English | Telugu

15 రోజుల క్వారంటైన్ త‌ర్వాత.. పిల్ల‌ల్ని చూసి ఎమోష‌న‌ల్ అయిన బ‌న్నీ!

 

కొవిడ్‌-19 పాజిటివ్‌గా టెస్ట్‌లో నిర్ధార‌ణ అయ్యాక స్వీయ ఐసోలేష‌న్‌లో ఉండిపోయారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. భార్య స్నేహారెడ్డితో ట‌చ్‌లో ఉంటున్నా పిల్ల‌ల‌ను ఆయ‌న బాగా మిస్స‌వుతూ వ‌చ్చారు. వీడియో కాల్స్‌లోనే వారిని చూసుకుంటూ తృప్తి ప‌డ్డారు. 15 రోజులు క్వారంటైన్‌లో ఉన్న త‌ర్వాత టెస్ట్‌లో నెగ‌టివ్ రావ‌డంతో, క్వారంటైన్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు బ‌న్నీ. 

త‌న ఇంట్లోకి వ‌చ్చి ఫ్యామిలీని.. ప్ర‌ధానంగా పిల్ల‌ల్ని చూసి భావోద్వేగానికి గుర‌య్యారు. మొద‌ట కొడుకు అయాన్ ఎదురుప‌డ‌గానే ద‌గ్గ‌ర‌కు ర‌మ్మ‌ని పిలిచి గ‌ట్టిగా హ‌త్తుకుని, ఫ్లోర్‌పై కింద‌ప‌డి దొర్లాడారు.

ఆ త‌ర్వాత గారాల‌ ప‌ట్టి అర్హ‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకొని ముద్దుల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. వారికి మ‌రోసారి అయాన్ తోడ‌య్యాడు.

ఆ వీడియోను త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన బ‌న్నీ, "Meeting family after testing negative and 15 days of quarantine. Missed the kids soo much." అంటూ క్యాప్ష‌న్ జోడించాడు. ఇద్ద‌రు పిల్ల‌ల్నీ బ‌న్నీ బిగియార కౌగ‌లించుకుంటున్న‌ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. 

అంత‌కు కొద్ది సేప‌టి ముందు త‌న‌కు లేటెస్ట్‌గా టెస్ట్‌లో నెగ‌టివ్‌గా నిర్ధార‌ణ అయ్యింద‌ని త‌న సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్ర‌క‌టించారు. త‌న‌కు ప్రేమ‌ను పంచిన అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. "హ‌లో ఎవిరివ‌న్‌! 15 రోజుల క్వారంటైన్ అనంత‌రం నేను టెస్ట్‌లో నెగ‌టివ్‌గా తేలింది. నాకు విషెస్ చెప్పిన‌, నా కోసం ప్రార్థించిన శ్రేయోభిలాషులు, అభిమానులంద‌రికీ థాంక్స్ చెప్పాల‌నుకుంటున్నా. కేసులు త‌గ్గ‌డానికి ఈ లాక్‌డౌన్ స‌హాయ‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నాను. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి. మీ ప్రేమ‌కు కృత‌జ్ఞ‌డ్ని." అని ఆ నోట్‌లో రాసుకొచ్చారు అల్లు అర్జున్‌.