English | Telugu
'మిర్చి'తో రిఎంట్రీ ఇచ్చిన నదియా గురించి మీకు తెలీని నిజాలు!
Updated : Jun 26, 2021
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాషలో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఇతర భాషల్లోనూ నటించడం, రాణించడం కొత్తేమీ కాదు. ఆ కోవకు చెందిన తార.. నదియా. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన 'మిర్చి' మూవీలో ప్రభాస్ తల్లిగా రిఎంట్రీ ఇచ్చిన ఆమె ఒకప్పుడు మోస్ట్ గ్లామరస్ సౌత్ ఇండియన్ హీరోయిన్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. మలయాళం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి, తమిళ చిత్రాలలో అగ్ర నాయికగా పేరు తెచ్చుకున్న తర్వాతే ఆమె టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారనే విషయం చాలామందికి తెలీదు.
అవును. సూపర్‌స్టార్ కృష్ణ పెద్దకుమారుడు రమేశ్‌బాబు సరసన నటించిన 'బజారు రౌడీ' ఆమె తొలి తెలుగు చిత్రం. తొలి తెలుగు సినిమాలోనే డ్యూయల్ రోల్ చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఓ విశేషం. ఆమె గురించి చాలా మందికి తెలీని విషయాలు, నిజాలేమిటో తెలుసుకుందాం...
నదియా స్వస్థలం కేరళలోని కొళ్లం సమీపాన ఉన్న వత్తనంతిట్ట గ్రామం. ఆమె అక్కడే జన్మించారు. ఆమె అసలు పేరు జరీనా. ఆమె తండ్రి మొయిదు టాటా కంపెనీలో ఉద్యోగరీత్యా బొంబాయిలో నివాసం ఏర్పరచుకున్నప్పటికీ నదియా మాత్రం తన చెల్లెలితో పాటు మామ్మగారి వద్దనే ఉండి కేరళలో తన చదువు కొనసాగించారు. బాల్యం నుంచి నాట్యం, నటనపై ఆమెకు అభిలాష ఎక్కువ. సినిమాలు ఎక్కువగా చూసేవారు. అయితే ఉత్సాహం ఉన్నా తగిన వసతి లేకపోవడంతో నదియా నాట్యం నేర్చుకోలేకపోయారు. స్కూల్లో క్లాస్‌మేట్ అయిన ఓ అమ్మాయి ఆమెకు బాగా సన్నిహితురాలు. వాళ్లింటికి వెళ్తుండేవారు. ఆ అమ్మాయి తండ్రి ఎవరో కాదు.. పాపులర్ డైరెక్టర్ ఫాజిల్!
ఒకరోజు ఫ్రెండ్ ఇంటికి యథాలాపంగా వెళ్లిన నదియాను చూసిన ఫాజిల్, "నువ్వు సినిమాల్లో నటిస్తావా?" అనడిగారు. ఆయన తమాషాకి అడిగారనుకున్నారు నదియా. అప్పటికే ఆయన 'మైడియర్ కుట్టిచేతన్' లాంటి 3డి ఫిల్మ్‌ను తీశారు. అయితే ఫాజిల్ ఆమెను అడగడంతో సరిపుచ్చకుండా, ఆమె మామ్మగారిని కలుసుకొని అడిగారు. ఈ విషయం బొంబాయిలో ఉన్న నదియా తండ్రిని అడగమని ఆమె చెప్పారు. నదియా తండ్రి స్వగ్రామానికి వచ్చినప్పుడు ఫాజిల్ ఆయనను కూడా అడిగారు. కుమార్తెను సినిమాల్లో చేర్పించడానికి నదియా తండ్రి మొదట అంగీకరించలేదు. కానీ తను నటిస్తానని నదియా పట్టుపట్టారు. దాంతో ఆయన ఒప్పుకోక తప్పలేదు.
ఫాజిల్ ఆమెను నదియాగా చిత్రరంగానికి పరిచయం చేశారు. ఆ పేరు నచ్చి దానితోనే కంటిన్యూ అయిపోయారు జరీనా అలియాస్ నదియా. అలా ఫాజిల్ డైరెక్ట్ చేసిన 'నొక్కేత్త దూరత్తు కణ్ణుమ్ నట్టు' (1984)తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు నదియా. ఆ సినిమా తర్వాత 'పూవే పూచూడవా' పేరుతో తమిళంలోనూ, 'ముద్దుల మనవరాలు' పేరుతో తెలుగులోనూ వచ్చింది. 'నొక్కేత్త దూరత్తు కణ్ణుమ్ నట్టు'లో నదియా అమ్మమ్మగా సుప్రసిద్ధ నటి పద్మిని నటించారు. చాలా కాలం విరామంతో ఈ సినిమాతో రిఎంట్రీ ఇచ్చారు పద్మిని. ఇక ఈ సినిమాలో హీరో.. ఆ తర్వాత కాలంలో సూపర్‌స్టార్ అయిన మోహన్‌లాల్.
అమ్మమ్మ మృతి చెందడంతో నదియా బొంబాయిలో ఉంటున్న తండ్రి దగ్గరకు వెళ్లిపోయారు. ఈలోగా ఆమె మూడు మలయాళ చిత్రాల్లో నటించారు. ఆ టైమ్‌లో మళ్లీ ఫాజిల్ నుంచి కబురు వచ్చిందామెకు. ఆమె నటించిన తొలి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నట్లు, అందులోనూ హీరోయిన్‌గా నటించాలంటూ ఆయన అడిగారు. సరేనన్నారు నదియా. అలా 'పూవే పూచూడవా' మూవీతో తమిళ రంగానికి హీరోయిన్‌గా ఆమె ఇంట్రడ్యూస్ అయ్యారు. మలయాళ ఒరిజినల్‌కు మంచి ఈ తమిళ రీమేక్ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. అంతేకాదు ఫస్ట్ మలయాళం ఫిల్మ్ ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందిస్తే, తమిళంలో ఫస్ట్ ఫిల్మ్ నామినేషన్ అందించింది. ఆ తర్వాత తమిళంలో బిజీ అయిపోయి టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగారు నదియా.
ఆ తర్వాత రమేశ్‌బాబు సరసన నాయికగా బజారు రౌడీ (1988)లో నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి ఆమె ఎంటరయ్యారు. ఆ సినిమాలో పత్రికా సంపాదకురాలిగా, సంపన్న యువతిగా రెండు పాత్రలు చేసి, ఆకట్టుకున్నారు. అదే ఏడాది ఆమె పెళ్లి చేసుకోవడంతో ఎక్కువ సినిమాల్లో నటించలేదు. అప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసి, కొన్నాళ్లకు భర్తతో కలిసి యు.ఎస్. వెళ్లిపోయారు. అక్కడ్నుంచి లండన్‌కు వెళ్లి, ఏడేళ్లు ఉన్నాక, 2008లో తిరిగి ఇండియాకు వచ్చి, ముంబైలో నివాసం ఉంటున్నారు. తమిళ సినిమా 'ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి' ('అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి'కి రీమేక్) మూవీలో జయం రవి తల్లిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నదియా, 'మిర్చి' (2011) మూవీతో మళ్లీ టాలీవుడ్‌కు తిరిగొచ్చారు.