English | Telugu
అర్జున్ భార్య రమేశ్‌బాబు పక్కన హీరోయిన్‌గా చేసిందని తెలుసా?!
Updated : Jun 21, 2021
ఉదయం తొమ్మిది గంటలు.. బెంగళూరు సిటీ.. చల్లగా, ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంత వాతావరణంలో జయానగర్ ప్రాంతం మాత్రం కోలాహలంగా ఉంది. అక్కడి బెళగోడు కల్యాణ మంటపం మంగళతోరణాలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మంగళవాయిద్యాల ఘోష మార్మోగుతోంది. ముఖద్వారం దగ్గర స్వాగత బృందం అతిథులకు పువ్వులతో, పన్నీటి జల్లులతో, తీపి కలకండతో స్వాగతం పలుకుతోంది. ఆ బృందంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
కల్యాణ మంటపం సందడిని మించి వెలుపల పోలీసుల హడావిడి ఎక్కువగా ఉంది. కారణం.. అక్కడ జరిగే వివాహానికి విచ్చేస్తున్న సెలబ్రిటీలను చూసేందుకు వచ్చిన అభిమాన సందోహం! ఆ వివాహానికి వచ్చిన తారల్లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, కైకాల సత్యనారాయణ, రాధిక, శరత్‌బాబు, గిరిబాబు, రంగనాథ్, గొల్లపూడి మారుతీరావు, రాళ్లపల్లి, కోట శ్రీనివాసరావు, సుదర్శన్, జయంతి, శరణ్య, హేమా చౌదరి, దర్శకులు కె.ఎస్.ఆర్. దాస్, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు, నిర్మాతలు డి. రామానాయుడు, ఎస్పీ వెంకన్నబాబు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఇట్లా అనేకమంది ఉన్నారు.
పది గంటలకు కల్యాణ మంటపం ఎటుచూసినా కిటకిటలాడుతోంది. హాలు పట్టనంత జనం. అతిథులకు పురోహితులు అక్షింతలు అందజేశారు. అందరి దృష్టీ వధూవరుల మీదే.. ముహూర్త సమయం దగ్గరపడటంతో మంగళవాయిద్యాల ఘోష మిన్నంటింది.
ఆశీర్వచనాల అక్షింతల మధ్య వరుడు అర్జున్, వధువు నీతూ మెడలో మూడుముళ్లు వేశాడు. ఆ విధంగా రమేశ్‌బాబు 'కృష్ణగారి అబ్బాయి' (1989) హీరోయిన్ నీతూ (కన్నడ నటుడు రాజేశ్ కుమార్తె) యాక్షన్ కింగ్ అర్జున్ నిజజీవిత హీరోయిన్ అయింది. అర్జున్ కూడా సుప్రసిద్ధ కన్నడ నటుడు దివంగత శక్తిప్రసాద్ కుమారుడు.
'డాక్టర్ గారబ్బాయి' (1988) చిత్రంలో కలిసి నటిస్తున్న సమయంలో అర్జున్, నీతూ మధ్య ఏర్పడిన సన్నిహితత్వం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసింది. 1988 ఫిబ్రవరి 8న వారి వివాహం జరిగింది. నీతూ అసలు పేరు నివేదిత. ఆ క్యూట్ కపుల్‌కు ఇద్దరు అందమైన కూతుళ్లు.. ఐశ్వర్య, అంజన. 2013లో ఐశ్వర్య హీరోయిన్‌గా వెండితెర మీదకు వచ్చింది.