Read more!

English | Telugu

తెలుగు సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి 50 ఏళ్ళు!

భారత స్వాతంత్య్ర సమరంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తిగా ఎదిగి బిట్రీష్‌ వారిని గడగడలాడిరచారు. రవి అస్తమించని బిట్రీష్‌ సామ్రాజ్యానికి చుక్కలు చూపించిన మన్యం వీరుడిగా అల్లూరి సీతారామరాజు పేరును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖిస్తూ ఇప్పటికీ, ఎప్పటికీ కీర్తించుకుంటున్నాము అంటే ఆ మహావీరుడు దేశమాత స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం, త్యాగాలే కారణం. అంతటి మహనీయుని జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే ప్రయత్నం చాలా కాలం వరకు జరగలేదు. 1974లో సూపర్‌స్టార్‌ కృష్ణ ఆ బృహత్కార్యానికి పూనుకున్నారు. తెలుగు సినిమా పుట్టి దాదాపు 100 సంవత్సరాలు కావస్తున్నా ఆయన నటించి, నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’ తప్ప ఆ మన్యం వీరుడి కథతో మరో సినిమా తెలుగులో రూపొందలేదు. 1974 మే 1న విడుదలైన ఈ సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం రూపొందడం వెనుక ఉన్న ఆసక్తికర విశేషాల గురించి తెలుసుకుందాం. 

అల్లూరి సీతారామరాజు జీవితం తెరపై చూడాలన్న ఆసక్తి సూపర్‌స్టార్‌ కృష్ణకు చదువుకునే రోజుల్లోనే కలిగింది. 12 సంవత్సరాల వయసులోనే అల్లూరి సాతంత్య్ర పోరాటం గురించి చదువుకున్న కృష్ణ ఆయన పోరాట పటిమ చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ సమయంలోనే ‘అగ్గిరాముడు’ సినిమాలో 10 నిమిషాలపాటు నాజర్‌ ఆధ్వర్యంలో సీతారామరాజు చరిత్రను బుర్రకథ రూపంలో ప్రదర్శించారు. అది చూసిన తర్వాత ఆయన జీవిత చరిత్రపై మరింత ఆసక్తిని పెంచుకున్నారు కృష్ణ. అలాంటి వీరుడి కథను సినిమాగా ఎవరైనా తీస్తే చూడాలని అనుకునేవారు. ఒకరోజు ‘జయసింహ’ పాటల పుస్తకాన్ని కొనుక్కున్నారు కృష్ణ. ఆ పుస్తకం వెనుక మా రాబోవు సినిమా ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటన కనిపించింది. ఇక అప్పటి నుంచి ఎన్‌.టి.రామారావుగారు ఆ సినిమా ఎప్పుడు తీస్తారా.. ఎప్పుడు తెరపై చూసేద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు కృష్ణ. 

వాస్తవానికి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలన్న ఆలోచన మొదట చేసింది ఎన్‌.టి.రామారావు. దానికి సంబంధించిన కథను సిద్ధం చేసుకొని షూటింగ్‌కి వెళ్దామని అనుకుంటున్న సమయంలోనే ఆయన పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ ఆకస్మికంగా మరణించారు. దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఎన్టీఆర్‌. ఆ తర్వాత అక్కినేనితో ‘దేవదాసు’ చిత్రాన్ని నిర్మించిన డి.ఎల్‌.నారాయణ.. శోభన్‌బాబుతో సీతారామరాజు చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ, అదీ సాధ్యపడలేదు. చివరికి ఈ సినిమా పట్ల చిన్నతనం నుంచే ఆసక్తిని పెంచుకున్న సూపర్‌స్టార్‌ కృష్ణకే ఆ అవకాశం దక్కింది. నటుడిగా ఆయన్ని అందనంత ఎత్తులో నిలిపిన సినిమా ‘అల్లూరి సీతారామరాజు’. తన కెరీర్‌లో 360 సినిమాలు చేసినప్పటి తనకు ఎంతో నచ్చిన సినిమా ఇదేనని చెప్పేవారు కృష్ణ.  

1966లో హీరోగా తెరంగేట్రం చేసిన కృష్ణ హీరోగా బిజీ అయిపోయిన తర్వాత వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కృష్ణ 11వ సినిమా ‘అసాధ్యుడు’ చిత్రంలో నెల్లూరు కాంతారావు.. కృష్ణతో సీతారామరాజు గెటప్‌ వేయించి 10 నిమిషాల ‘బ్యాలే’ చేశారు. అది అందరికీ నచ్చింది. చాలా బాగుందని అందరూ ప్రశంసించారు. ఆ తర్వాత కృష్ణ చాలా సినిమాల్లో నటించారు. కానీ, అల్లూరి సీతారామరాజు జీవితాన్ని తెరకెక్కించడానికి ఎవరూ ముందుకు రాలేదు. 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ.  ఆ సినిమాలో ఎన్‌.టి.రామారావు, కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. దాని తర్వాత తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన అల్లూరి సీతారామరాజు సినిమాపై దృష్టి పెట్టారు కృష్ణ. తనే సొంతంగా ఆ సినిమాను నిర్మించాలనుకున్నారు. 

