English | Telugu

'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట వెనుక క‌థ‌!

సంగీతం విష‌యంలో స్వ‌ర‌బ్ర‌హ్మ కె.వి. మ‌హ‌దేవ‌న్‌కు ప్ర‌త్యేక‌మైన అభిప్రాయాలున్నాయి. చెవికి ఇంపుగా ఉండే ఏ పాటైనా సంగీత‌మే అనేవారు. 1960ల‌లో సాలూరు రాజేశ్వ‌ర‌రావు, పెండ్యాల‌, ఘంట‌సాల లాంటి లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌కు సాటిగా బాణీలు కూర్చిన మ‌హ‌దేవ‌న్‌, 1970ల‌లో చ‌క్ర‌వ‌ర్తి, స‌త్యం నుంచి గ‌ట్టి పోటీ ఎదుర్కొన్నారు. 1980ల‌లో వృద్ధాప్యం మీద ప‌డినా కూడా చ‌క్ర‌వ‌ర్తి, ఇళ‌య‌రాజాతో త‌ల‌ప‌డ్డారు. మూడు ద‌శాబ్దాల పాటు అంద‌రి పోటీని త‌ట్టుకొని నిలిచిన ఏకైక సంగీత ద‌ర్శ‌కుడు మామ‌.

వ‌య‌సు పెరిగే కొద్దీ ప్ర‌తిభ త‌రిగిపోతుందంటారు. కానీ మ‌హ‌దేవ‌న్ అందుకు మిన‌హాయింపు. ఆయ‌న‌ది ఎంత త‌వ్వినా త‌ర‌గ‌ని స్వ‌రాల ఊట‌. ఎన్నో మెలోడీ సాంగ్స్‌కు ప్రాణం పోసిన ఆ గ్రేట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ 'అడ‌వి రాముడు' (1977) సినిమాకు సంగీతం అందించిన పాట‌లు ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాయో మ‌న‌కు తెలుసు. కుర్ర‌కారుని కుదిపేసిన ఆ పాట‌ల‌కు బాణీలు కూర్చే నాటికి ఆయ‌న వ‌య‌సు 59 ఏళ్లంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఆ వ‌య‌సులో అంత ఘాటైన పాట‌ల‌కు మ్యూజిక్ కంపోజ్ చేయ‌గ‌ల‌గ‌డం మ‌హ‌దేవ‌న్‌కే సాధ్యం!

'అడ‌వి రాముడు' సినిమాలో "ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ.." పాట ట్యూన్ ఒక్క‌టి చాటు ఆయ‌న నిత్య య‌వ్వ‌న‌వంతుడ‌ని చెప్ప‌డానికి. ఆ పాట రాసింది వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి. అప్ప‌టిదాకా ఆయ‌న ఈ త‌ర‌హా పాట‌లు రాయ‌లేదు. అంటే ఆయ‌న రాసిన తొలి ఫుల్ మాస్ సాంగ్ అదే. 'ద‌స‌రా బుల్లోడు' సినిమాలోని "అరెరె ఎట్టాగో ఉంటాది ఓల‌మ్మీ.." పాట త‌ర‌హాలో "అరెరె ఆరేసుకోబోయి.." అంటూ పాట చేస్తే బాగుంటుంద‌ని నిర్మాత‌ల్లో ఒక‌రైన నెక్కంటి స‌త్య‌నారాయ‌ణ సూచించారు. "అలా చేయ‌కూడ‌దు.. అరెరెరెల‌ని చివ‌రికి పెట్టి చేయాలి." అని క‌చ్చితంగా చెప్పారు. చెబుతూనే ఆ పాట‌కు ట్యూన్స్ క‌ట్టి పాడారు మామ‌.

ఎన్టీఆర్‌, జ‌య‌ప్ర‌ద జంట‌పై చిత్రీక‌రించిన ఆ పాట సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో దాన్ని 'కోటి రూపాయ‌ల పాట' అని పిలిచేవారు. వాడ‌వాడ‌లా ఆ పాట మోగిపోయింది. కేవ‌లం ఆ పాట కోస‌మే ప‌దే ప‌దే 'అడ‌వి రాముడు'ను చూసిన వాళ్లున్నారంటే న‌మ్మాలి.