English | Telugu
మహానటి సావిత్రి ఫస్ట్ మేకప్ స్టిల్!
Updated : Jun 21, 2021
ఒకరోజు మార్నింగ్ ఒకాయన ఒక అమ్మాయితో స్టిల్ ఫొటోగ్రాఫర్ ఆర్.ఎన్. నాగరాజారావు ఇంటికి వెళ్లారు. "ఈ అమ్మాయి నా కూతురు. సినిమాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు ఈమె స్టిల్స్ తీస్తే నిర్మాతలకు చూపించడానికి సౌకర్యంగా ఉంటుంది." అని చెప్పారు. ఆయన పేరు చౌదరి. ఆయన కోరినట్లే ఆ అమ్మాయిని నాగరాజారావు వివిధ భంగిమల్లో ఫొటోలు తీశారు.
ఆ అమ్మాయికి ఆ తర్వాత ఓ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఆ చిత్రం 'సంసారం' (1950). ఎల్వీ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాను రంగనాథ దాస్ నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు హీరోలుగా నటించారు. అయితే ఆ అమ్మాయికి ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఆమె ముఖవర్ఛస్సు బాగాలేదని ఆ అమ్మాయిని 'సంసారం'లోంచి తీసేశారు. ఆ వేషాన్ని లక్ష్మీరాజ్యంకు ఇచ్చారు.
కానీ ఆ అమ్మాయి తర్వాత కాలంలో తెలుగు, తమిళ చిత్రాల్లో తిరుగులేని నాయిక అయ్యింది. నటనలో తనదైన బాణీని సృష్టించి ఎందరికో మార్గదర్శకురాలు అయ్యింది. నటనాపరంగా ఓ బెంచ్‌మార్క్ సృష్టించింది. 'సంసారం' మూవీ నుంచి తొలగించబడ్డ ఆ అమ్మాయే.. సావిత్రి! కాదు కాదు.. మహానటి సావిత్రి! ఇది నాగరాజారావు తీసిన ఆమె తొలి మేకప్ స్టిల్.