English | Telugu
అక్కినేనిని మొట్టమొదట సినిమాల్లోకి తీసుకువెళ్లిందెవరో తెలుసా?
Updated : May 14, 2021
నాటకరంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చి దశాబ్దాల పాటు అగ్రనటులుగా రాణించిన వారు అరుదు. ఆ అరుదైన నటుడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. జానపద చిత్రాలతో చలనచిత్ర రంగంలోకి వచ్చిన అక్కినేని ఆ తర్వాత సాంఘిక చిత్రాలలో.. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాలలో, విషాద పాత్రల్లో తనను మించిన వారు లేరనిపించుకున్నారు. ఏఎన్నార్ 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లాల్లోని వెంకటరాఘవాపురం (ఇప్పుడు రామాపురం)లో జన్మించారు. ఆయన స్వగ్రామంలో ఎలిమెంటరీ స్కూలు పైన చదువు లేదు. అందువల్ల రోజూ రెండు మైళ్లు నడిచి, పెదవిరివాడకు వెళ్లి అక్కడ చదువుకుంటూ ఉండేవారు.
ఆ రోజుల్లోనే ఆయన వాళ్ల ఊర్లో కొందరు కుర్రాళ్లతో కలిసి పిల్లల నాటకాలాడి స్థానికంగా పేరు సంపాదించారు. అలా ఆయన మొట్టమొదట పాల్గొన్న నాటకం 'సావిత్రి'. అందులో నాగేశ్వరరావు ధరించిన పాత్ర నారదుడు. నాగేశ్వరరావు పెద్దన్న రామబ్రహ్మంగారికి నాటకాల సరదా ఎక్కువ. ఆయనకు నాగేశ్వరరావు మంచి నటుడవుతాడన్న నమ్మకం ఉండేది. అప్పటికి నాగేశ్వరరావు మూడో ఫారం చదువుతున్నారు. ఈ చదువులు తమవల్ల కాదనీ, చదివించి ప్రయోజనమూ ఉండదనీ, నటుడిగా పైకి వస్తే లాభిస్తుందనీ రామబ్రహ్మంగారి ఆలోచన. ఆ ఆలోచనతో నెలకు రెండు రూపాయలిచ్చి నాగేశ్వరరావును కుదరవల్లిలోని ఓ నాటక సమాజంలో సభ్యునిగా చేర్చారు.
పరిస్థితులు బాగాలేక చదువు ఆపేసిన తమ్ముడ్ని ఎలాగైనా సినిమాల్లో చేర్పించాలనే ఆలోచనతో రామబ్రహ్మంగారు తనకు పరిచయమున్న కాజ వెంకట్రామయ్య ద్వారా దర్శకుడు పి. పుల్లయ్యకు పరిచయం చేయించి, 'ధర్మపత్ని'(1941)లో నటించేట్లు చేశారు. శాంతకుమారి, ఉప్పులూరి హనుమంతరావు ప్రధాన పాత్రధారులైన అందులో అక్కినేని ఓ చిన్న వేషం వేశారు. ఆ సినిమా నాగేశ్వరరావుకు కలిసిరాలేదు. రామబ్రహ్మంగారికి కూడా స్టేజిమీదనే గురి కుదిరినట్లు కనిపిస్తుంది. ఆయన నాగేశ్వరరావును గుడివాడ తీసుకుపోయి అప్పటికి కుచేల, హరిశ్చంద్ర నాటకాలాడుతున్న వై. భద్రాచారికి అప్పగించారు. గుడివాడ చేరేదాకా అక్కినేని ఒక ప్రసిద్ధ నటుడ్ని కానీ, నాటకాన్నీ కానీ ఎరుగరు. అలాంటిది భద్రాచారి వెంట ఉండగా ఆయనకు పులిపాటి వెంకటేశ్వర్లు, కె. రఘురామయ్య లాంటి ఇద్దరు హేమాహేమీల పక్కన నటించే అవకాశం కలిగింది.