English | Telugu
జమున.. మూడు తరాలు.. ముగ్గురూ కళాకారిణులే!
Updated : Jun 25, 2021
ఇది 40 ఏళ్ల క్రితం నాటి పాత ఫొటో. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురు.. మూడు తరాలకు ప్రతినిధులు.. కౌసల్యాదేవి, జమున, స్రవంతి. అంతేకాదు, భిన్న రంగాల్లో నిష్ణాతులైన కళాకారిణులు కూడా. నటిగా జమున మనందరికీ తెలుసు. తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ గొప్ప నటీమణుల్లో ఆమె ఒకరు. ఏ పాత్ర చేసినా, ఆ పాత్రలో ఇట్టే ఒదిగిపోయే ప్రతిభావంతురాలుగా ఆమె పేరు పొందారు. ప్రజానటిగా ఆమె గుర్తింపుపొందారు.
జమున తల్లి నిప్పణి కౌసల్యాదేవి హరికథా భాగవతార్. ఆమె తన 12వ ఏట నుంచే హరికథలు చెప్తూ ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇతర రాష్ట్రాలలోనూ అనేక ప్రశంసలు పొందారు. జమున రెండో ఏట నుంచే సంగీతంపై ఆసక్తి చూపిస్తూ డాన్స్ చేస్తుండేవారు. ఆమెను నటిగా తీర్చిదిద్దాలని కౌసల్యాదేవి కోరుకున్నారు. అమ్మ ఆశయానికి తగ్గట్లే నటిగా మారి, అశేష ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు జమున.
కౌసల్యాదేవి జీవించి ఉండగా, తన మనవరాలు స్రవంతిని కూడా ఓ కళాకారిణిగా చూడాలని కోరుకున్నారు. తమ మూడు తరాలు కళకు సేవ చేసినవాళ్లుగా, తమది కళాకారుల వంశంగా చెప్పుకోవాలని ఆశపడ్డారు. అయితే కౌసల్యాదేవి కానీ, జమున కానీ స్రవంతిని కూడా సినీ హీరోయిన్‌గా చూడాలని ఆశించారు. రమణారావుతో వివాహం జరిగాక తనకు ఓ ఆడపిల్ల పుట్టాలని జమున కలలు కన్నారు. మంత్రాలయ రాఘవేంద్రస్వామి భక్తురాలైన ఆమె అనేకసార్లు మంత్రాలయం వెళ్లి ఈ కోరికనే కోరుకున్నారు. ఆమె పూజలు ఫలించి స్రవంతి పుట్టింది.
అయితే స్రవంతిని సినీ హీరోయిన్ చేయాలన్న జమున ఆశలు నెరవేరలేదు. ఆమెకు అవకాశాలు రాకపోవడంతో, కూతుర్ని హీరోయిన్‌గా ఓ టెలీ సీరియల్ తీశారు. కానీ స్రవంతి దృష్టి నటన మీదకంటే చిత్రలేఖనం మీదే ఎక్కువగా ఉంది. అందుకే దానిలో శిక్షణ పొంది, ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ అబ్‌స్ట్రాక్ట్ ఆర్టిస్టుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గీచిన అబ్‌స్ట్రాక్ట్ చిత్రాలు చూసి శభాష్ అనకుండా ఉండలేరు.
మొదట్లో తను అనుకున్నట్లు స్రవంతి నటిగా స్థిరపడకపోయినా, చిత్రకారిణిగా మంచి పేరు తెచ్చుకోవడం జమునకు గర్వకారణంగానే ఉంటుంది. మొత్తానికి తను కూడా కళాకారిణి కావాలనుకున్న అమ్మమ్మ కోరికను నెరవేర్చి, కళాకారుల వంశం అనే మాటను స్రవంతి నిలబెట్టింది. అన్నట్లు స్రవంతి కుమారుడు అవిష్ కూడా తల్లికి సరైన వారసుడిగా పెయింటింగ్‌లో ప్రతిభ చూపిస్తున్నాడు.