English | Telugu
1953లోనే తెలుగు సినిమాలో రెండు హిందీ పాటలు!
Updated : Jun 25, 2021
మహానటుడు చిత్తూరు నాగయ్య కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన మరపురాని చిత్రం 'నా ఇల్లు'. అదివరకు రేణుకా ఫిలిమ్స్ పతాకంపై తొలి యత్నంగా 'త్యాగయ్య' లాంటి క్లాసిక్ ఫిల్మ్‌ను నిర్మించిన ఆయన, అవరిండియా పతాకంపై నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రానికి సంగీతం కూడా ఆయనే సమకూర్చడం మరో విశేషం. అద్దేపల్లి రామారావు సంగీత సహకారం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో తీసిన ఈ మూవీలో నాగయ్య సరసన టి.ఆర్. రాజకుమారి నటించారు.
ఈ చిత్రంలో బ్యాంకు ఉద్యోగి శివరామ్ పాత్రను నాగయ్య చేశారు. కథానుసారం ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. సంగీతం అంటే ప్రాణమైన దంపతులిద్దరూ తమ పిల్లలకు కూడా సంగీతం నేర్పాలనుకుంటారు. ధనరాజ్ అనే ఒక దుర్మార్గుడు పన్నిన పన్నాగంలో భాగంగా లీల అనే వగలాడి వలలో పడటమే కాకుండా, బ్యాంకు డబ్బును కూడా పోగొట్టి జైలు పాలవుతాడు శివరామ్. తిరిగి వచ్చేసరికి తన కుటుంబం కనిపించదు. జీవిక కోసం పాకీ పనికి కూడా సిద్ధపడతాడు. ఈలోగా బాలానంద సంఘం ప్రోత్సాహంతో పిల్లలు ప్రయోజకులవుతారు. దుర్మార్గుల బండారం బయటపడి, శివరామ్ తన కుటుంబాన్ని కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది. ధనరాజ్‌గా ముదిగొండ లింగమూర్తి, లీలగా విద్యావతి (జయలలిత పిన్ని) నటించారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం, నాగయ్య సంగీతం కలిసి అందమైన పాటలను సృష్టించాయి. 'అదిగదిగో గగనసీమ.. అందమైన చందమామ ఆడెనోయీ' అంటూ సాగే పాట అపురూప గీతాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన ఇంకో విశేషం.. బొంబాయిలో కథ జరిగినప్పుడు అందుకు అనుగుణంగా రెండు హిందీ పాటలను పెట్టారు. అవి రెండూ డాన్స్ సీక్వెన్సులుగా వస్తాయి. 'హరి హరి పుష్పా హరి', 'మై హస్తీ గడీ ఆయీ' అంటూ సాగే ఆ పాటలను మీనా కపూర్ ఆలపించారు. అవి సందర్భానుసారం రావడం వల్ల కథాగమనానికి అడ్డు కాలేదు. అలా హిందీ పాటలను పెట్టిన తొలి తెలుగు సినిమాగా 'నా ఇల్లు' నిలిచింది.