తన 100వ సినిమాగా సీతారామరాజు చరిత్రను సినిమాగా తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు కృష్ణ. అప్పట్లో ఈ వార్త ఎంతో సంచలనం సృష్టించింది. ఆ సినిమా స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే బాధ్యతను త్రిపురనేని మహారథికి అప్పగించారు కృష్ణ. ఆయన దాన్ని ఓ తపస్సులా భావించారు. ఈ సినిమా కోసం చాలా సినిమాలను వదులుకొని పక్కాగా స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో పడిపోయారు. ఈ సినిమాకి మాటలు కూడా ఆయనే రాశారు. ఆ స్క్రిప్టు చదివిన కృష్ణకు ఒక గొప్ప సినిమా తీస్తున్నామనే నమ్మకం కలిగింది. మద్రాసులోని వాహినీ స్టూడియోలో ఇండోర్‌ సీన్లు చిత్రీకరించి, చింతపల్లి అడవుల దగ్గర ఔట్‌డోర్‌ సీన్లు తీశారు. అప్పటిదాకా కృష్ణ చేసిన సినిమాలు ఒక ఎత్తయితే.. సీతారామరాజు పాత్ర మరొక ఎత్తు అనే రీతిలో ఆ పాత్రకు జీవం పోశారు. సూపర్‌స్టార్‌ కృష్ణ తప్ప అల్లూరి సీతారామరాజు పాత్రను మరొకరు చెయ్యలేరు అనేంతగా మెప్పించారు. 

‘అసాధ్యుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వి.రామచంద్రరావునే ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కొంత షూటింగ్‌ జరిగిన తర్వాత రామచంద్రరావు ఆరోగ్యం క్షీణించడం మిగిలిన భాగాన్ని కృష్ణ స్వయంగా డైరెక్ట్‌ చేశారు. యాక్షన్‌ పార్ట్‌ను చిత్రీకరించే బాధ్యతను కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ తీసుకున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కృష్ణ. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే దర్శకుడు వి.రామచంద్రరావు మృతి చెందారు. సినిమాలోని ఎక్కువ భాగాన్ని డైరెక్ట్‌ చేసింది కృష్ణే అయినా దర్శకుడు వి.రామచంద్రరావు చివరి కోరిక మేర దర్శకుడిగా ఆయనే పేరునే వేశారు కృష్ణ. 
1974 మే 1న ‘అల్లూరి సీతారామరాజు’ విడుదలైంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రిలీజ్‌ అయిన మొదటి షో నుంచే ఈ సినిమా సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆదినారాయణరావు బాణీలు సమకూర్చిన తెలుగువీర లేవరా, వస్తాడు నా రాజు, రగిలింది విప్లవాగ్ని ఈరోజు, వీరుడు మరణించడు పాటలు అజరామరంగా నేటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. మహారథి రాసిన డైలాగ్స్‌ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించాయి. క్లౖెెమాక్స్‌లో కృష్ణ ఆవేశ పూరితంగా చెప్పిన డైలాగ్స్‌, ఆయన నటన రోమాలు నిక్కబొడుచుకొనేలా చేశాయి. శ్రీశ్రీ రాసిన ‘తెలుగువీర లేవరా’ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. 19 కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ‘అల్లూరి సీతారామరాజు’ తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆణిముత్యంలా నిలిచింది. 

ఈ సినిమా రిలీజ్‌ అయిన పది సంవత్సరాల తర్వాత ఎన్‌.టి.రామారావు మళ్ళీ ఆ సినిమాను చెయ్యాలని ప్రయత్నించారు. ఆ సమయంలోనే ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని చూడాలని ఉందని కృష్ణకు చెప్పడం, ఎన్టీఆర్‌ కోసం కృష్ణ ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సినిమా చూసిన తర్వాత సీతారామరాజు పాత్రకు కృష్ణ పూర్తి న్యాయం చేశాడని ఎన్టీఆర్‌ ప్రశంసించారు. ఇక ఆ సినిమాను మళ్ళీ చెయ్యాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్‌ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారంటే కృష్ణ.. సీతారామరాజు పాత్రలో ఎంతగా జీవించారో అర్థం చేసుకోవచ్చు.