English | Telugu
మొదటి ఔట్‌డోర్ షూటింగ్‌లోనే భయానక అనుభవం ఎదుర్కొన్నా!
Updated : May 15, 2021
తెలుగు, తమిళ, మలయాళం భాషలు మూడింటిలోనూ రాణించి, అగ్రతారగా పేరు తెచ్చుకున్నారు రాధ. తన కాలంలో సౌత్ ఇండియాలోని మోస్ట్ గ్లామరస్ హీరోయిన్‌లలో ఆమె ఒకరు. 1981లో ఆమె నటిగా చిత్రసీమలో ప్రవేశించారు. ఈ సినిమాల కోసం ఔట్‌డోర్ షూటింగ్‌లకని ఎన్నో ప్రదేశాలు ఆమె చూశారు. అయితే తన జీవితంలో మరపురాని ఔట్‌డోర్ షూటింగ్ అనుభవం తన తొలి చిత్రం 'అలైగళ్ ఓయివదిల్లై' (తెలుగులో 'సీతాకోకచిలుక')కి ఎదురయ్యిందని చెప్పారు. దీనికి కారణం ఆ సినిమా పూర్తిగా ఔట్‌డోర్‌లో నిర్మించింది కాబట్టి. చిత్రకథకు అనుగుణంగా ఉండే ప్రదేశం నాగర్‌కోయిల్‌ను ఎంచుకున్నారు చిత్ర నిర్మాత, దర్శకులు. అప్పుడు రాధ పదో క్లాస్ చదువుతున్నారు. అంటే ఆ షూటింగ్ 1981 మొదట్లో జరిగింది.
"అప్పట్లో నాకు ఓ సరదా ఉండేది.. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి రైలులో ప్రయాణంచేసి అందమైన ప్రదేశాలను చూడాలని, అక్కడే కొన్ని రోజుల పాటు ఉండి, అందరితోనూ సరదాగా కాలం గడపాలని. ఆ కోరిక నా తొలి చిత్రం ఔట్‌డోర్ షూటింగ్‌తో తీరింది. ఒక సినిమా షూటింగ్ కోసం మరో ప్రదేశం వెళ్లి రెండు మూడు నెలల పాటు అక్కడే ఉండటం అనేది ఆ సినిమాకే జరిగింది. ఆ తర్వాత ఏ సినిమా షూటింగ్‌కీ ఔట్‌డోర్‌లో అన్ని రోజులు ఉండటం జరగలేదు." అని రాధ చెప్పారు.
కన్యాకుమారికి 19 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగర్‌కోయిల్ పరిసర ప్రాంతాల అందచందాలు ఆమెను ఎంతో ఆకర్షించాయి. "అతి చక్కని సముద్రతీరం, ఎక్కడ చూసినా రబ్బరు తోటలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం ఎవరినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సహజ ప్రకృతి సౌందర్యం అనేది మనం అక్కడే చూస్తామేమోనని కూడా అనిపించింది నాకు. అక్కడ ముట్టామ్ అనే బీచ్ రిసార్ట్‌లో నేనూ, హీరోగా నటిస్తోన్న కార్తీక్ కలిసి పాట పాడుతూ సముద్రపు కెరటాలలో మునిగి తేలుతూ ఉండే సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సముద్రపుటొడ్డున అలల మధ్యన పడుకొని ఉంటే, కార్తీక్ నా మీద వాలి నన్ను కౌగలించుకొనే సన్నివేశంలో ఉధృతమైన కెరటాల ధాటికి నేను సముద్రంలోకి కొట్టుకొని పోయాను. ఆ సందర్భంలో కార్తీక్ నన్ను పట్టుకొని కాపాడ్డానికి ప్రయత్నించాడు. అంతలోనే మా యూనిట్ మెంబర్స్ కొంతమంది వచ్చి నన్ను ఆ భయంకర స్థితి నుంచి కాపాడి, ఒడ్డుకు చేర్చారు. ఆ ఘటన తలచుకున్నప్పుడల్లా నాకు ఒక విధమైన భయం, ఆశ్చర్యం కలుగుతుంటాయి." అని తొలి సినిమా సందర్భంలోనే తనకు ఎదురైన భయానక అనుభవం గురించి రాధ చెప్పుకొచ్చారు.
అక్కడ గడిపిన రెండు మూడు నెలల్లో ఈ ఒక్క దుస్సంఘటన తప్ప మిగిలిన రోజులన్నీ ఎంతో ఆనందంగా ఆమెకు గడిచాయి. "ఉదయాన్నే ఆరు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ షూటింగ్‌లో పాల్గొనడం, ఆ తర్వాత ఆ ఊళ్లోని వింతలు, విశేషాలు చూడ్డానికి బయల్దేరడం నా కార్యక్రమం అన్నమాట. నాగర్ కోయిల్‌లోని అన్ని ముఖ్య ప్రదేశాలూ చూశాను. ముట్టామ్ బీచ్ రిసార్ట్ సమీపంలో ఉన్న సెయింట్ జేవియర్ చర్చ్ నన్నెంతో ఆకట్టుకుంది. దేవాలయాలకీ, శిల్పకళకీ పేరుప్రఖ్యాతులు పొందిన పట్నం నాగర్‌కోయిల్. కన్యాకుమారి జిల్లాలో ఉన్న ముఖ్యమైన పట్టణం నాగర్‌కోయిల్ ఒక్కటే. అక్క ఉన్న సరస్సులు విరబూసిన ఎర్రతామరలతో ఎర్రతామరపూల పరుపులా చూపరులకు గోచరిస్తాయే తప్ప అక్కడ సరస్సులో నీరున్నదన్న మాట మాత్రం తలపుకు రాదు. అంత విరివిగా ఉంటాయి తామరపూలు." అని ఆమె తెలిపారు.
అక్కడకు సమీపంలోనే ఉన్న కన్యాకుమారి వెళ్లి వివేకానంద రాక్ మెమోరియల్ చూసిందామె. "అక్కడ బీచ్.. మద్రాసులోని మెరీనా బీచ్‌లా కాకుండా ఉదయం నుండీ సాయంత్ర వరకూ ఎప్పుడూ దేశవిదేశీ టూరిస్టులతో రద్దీగా, సందడిగా ఉంటుంది. కన్యాకుమారిలోని మరో విశేషం ఉదయాస్తమయాలు. కన్యాకుమారి సముద్రతీర ప్రాంతంలో ఉదయాస్తమయాల అందాలు చూసి అనుభవించాలే తప్ప మాటల్లో చెప్పడానికి వీలుపడదు అని నా అభిప్రాయం. అంత అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది." అని చెప్పుకొచ్చారు రాధ.