Read more!

English | Telugu

మెగాస్టార్‌ చిరంజీవి ఆదర్శం.. మొదట విలన్‌, ఆ తర్వాతే హీరో!

ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా కేవలం స్వయంకృషితో ఇండస్ట్రీలో హీరోగా ఎదిగినవారిలో శ్రీకాంత్‌ ఒకరు. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 150 సినిమాల్లో నటించాడు. చిరంజీవి, మోహన్‌బాబు వంటి హీరోల తరహాలోనే మొదట విలన్‌గా పరిచయమై ఆ తర్వాత హీరోగా మారి ఫ్యామిలీ హీరోగా, యాక్షన్‌ హీరోగా ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశాడు. మార్చి 23 శ్రీకాంత్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా సాగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. 

మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకున్న శ్రీకాంత్‌.. ఉషాకిరణ్‌ మూవీస్‌ బేనర్‌పై ఎ.మోహనగాంధీ దర్శకత్వంలో వచ్చిన ‘పీపుల్స్‌ ఎన్‌కౌంటర్‌’ చిత్రంలో నక్సలైట్‌గా తొలి అవకాశం వచ్చింది. ఆ సినిమాలో అతను చేసిన క్యారెక్టర్‌కి మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత ‘మధురానగరిలో’ చిత్రంలో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించాడు. ఆ తర్వాత విలన్‌, సపోర్టింగ్‌ క్యారెక్టర్లు చేస్తూ ఇండీస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ‘తాజ్‌మహల్‌’తో సోలో హీరోగా వెలుగులోకి వచ్చాడు. 

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘పెళ్లిసందడి’ చిత్రం శ్రీకాంత్‌ను టాప్‌ హీరోను చేసింది. ఆ సినిమా తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యారు. ఆ తరహా సినిమాలతోనే శ్రీకాంత్‌ ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. రొటీన్‌కి భిన్నంగా ఉండే ఖడ్గం, ఆపరేషన్‌ దుర్యోధన వంటి సినిమాలు నటుడిగా అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కంచడానికి తోడ్పడ్డాయి. హీరోగా మంచి పొజిషన్‌లో ఉన్న సమయంలో కూడా చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, నాగార్జున వంటి టాప్‌ హీరోల సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. 

టాలీవుడ్‌లో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌ ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా ఉంటూ ఎలాంటి కాంట్రవర్సీ తన దగ్గరికి రాకుండా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి కొత్త హీరోలు వస్తూనే ఉంటారు. అలా కొత్త టాలెంట్‌ వచ్చిన తర్వాత తెలుగు సినిమా తీరు తెన్నులు మారింది. ఫ్యామిలీ డ్రామాల స్థానంలో ఎక్కువగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్సే వస్తున్నాయి. దాంతో సహజంగానే శ్రీకాంత్‌ వంటి హీరోలకు అవకాశాలు తగ్గాయి. అయినా తనకు తగిన క్యారెక్టర్స్‌ వచ్చినపుడు అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు శ్రీకాంత్‌. ఇటీవల విడుదలై విజయం సాధించిన ‘కోటబొమ్మాళీ పిఎస్‌’లోని నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు అతని నట వారసుడుగా తనయుడు రోషన్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నాడు. సక్సెస్‌ఫుల్‌ హీరో అనిపించుకోవడమే కాకుండా, కొడుకుని కూడా సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్న శ్రీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.