English | Telugu
జమున నాన్నగారి చాదస్తం.. 'కన్యాశుల్కం'లో మిస్సయిన బుచ్చమ్మ పాత్ర!
Updated : Jun 18, 2021
గురజాడ అప్పారావు సుప్రసిద్ధ నాటకం 'కన్యాశుల్కం' అదే పేరుతో 1955లో సినిమాగా వచ్చింది. నాటకానికి భిన్నంగా ఉందంటూ ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. కానీ సెకండ్, థర్డ్ రిలీజ్‌లలో శతదినోత్సవాలు జరుపుకొని నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. పి. పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధురవాణిగా సావిత్రి, గిరీశంగా ఎన్టీ రామారావు, రామప్పంతులుగా సీయస్సార్ ఆంజనేయులు, లుబ్దావధాన్లుగా గోవిందరాజుల సుబ్బారావు అద్భుతంగా నటించారు. కీలకమైన మరో పాత్ర బుచ్చమ్మను షావుకారు జానకి అనితరసాధ్యంగా పోషించారు. బాల్య వివాహం కారణంగా చిన్నతంలోనే భర్తను కోల్పోయి వితంతువుగా మారినా అమాయకత్వం తొణికిసలాడే ఆ పాత్రలో జానకి నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.
నిజానికి బుచ్చమ్మ పాత్రకు ఫస్ట్ చాయిస్ జానకి కాదు, ప్రజానటి జమున. అయితే తండ్రి చాదస్తం కారణంగా ఆ పాత్ర ఆమెకు మిస్సయింది. అప్పుడప్పుడే జమున ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటున్నారు. బుచ్చమ్మ పాత్రకు జమున అయితే బాగుంటుందనుకున్న 'కన్యాశుల్కం' నిర్మాత డి.ఎల్. నారాయణ, ఆమెను అడగాలని వారి ఇంటికి వస్తున్నట్లు కబురు చేశారు.
అంత పెద్ద నిర్మాత స్వయంగా మాట్లాడ్డానికి వస్తున్నారంటే.. రావద్దని చెప్పడం సంస్కారం కాదు. పైగా అలా అన్నారంటే.. "వచ్చిన వేషాలన్నీ వద్దంటారు.. అసలెందుకు వాళ్ల దగ్గరకు వెళ్లడం." అని ప్రచారాలు చేసి, అసలు వేషాలే రాకుండా చేయొచ్చు. ఇలాంటి బాధలుంటాయి కాబట్టి, జమున నాన్నగారు బాగా ఆలోచించి ఓ మంచిరోజు చూసుకొని రావచ్చని డి.ఎల్. నారాయణకు కబురు తెలియజేశారు.
డి.ఎల్. తమ ఇంటికి వచ్చేరోజు జమున నాన్నగారు ఆమెకు "అమ్మాయ్.. ఆ డి.ఎల్. చాలా డేంజరస్ మనిషట. మనకు అలాంటి కంపెనీ వద్దు. నువ్వు మాత్రం ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూర్చొని, పనుందని లోపలికి వెళ్లిపో." అని చెప్పారు.
డి.ఎల్. వచ్చారు. నాన్న చెప్పినట్టుగానే జమున ఆయనకు నమస్కారం పెట్టి, పని ఉందంటూ లోపలికి వెళ్లిపోయారు. డి.ఎల్.కు జమున నాన్నగారు కాఫీ తెప్పించి ఇచ్చి గౌరవంగానే ట్రీట్ చేశారు. కానీ ఆయన వేషం విషయం చెప్పగానే, "అమ్మాయి చాలా బిజీగా ఉంది. పైగా వితంతువు వేషం.. సెంటిమెంటల్‌గా ఇష్టం లేదు." అని చెప్పేశారు. అలా బుచ్చమ్మ వేషం జమునకు మిస్సయింది. ఇదే కాదు, తండ్రి చాదస్తం వల్ల తను పలు వేషాలు కోల్పోయినట్లు తన జీవిత చరిత్రలో జమున వెల్లడించారు.