Read more!

English | Telugu

అది నరేష్‌ చేసిన హిట్‌ సినిమా.. దానికి పనిచేసిన 17 మంది ఇప్పుడు మన మధ్య లేరు!

ఈమధ్యకాలంలో ఎంతో మంది సినీ ప్రముఖులు వివిధ కారణాల వల్ల చనిపోయారు. పాతతరం నటీనటులు వయోభారం వల్ల చనిపోయిన వారు కూడా చాలా మందే ఉంటారు. తెలుగు సినిమా పుట్టిన తొలిరోజుల్లో వచ్చిన కొన్ని సినిమాల్లో నటించిన వారెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ఇది మనిషి జీవితంలో సహజంగా జరిగే పరిణామమే. ‘పుట్టక తప్పదు.. గిట్టకా తప్పదు అన్నట్టు.. అందరూ ఏదో ఒకరోజు వెళ్లిపోవాల్సినవారే. కాకపోతే వెనకా ముందు..’ అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేదిగానే ఉంటుంది. అదే అల్లరి నరేష్‌ హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘కితకితలు’. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులు కావచ్చు, టెక్నీషియన్స్‌ కావచ్చు దాదాపు 17 మంది ఇప్పుడు జీవించి లేరు అంటే నమ్మగలమా.. కానీ, ఇది నిజం. 

2006లో అల్లరి నరేష్‌ హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కితకితలు’ చిత్రంలో లెక్కకు మించిన హాస్యనటులు తమ పెర్‌ఫార్మెన్స్‌తో అందర్నీ నవ్వించారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ సినిమా విడుదలై 18 సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ, అందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు దాదాపు 17 మంది చనిపోయారు. ఒక సెలబ్రిటీ చనిపోయారంటే వారు అంతకుముందు ఏదో ఒక సినిమాకి పనిచేసి ఉంటారు. కానీ, ‘కితకితలు’ సినిమా రిలీజ్‌ అయి 20 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే అంతమంది చనిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరెవరు చనిపోయారో తెలుసుకుందాం.  

ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్‌, జయప్రకాశ్‌రెడ్డి, కొండవలస లక్ష్మణరావు, మల్లిఖార్జునరావు, వేణుమాధవ్‌, లక్ష్మీపతి, మాడా వెంకటేశ్వరరావు, ఎం.ఎస్‌.నారాయణ, చలపతిరావు, గుండు హనుమంతరావు, శకుంతల,  డా.ఎన్‌.శివప్రసాద్‌, మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ వంటి నటీనటులు ఈ 18 సంవత్సరాల్లో కన్నుమూశారు.

ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఇ.వి.వి.సత్యనారాయణ ఈ సినిమా విడుదలైన 5 సంవత్సరాలకే అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఇ.వి.వి. డైరెక్ట్‌ చేసిన ప్రతి సినిమాకీ స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌గా ఉండే ఆయన సోదరుడు ఇ.వి.వి.గిరి కూడా చనిపోయాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన వి.జయరాం కూడా ఇటీవల చనిపోయారు. ఇలా ఒక సినిమాకి పనిచేసిన ఇంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఇంత తక్కువ కాలంలో మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవడం అనేది నమ్మశక్యం కాని విషయమే.