Read more!

English | Telugu

టాలీవుడ్‌ టాప్‌ హీరోలు చేసిన కొన్ని సూపర్‌హిట్‌ సినిమాలకు మోహన్‌లాలే ఆధారం!

సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌లో మోహన్‌లాల్‌కు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. తను చేసిన సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 1978లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మోహన్‌లాల్‌ 45 ఏళ్ళ కెరీర్‌లో 400కి పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్‌ చేశాడు. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. టాలీవుడ్‌లోని టాప్‌ హీరోలు ఈ సినిమాల్లో హీరోలుగా నటించారు. ఆమధ్య వెంకటేష్‌ హీరోగా రూపొందిన దృశ్యం, దృశ్యం2 చిత్రాలకు మూలం మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా రూపొందిన సినిమాలనే విషయం తెలిసిందే. అలా మోహన్‌లాల్‌ కెరీర్‌లో చేసిన సినిమాలను తెలుగులో ఎవరెవరు రీమేక్‌ చేశారో చూద్దాం. 

1988లో విడుదలైన ‘ఆర్యన్‌’ చిత్రం మలయాళంలో చాలా పెద్ద హిట్‌ అయింది. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా రీమేక్‌ చేశారు. 1989లో విడుదలైన ఈ సినిమాకి ఎస్‌.ఎస్‌.రవిచంద్ర దర్శకత్వం వహించారు. మోహన్‌ బాబు కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం 1990లో వచ్చిన ‘అల్లుడుగారు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఆధారం మలయాళంలో మోహన్‌లాల్‌ హీరోగా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రమ్‌’. ఈ సినిమా 1988లో విడుదలైంది. 

మోహన్‌లాల్‌ నటించిన సినిమాలకు రీమేక్‌గా తెలుగులో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం నాగార్జునే హీరోగా నటించడం విశేషం. వాటిలో ప్రియదర్శన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘నిర్ణయం’ ఒకటి. మలయాళంలో ‘వందనం’ పేరుతో రూపొందిన సినిమా తెలుగు రీమేక్‌లో నాగార్జున హీరోగా నటించాడు. ఆ తర్వాత ‘స్పటికం’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘వజ్రం’ రూపొందింది. ఈ చిత్రానికి ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. ‘చంద్రలేఖ’ పేరుతో మలయాళంలో రూపొందిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. ఈ సినిమాని కృష్ణవంశీ డైరెక్ట్‌ చేశారు. అలాగే నాగార్జున, మోహన్‌బాబు కాంబినేషన్‌లో రూపొందిన ‘అధిపతి’ చిత్రానికి మోహన్‌లాల్‌ మలయాళంలో చేసిన ‘నరసింహం’ ఆధారం. ‘అధిపతి’ చిత్రానికి రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. చిరంజీవి, మోహన్‌రాజా కాంబినేషన్‌లో రూపొందిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రానికి ఆధారం మోహన్‌లాల్‌ నటించిన ‘లూసిఫర్‌’ అనే విషయం తెలిసిందే. 

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, మోహన్‌బాబే కాకుండా రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు వంటి హీరోలు కూడా మోహన్‌లాల్‌ సినిమాలను తెలుగులో రీమేక్‌ చేశారు. ఇక తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘ముత్తు’ చిత్రం కూడా మోహన్‌లాల్‌ చేసిన సినిమాకి రీమేక్‌ అనే విషయం చాలా మందికి తెలీదు. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘తెన్మవిన్‌ కొంబత్‌’ చిత్రాన్ని కె.ఎస్‌.రవికుమార్‌ తమిళ్‌లో ‘ముత్తు’గా రీమేక్‌ చేశారు.