఉన్నప్పటికీ క్యారెక్టర్‌ ఆర్టిస్టు పేరును సినిమా టైటిల్‌గా పెట్టడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను మొదట బి.ఎన్‌.రెడ్డికి అప్పగించాలనుకున్నారు. కానీ, ఒక రీమేక్‌ సినిమాను బి.ఎన్‌.రెడ్డి వంటి అగ్ర దర్శకుడితో చేస్తే బాగుండదని పుల్లయ్యను ఓకే చేశారు. డి.వి.నరసరాజుతో స్క్రిప్ట్‌ను రెడీ చేయించి ఆయనకు పంపారు. కానీ, తనకు స్క్రిప్ట్‌ నచ్చలేదని చెప్పారు పుల్లయ్య. అప్పుడు కమలాకర కామేశ్వరరావుకు ఆ బాధ్యతను అప్పగించారు. అప్పటివరకు అన్నీ పౌరాణిక చిత్రాలనే రూపొందించిన ఆయనకు అదే తొలి సాంఘిక చిత్రం.

ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌, సావిత్రి, జమున ప్రధాన పాత్రల కోసం అనుకున్నారు. కానీ, అప్పటికి మూడేళ్ళ ముందు జమునతో ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌లకు మనస్పర్థలు వచ్చాయి. దాంతో వారిద్దరూ ఆమెతో కలిసి నటించలేదు. నాగిరెడ్డి, చక్రపాణి, కె.వి.రెడ్డి కలిసి ఆ ముగ్గురి మధ్య రాజీ కుదిర్చారు. ఎన్టీఆర్‌కి ‘గుండమ్మకథ’ 100వ సినిమా కాగా, అక్కినేనికి 99వ సినిమా. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ కలిసి 15 సినిమాల్లో నటించారు. ‘గుండమ్మ కథ’ 10వ సినిమా. సినిమాకి సంబంధించి అంతా సిద్ధంగానే ఉన్నప్పటికీ షూటింగ్‌ మొదలు పెట్టలేదు. దానికి కారణం గుండమ్మ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంలో చాలా రోజులు చర్చలు జరిగాయి. చివరికి సూర్యకాంతంను ఎంపిక చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ అప్పటికి చాలా బిజీగా ఉన్నారు. కాల్షీట్లు ఎడ్జస్ట్‌ చేయడం యూనిట్‌కి ఎంతో కష్టమైపోయింది. అందుకే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కావడానికి సంవత్సరం పట్టింది. సినిమాలోని ‘కోలో కోలోయమ్మ కోలో నా సామి’ పాటను ఎన్టీఆర్‌, సావిత్రి, ఎఎన్నార్‌, జములపై చిత్రీకరించారు. హీరోలిద్దరూ ఒకే సమయంలో అందుబాటులో లేకపోవడంతో రామారావు, సావిత్రిలపై ఒకసారి, నాగేశ్వరరావు, జమునలపై మరోసారి చిత్రీకరించారు. సినిమాలో మాత్రం ఒకేసారి ఈ పాటను తీసినట్టుగా అనిపిస్తుంది.

ఈ సినిమాలోని అన్ని పాటలను పింగళి నాగేంద్రరావు రచించగా, ఘంటసాల ఆ పాటలను అద్భుతంగా స్వరపరిచారు. పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇందులోని ‘ప్రేమయాత్రలకు బృందావనము..’ అనే పాట వెనుక ఒక ఆసక్తిరమైన విషయం ఉంది. పాటల రచయిత పింగళి ‘తర్వాతి డ్యూయెట్‌ను ఎక్కడ తీస్తున్నారు’ అని అడిగారు. ‘ఎక్కడో తియ్యడం ఎందుకు.. పాటలో విషయం ఉంటే ఊటీ, కాశ్మీర్‌, కొడైకెనాల్‌ వరకు వెళ్ళక్కర్లేదు.. విజయా గార్డెన్స్‌లోనే తియ్యొచ్చు’ అన్నారట. ఆ మాటలు పింగళిని బాగా ఆకట్టుకున్నాయి. ఆ మాటలకు తగ్గట్టుగానే ‘ప్రేమయాత్రలకు బృందావనము.. నందన వనము ఏలనో’ అనే పల్లవితో రాశారు. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. 24 సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది. సెకండ్‌ రిలీజ్‌లో కూడా భారీగానే వసూళ్ళు సాధించింది. ఈ సినిమా సిల్వర్‌ జూబ్లీ వేడుకను జరపాలని మొదట అనుకున్నారు. కానీ, ఆ వేడుకకు అయ్యే ఖర్చును అప్పటి భారత్‌, చైనా వార్‌ ఫండ్‌కు అందించింది విజయా సంస్థ.