English | Telugu
'దేవదేసు' నిర్మాణం మధ్యలోనే హఠాన్మరణం పాలైన సంగీత దర్శకుడు! కారణం ఇదే..
Updated : Jun 18, 2021
తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా యావద్భారత చలనచిత్ర రంగాన్ని ఒక్కసారిగా తనవైపు తేరిపార చూసేట్టు చేసిన సినిమా వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన 'దేవదాసు'. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్ర నట జీవితంలోను, ఘంటసాల, సముద్రాల రాఘవాచార్య గాన సాహిత్య జైత్రయాత్రలోను అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ చిత్రం 1953లో రిలీజయింది. ఈ చిత్రానికి సంగీతం అందించింది సి.ఆర్. సుబ్బరామన్.
'దేవదాసు' సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే కేవలం తన 29వ ఏటనే సుబ్బరామన్ హఠాన్మరణం చెందారు. ఆయన మృతిపై అనేక ఊహాగానాలు రేకెత్తాయి. ఎందుకంటే ఆయన 'దేవదాసు' చిత్ర నిర్మాణ సంస్థ వినోదా పిక్చర్స్‌లో వాటాదారు కూడా. ఈ నిజాన్ని ఆయన ఆకస్మిక మృతి ఘటనకు జోడించి, వాళ్ల మధ్య వ్యాపారపరమైన విభేదాలు వచ్చాయనీ, కొందరు గిట్టనివాళ్లు చేసిన విషప్రయోగానికి ఆయన బలైపోయారనీ చెప్పుకుంటూ ఉంటారు. సుబ్బరామన్‌కు చిన్నతనం నుంచే ఫిట్స్ వచ్చేవి. ఆ ఫిట్సే ఆయన గుండెమీద పనిచేసి ఆయన కన్నుమూసేలా చేశాయి. ఈ విషయాన్ని ప్రముఖ సినీనటులు, రచయిత, నాటకకర్త అయిన రావి కొండలరావు తెలియజేశారు.
సుబ్బరామన్‌కు అసిస్టెంట్ అయిన ఎమ్మెస్ విశ్వనాథన్ గురువు ఒప్పుకున్న సినిమాలన్నింటినీ ఎంతో నిజాయితీతో, గురుభక్తితో వయొలినిస్ట్ అయిన టి.కె. రామ్మూర్తి సహాయంతో పూర్తిచేశారు. ఆ ఇద్దరూ కొన్నాళ్లపాటు 'విశ్వనాథం-రామ్మూర్తి' పేరుతో జంటగా చాలా చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 'దేవదేసు' విషయానికి వస్తే.. ఆ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు, "అందం చూడవయా", "జగమే మాయ" పాటలకు విశ్వనాథమే బాణీలు అందించారు.